తెలంగాణకు భారీ వర్ష సూచన 

తెలంగాణకు భారీ వర్ష సూచన 

రాష్ట్రానికి వచ్చే రెండ్రోజులు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వాయువ్య దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందన్నారు. దీని ప్రభావంతో తెలంగాణలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే చాన్స్ ఉందన్నారు.

రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు... ఉత్తర, ఈశాన్య, తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. వచ్చే రెండు రోజులు అలర్ట్ గా ఉండాలన్నారు. సాయంత్రం, రాత్రి టైంలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం స్పష్టం చేశారు. 

అల్పపీడన ప్రభావంతో మంచిర్యాల, జగిత్యాల, ములుగు, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుముల, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయన్నారు వెదర్ ఆఫీసర్లు. ఈశాన్య, తూర్పు జిల్లాలకు అలర్ట్స్ ఇచ్చింది.

నిన్న సాయంత్రం హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో ముసురువాన పడింది. ముసురు వానతో సిటీలో లైట్ గా ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. దీంతో రోడ్లపైకి నీరు చేరింది. ఈవినింగ్ టైం కావటంతో ట్రాఫిక్ తో వరంగల్ సిటీలో జనం ఇబ్బంది పడ్డారు. 

కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు వరద కంటిన్యూ అవుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల, శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు ఇన్ ఫ్లో వస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టులు ఫుల్ అవ్వటంతో ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.