కరోనా సోకిందని భర్తను ఇంట్లో నుంచి గెంటేసిన భార్య

కరోనా సోకిందని భర్తను ఇంట్లో నుంచి గెంటేసిన భార్య

జగిత్యాల జిల్లాలో ఘటన
కన్నపేగైనా.. కట్టుకున్న భర్తైనా... కరోనా సోకిందంటే కానివారేనా...? పేగు బంధమూ.. తాళి బంధమూ అన్నీ అటకెక్కాల్సిందేనా...? 
అదిగో అలాంటి వైపరీత్యపు పోకడలనే కోవిడ్ సమాజం ముందు ఉంచుతోంది.
జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన బలహీనమైన మానవ బంధాలకు అద్దం పట్టింది. తమ తండ్రిని ఇంట్లో ఉండనివ్వమని కొడుకు,కోడలు వచ్చి బతిమాలుకున్నా వృద్ధుడి భార్య మనసు కరగలేదు. భర్తకు కోవిడ్ వచ్చిందని ఇంటి బయటకు గెంటేసి తలుపులు వేసుకున్న ఘటన సభ్యసమాజాన్ని కలచివేస్తోంది. వివరాల్లోకి వెళితే.. విద్యానగర్ లో ఇందయ్య అనే 80 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో భార్య మల్లవ్వ ఇంటి బయట ఓ మంచం వేసి.. భర్తను ఇంట్లోంచి వెళ్లగొట్టి తలుపులు పెట్టేసుకుంది. కొడుకు రమేష్, కోడలు లలిత వేరే చోట కిరాయికి ఉంటున్నారు. అనారోగ్యంతో ఉన్న తండ్రికి సపర్యలు చేసిన కొడుకుకు కూడా కరోనా సోకింది. దీంతో అతను అష్టకష్టాలు పడుతూ ఇంటికొచ్చాడు. తండ్రి పరిస్థితి తెలుసుకుని వచ్చిన కొడుకూ, అతని వెంట వచ్చిన కోడలు లలిత తల్లిని బతిమాలినా.. వృద్ధుడు ఇందయ్య భార్య మాత్రం  తలుపులు తీయడానికి నిరాకరించింది. కరోనా పోయే వరకు ఆయనను బయటే ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. కొడుకు, కోడలు బతిమాలుకున్నా భర్తను ఇంట్లోకి రానిచ్చేందుకు నిరాకరించిన వైనం చర్చనీయాంశంగా మారింది.