బల్దియా కొత్త స్టాండింగ్ ​కమిటీ ముందు పాత సవాళ్లు

బల్దియా కొత్త స్టాండింగ్ ​కమిటీ ముందు పాత సవాళ్లు

ఏ యేటికాయేడు పనులు పెండింగే!
బల్దియా కొత్త స్టాండింగ్ ​కమిటీ ముందు పాత సవాళ్లు

హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో ఆమోదించిన పనులు సభ్యుల పదవీ కాలం పూర్తయ్యేలోపు కూడా కావడం లేదు. గతేడాది జరిగిన సమావేశాల్లో మొత్తం 210 పనులకు ఓకే చెప్పగా వందలోపు పనులు ఇప్పటివరకు మొదలేకాలేదు. 2020లో బల్దియా ఎన్నికలు జరగగా, గతేడాది నవంబర్15న మొదటి స్టాండింగ్ కమిటీని ఎన్నుకున్నారు. వాస్తవంగా అయితే వారం వారం స్టాండింగ్​కమిటీ సమావేశాలు నిర్వహించాలి. కానీ ఏడాది మొత్తం 14 సార్లు మాత్రమే జరిగాయి. ఇటీవల కమిటీ సభ్యుల పదవీకాలం ముగియగా, ఈ నెల 14న కొత్త స్టాండింగ్ కమిటీ ఎన్నికైంది. కొత్త సభ్యుల ముందు పెండింగ్​పనులు సవాళ్లుగా మారనున్నాయి. గతేడాదే కాదు.. ఏటా జీహెచ్ఎంసీలో ఇదే పరిస్థితి ఉంటోంది. సభ్యులు ఆమోదిస్తున్నారే తప్ప తర్వాత పనుల పురోగతిని పట్టించుకోవడం లేదు. ఇలా రెండు మూడేండ్లుగా చాలా పనులు పెండింగ్​లో ఉన్నాయి. గతంలో స్టాండింగ్ కమిటీ అప్రూవల్ ఇచ్చిందంటే వెంటనే టెండర్లు పిలిచేవారు. ఆ తర్వాత పనులు ప్రారంభమయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండడం లేదు. కొన్ని పనులు ఐదారు నెలలు, ఏడాదైనా మొదలుకావడం లేదు. అంతకు ముందు బల్దియా ఖజానాలో సరపడా పైసలు ఉండేవి. అనుకున్న పనులు సకాలంలో జరిగేవి. ఇప్పుడు జీహెచ్ఎంసీని అప్పులు వెంటాడుతుండడంతో జనానికి అవసరమైన పనులు కూడా అతీగతి ఉండడం లేదు.

నెలలపాటు టెండర్లు పిలవట్లే

రోడ్ల వైడెనింగ్, బ్రిడ్జిలు, కొత్త రోడ్ల నిర్మాణం నుంచి మొదలు పెడితే మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు, శ్మశాన వాటికలు ఇలా అన్ని రకాల అభివృద్ధి పనులు పెండింగ్​లో ఉంటున్నాయి. స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందిన వెంటనే పనులు మొదలుకావడం లేదు. నెలలపాటు టెండర్లు పిలవడం లేదు. అధికారులు వాటిపై దృష్టి పెట్టడం లేదు. టెండర్ల కోసం హెడ్డాఫీసుకు వచ్చే ఫైళ్లు ముందుకు కదలడం లేదు. ఏదో ఒక కారణంతో పనులు పోస్ట్​పోన్ చేస్తూనే ఉన్నారు. స్థానిక సమస్యలపై కార్పొరేటర్లను ఎక్కడికక్కడ జనం నిలదీస్తున్నా ఏదో ఒక సమాధానం చెబుతున్నారే తప్ప పనులు మాత్రం పూర్తిచేయడం లేదు. కమిటీ సభ్యులు అప్రూవల్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారే తప్ప పనుల పురోగతిపై ఆరా తీయడం లేదు.