కృష్ణయ్యను చంపడానికి ఆరు నెలల నుంచే స్కెచ్​!

కృష్ణయ్యను చంపడానికి ఆరు నెలల నుంచే స్కెచ్​!

ఖమ్మం, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన టీఆర్ఎస్ నేత, టేకులపల్లి పీఏసీఎస్ డైరెక్టర్ తమ్మినేని కృష్ణయ్య మర్డర్ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మిగిలిన వారు ఎక్కడున్నారనే విషయం సస్పెన్స్ గా మారింది. పట్టపగలే, నడిరోడ్డుపై అతి కిరాతకంగా తల్వార్లు, కత్తులతో హత్య చేసి దుండగులు, వచ్చిన ఆటోలోనే పరారయ్యారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో హత్య జరగ్గా, ఇప్పటి వరకు హంతకులతో పాటు హత్యకు సూత్రధారిగా భావిస్తున్న తమ్మినేని కోటేశ్వరరావు ఆచూకీపై స్పష్టత రావడం లేదు. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పోలీసులు మాత్రం ఇంకా వెతుకుతున్నామని చెబుతున్నారు. నాలుగు టీమ్ లను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని ఖమ్మం సీపీ విష్ణు ఎస్.వారియర్ చెప్పారు. వీలైనంత తొందరగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

వచ్చింది ఆరుగురు..చంపింది నలుగురు

కృష్ణయ్య హత్య కేసులో ఆయన పెద్దనాన్న కుమారుడు, సీపీఎం నేత తమ్మినేని కోటేశ్వరరావు సహా 8 మందిపై ఖమ్మం రూరల్ పోలీసులు సోమవారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మృతుడి కొడుకు నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 148, 341, 120బి, 302 రెడ్ విత్149 సెక్షన్ల కింద కేసు ఫైల్​ చేశారు. ఏ1గా తమ్మినేని కోటేశ్వరరావును పేర్కొనగా, ఆ తర్వాత వరుసగా రంజాన్, జక్కంపూడి కృష్ణ, గజ్జి కృష్ణస్వామి, నూకల లింగయ్య, బండ నాగేశ్వరరావు, బోడపట్ల శ్రీను, ఎల్లంపల్లి నాగయ్యను నిందితులుగా చూపించారు. వీరిలో ఇద్దరు ఘటన జరిగిన సమయంలో స్పాట్ లో లేరని, మిగిలిన ఆరుగురు ఆటో (ఏపీ 20బి 9891) లో రాగా నలుగురు మాత్రమే ఆటో దిగి కృష్ణయ్యపై కత్తులతో దాడి చేశారని ప్రత్యక్ష సాక్షి ముత్తయ్య చెబుతున్నారు. హత్య విషయం తెలిసిన కొద్దిసేపట్లోనే తమ్మినేని కోటేశ్వరరావు ఇంటి నుంచి కారులో వచ్చి ఘటనాస్థలంలో కృష్ణయ్య చనిపోయారని నిర్ధారించుకున్నారని, తర్వాత అదే కారులో మద్దులపల్లి మోడల్ కాలనీ మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లారని తెలుస్తోంది.  

చేతులు..కత్తి..చెప్పు స్వాధీనం

తమ్మినేని కృష్ణయ్య మృతదేహంపై మొత్తం 27 కత్తి పోట్లున్నాయని పోస్టుమార్టంలో తేలింది. విపరీతమైన రక్తస్రావం వల్లే కృష్ణయ్య చనిపోయారని నిర్ధారించినట్టు సమాచారం. కడుపు, మెడ, తల, నడుము దగ్గర 4 ఇంచుల నుంచి 8 ఇంచుల లోతులో పదునైన గాయాలున్నాయని, పొడువాటి కత్తులతో ఈ గాయాలైనట్టు పోస్టుమార్టం రిపోర్టులో డాక్టర్లు పేర్కొనట్టు తెలుస్తోంది. మరోవైపు హత్య జరిగిన స్థలంలో మృతుడి రెండు చేతులు మణికట్టు వరకు తెగిపోయి ఉండగా, ఘటనా స్థలానికి కొద్దిదూరంలో వాటిని పోలీసులు గుర్తించారు. మరికొద్దిదూరంలోనే హత్యకు ఉపయోగించిన పెద్ద తల్వార్, హంతకులకు చెందిన చెప్పును, మరికొన్ని ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ముందు రోజు రాత్రి దావత్ ? 

హత్య జరగడానికి ముందు రోజు రాత్రి నిందితులు దావత్ చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆదివారం తెల్దారుపల్లిలో గ్రామస్తులు బోనాల పండుగ చేసుకున్నారు. కోతులగుట్ట గ్రానైట్ క్వారీలో ఉన్న గెస్ట్ హౌస్ లో ఆదివారం అర్ధరాత్రి 1 గంట వరకు మందు పార్టీ జరిగిందని..ఇందులో కోటేశ్వరరావు, ఎల్లంపల్లి నాగయ్య, రంజాన్ ఉన్నారని పోలీసులకు కొందరు గ్రామస్తులు సమాచారమిచ్చారు. హత్య కేసులో నిందితులుగా ఉన్న మరికొందరు ఆదివారం రాత్రి మద్దులపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర ఉన్న బెల్ట్ షాపులో మద్యం తాగారని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీంతో ముందు రోజే హత్యకు సంబంధించిన ప్లాన్ అమలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యలో పాల్గొన్న కొందరు నిందితులపై గతంలోనూ కొన్ని కేసులున్నాయి. మృతుడు కృష్ణయ్య అనుచరుడు మహబూబ్​పై గతేడాది గ్రామంలోనే కొందరు దాడి చేసి హత్యకు ప్రయత్నించినా తీవ్రగాయాలతో తప్పించుకున్నాడు. మహబూబ్ పై దాడి ఘటనలో రంజాన్, గజ్జి కృష్ణస్వామి, నూకల లింగయ్య, బండ నాగేశ్వరరావు, బోడపట్ల శ్రీను నిందితులుగా ఉన్నారు. జక్కంపూడి కృష్ణ పేరు కూడా అప్పట్లో ఫిర్యాదులో పేర్కొన్నా, ఆ తర్వాత జరిగిన ఎంక్వైరీలో తొలగించినట్టు తెలుస్తోంది. 

ఆరు నెలల నుంచే స్కెచ్​

దాదాపు ఆరు నెలల నుంచే కృష్ణయ్యను చంపడానికి స్కెచ్ వేసినట్టు ప్రచారం జరుగుతోంది. కొద్ది నెలల క్రితం కర్నూలుకు చెందిన సుపారీ గ్యాంగ్ తో నిందితులు మంతనాలు చేశారని, భారీగా డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు వారు పెట్టిన కొన్ని కండిషన్లలో ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల ఆ ప్లాన్ వర్కవుట్ కాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు దాడి జరిగే అవకాశముందని తాము కూడా కృష్ణయ్యను హెచ్చరించామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయినా లెక్కచేయకుండా టీఆర్ఎస్ ను గ్రామంలో బలోపేతం చేసేందుకు ప్రయత్నించడమే ప్రత్యర్థుల కోపానికి కారణమైందని అంటున్నారు. 

పాడె మోసిన మాజీ మంత్రి తుమ్మల 

ఖమ్మం రూరల్ : తమ్మినేని కృష్ణయ్య అంత్యక్రియలకు మంగళవారం పోలీస్​ బలగాల పహారా మధ్య నిర్వహించారు. చివరి చూపు కోసం వేలాది మంది తరలివచ్చారు. టీఆర్​ఎస్​, సీపీఐ, కాంగ్రెస్​ పార్టీ లీడర్లు, గ్రానైట్​అసోసియేషన్​సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమయాత్ర సుమారు మూడు కిలోమీటర్లు సాగింది. కృష్ణయ్యను అతడి ఫామ్​హౌస్​లో ఖననం చేయగా మాజీ మంత్రి, టీఆర్​ఎస్​ నేత తుమ్మల నాగేశ్వరరావు పాడె మోశారు. అంతిమయాత్రలో మాజీ మంత్రి తుమ్మల తనయుడు యుగేంధర్​, మాజీ ఎమ్మెల్యే బానోత్​చంద్రావతి, సాధు రమేశ్​రెడ్డి, జొన్నలగడ్డ రవి, పంతులు నాయక్​, అంబటి సుబ్బరావు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటలను జరగకుండా గ్రామంలో 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.  డీఎస్పీ బోస్​ పర్యవేక్షణలో ఏసీపీ బస్వారెడ్డి, సీఐ శ్రీనివాస్,​ ఎస్ఐ శంకర్​రావు ఆధ్వర్యంలో గ్రామంలో 144 సెక్షన్​ విధించి అంతిమయాత్ర ప్రశాంతంగా కొనసాగేలా చూశారు.