పెళ్లికి బాజా మోగింది..!

పెళ్లికి బాజా మోగింది..!

ఆకాశమంత పందిరి..చుక్కలన్నీ వరుసకట్టి నేలమీదకొచ్చినట్టు లైటింగ్​. డప్పుల చప్పుళ్లు, తప్పెట్లు, తాళాలు. జివ్వున దూసుకెళ్లే  రాకెట్స్, చిచ్చుబుడ్డుల నవ్వులు​. చుట్టూ వందలమంది ఆత్మీయులు.. స్నేహితుల కేరింతలు. ఇన్నింటి మధ్య ఒకరికొకరం తోడుగా ఉంటామని చెప్తూ వేసే ఏడడుగులు.పెళ్ళంటే ఈ మాత్రం  హడావిడి ఉంటుంది మరి. కానీ, కొవిడ్​, లాక్​డౌన్​ చాలామందికి ఈ సంతోషాల్ని దూరం చేసింది.  కరోనాకి భయపడి సింపుల్​గా అతికొద్దిమంది బంధువుల మధ్య పెళ్ళిళ్లు చేసుకున్నారు కొందరు. మరికొందరు మాత్రం ‘నో కాంప్రమైజ్’​ అంటూ పెళ్ళిళ్లు పోస్ట్​పోన్​ చేసుకున్నారు. అలా వాయిదా పడ్డ పెళ్ళిళ్లన్నీ ఇప్పుడు పీటలెక్కుతున్నాయి. కరోనా కేసులు తగ్గడంతో పాటు శ్రావణమాసం  మొదలవ్వడంతో 
సిటీ అంతా పెళ్లి మబ్బులు అల్లుకున్నాయి. అయితే ఈసారి సీన్​ మారింది, ప్లేస్​ మారింది.

అంతకుముందు కొవిడ్​ పెళ్ళిళ్లకి పెద్ద అడ్డంకిగా మారింది. కానీ, ఇప్పుడు ఆ టెన్షన్​ కాస్త తగ్గడంతో  సిటీలో పెళ్ళిళ్ల సందడి  మొదలవ్వబోతోంది. మామూలుగా ఏడాదికి 5 నుంచి 6 లక్షల పెళ్ళిళ్లు జరుగుతుంటాయి. కానీ,  ఈ నెల 11 నుంచి సెప్టెంబర్​ 1 వరకు ఇరవైరోజుల్లోనే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాల్లో దాదాపు రెండు లక్షల పెళ్ళిళ్లు జరగబోతున్నాయి. పెళ్ళి వేడుకల కోసం  ఇప్పటికే సిటీలోని రిసార్ట్స్​తో పాటు హోటల్స్​, బ్యాంక్విట్​​, ఫంక్షన్​ హాల్స్​ అన్నీ బుక్​ అయ్యాయి. ఈ సారి పెళ్లి వేడుకలు రిసార్ట్స్​లో​ చేసేందుకు  ఎక్కువ ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు.
యునిక్​ వెడ్డింగ్​ ప్లాన్స్​
వెనుకటి రోజుల్లో ఇంటిముందే  పెళ్ళిళ్లు జరిగేవి. తర్వాత తర్వాత పెళ్ళి పందిళ్లన్నీ ఫంక్షన్​ హాల్స్​కి షిఫ్ట్​ అయ్యాయి. ఈ మధ్య అక్కడ్నించి  రిసార్ట్స్ కి, హోటల్స్​కి టర్న్​ అవుతున్నాయి. ప్రస్తుతం రిసార్ట్​ వెడ్డింగ్స్​కే ఎక్కువ  ఆసక్తి చూపిస్తున్నారు యువత.  అందులోనూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న రిసార్ట్స్​నే పెళ్ళికి ఎంచుకుంటున్నారు. అక్కడే రెండుమూడు రోజుల పాటు పెళ్లి ఫంక్షన్స్​  ప్లాన్​ చేస్తున్నారు. యువత అభిరుచికి తగ్గట్టుగానే రిసార్ట్స్​ కూడా  స్పెషల్ ఆఫర్స్​కి తోడు.. యునిక్​గా వెడ్డింగ్స్​ ప్లాన్​ చేస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్​లోని అలంకృత, లియోనియా, ఫోర్ట్​ గ్రాండ్​, ప్రగతి, డ్రీమ్​ వ్యాలీ, కంట్రీసైడ్​, గోల్కొండ లాంటి పెద్ద రిసార్టుల్లో వెడ్డింగ్​ కోసం అడ్వాన్స్​ బుకింగ్స్​ అన్నీ అయిపోయాయి. 
వచ్చేనెలలో నా పెళ్లి
సెప్టెంబర్ ఒకటో తారీఖు పెళ్లిచేసుకోబోతున్నా. ఈ గ్రాండ్​ అకేషన్​ కోసం  మొయినాబాద్​లో ఓ  రిసార్ట్ బుక్ చేసుకున్నాం. కళ్యాణ మండపాలతో పోలిస్తే రిసార్ట్స్​లో పెళ్లికి​  ఖర్చు కాస్త ఎక్కువే అవుతుంది. కానీ, అన్ని టెన్షన్స్​ పక్కనపెట్టి పెళ్ళిని ప్రశాంతంగా ఎంజాయ్​ చేయాలంటే రిసార్ట్సే బెస్ట్​. కరోనా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి మూడు రోజులు ఉండేందుకు ప్లాన్​ చేసుకున్నా అంటున్నారు బళ్లారికి చెందిన మధుకర్. 
                                                                                                                                                                   :: బస్వరాజ్, హైదరాబాద్​, వెలుగు

ముహూర్తాలు బాగున్నయ్​
శ్రావణమాసంలో మునుపెన్నడూ జరగనన్ని పెళ్లిళ్లు ఈ సారి జరగబోతున్నాయి​. 20 రోజుల పాటు డే అండ్​ నైట్​ పెళ్ళిళ్లు ఒప్పుకున్నా. వాటిల్లో చాలా వరకు రిసార్ట్​లోనే జరుగుతున్నాయి. కరోనా వల్ల వాయిదా వేసుకున్న పెళ్ళిళ్లకి రెండోసారి కూడా నేనే ముహూర్తాలు పెడుతున్నా.  
                                                                                                                                                                              - వినోద్​శర్మ, పూజారి

రోజుకో  పెళ్ళి
ఈ నెల 11 నుండి ముహుర్తాలు బాగుండటంతో వెడ్డింగ్ బుకింగ్స్ బాగా వస్తున్నాయి. బుకింగ్స్ లో ఎక్కువగా రెండు, మూడు రోజులు స్టే చేసేవాళ్లే ఉంటున్నారు. గ్రీనరీతో పాటు విలేజ్ వాతావరణం ఉంటుండటంతో రీస్టార్ట్ లో పెళ్లిళ్లు చేసుకునేందుకు జనం ఇంట్రెస్ట్ చూపుతున్నారు. 
                                                                                                                                                                 - శ్రీధర్ రెడ్డి, కంట్రి సైడ్ రిసార్ట్ డైరక్టర్.