ప్రపంచానికి పెద్దన్నఇండియా

ప్రపంచానికి పెద్దన్నఇండియా

న్యూఢిల్లీ: ఏ వ్యాక్సిన్​ కావాలన్నా ముందుగా ప్రపంచం చూసేది మన దేశంవైపే. ప్రపంచం మొత్తం తయారు చేసే టీకాల్లో 60 శాతం మన దగ్గరే తయారవుతున్నాయి. ఏటా 150 కోట్ల డోసుల టీకాలు.. 150 దేశాలకు సరఫరా అవుతున్నాయి. అంతెందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) సమీకరించే వ్యాక్సిన్లలో 70 శాతం మన దగ్గర్నుంచే వెళ్తున్నాయి. వ్యాక్సిన్ల తయారీలోనూ, సరఫరాలోనూ మన దేశం పెద్దన్న అని చెప్పడానికి ఈ అంకెలు చాలేమో. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ల విషయంలోనూ ప్రపంచ దేశాల దృష్టి ఇండియా మీదే ఉంది. చాలా దేశాలు మన వ్యాక్సిన్ల వైపే మొగ్గు చూపుతున్నాయి. రిక్వెస్ట్​లు పెడుతున్నాయి. వాళ్ల రిక్వెస్ట్​లను మన దేశం కూడా కాదనట్లేదు. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తూ అండగా నిలుస్తోంది. పెద్ద మనసు చాటుకుంటోంది.

ఆపదలో మేమున్నామంటూ..

ప్రస్తుతం చాలా వరకు కరోనా టీకాలన్నీ పెద్ద దేశాలకే పరిమితమయ్యాయి. పేద దేశాలకు ఇంకా అందలేదు. అందినా చాలా తక్కువ మొత్తంలోనే ఆయా దేశాలకు సరఫరా అయ్యాయి. అయితే, వ్యాక్సిన్ల విషయంలో ఆ లోటుపాట్లు ఉండకూడదని డబ్ల్యూహెచ్​వో ముందు నుంచీ చెబుతూనే ఉంది. అందులో భాగంగానే కొవ్యాక్స్​ అనే గ్రూపునూ ఏర్పాటు చేసింది. ఆ మాట ఎలా ఉన్నా.. మన దేశానికి మాత్రం 60 దేశాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఈజిప్ట్​, అల్జీరియా, కువైట్​, నికరాగ్వా, డొమినికన్​ రిపబ్లిక్​, బార్బడోస్​, మార్షల్​ ఐల్యాండ్స్​, సమోవా వంటి దేశాలు మన దేశం తయారు చేసే టీకాలు కావాలని అడుగుతున్నాయి. ఆయా దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేసే బాధ్యతను ఇప్పుడు ఇండియా భుజం మీద వేసుకుంది. టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కంపెనీలకు సూచనలు చేస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని దేశాలకు కరోనా వ్యాక్సిన్లను అందించేందుకు ‘మేమున్నామంటూ’ ముందడుగు వేస్తోంది.

టీకా స్టాక్​

విదేశాలకు ఆపన్న హస్తం అందిస్తూనే మన అవసరాలనూ చూస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా 6 కోట్లకుపైగా టీకాలను స్టాక్​ చేసి పెట్టింది. మొదటి విడతలో భాగంగా కోటి మంది హెల్త్​ వర్కర్లు, ఫ్రంట్​ లైన్​ వారియర్లకు టీకాలు వేస్తోంది. అదే సమయంలో విదేశాలకు ఎగుమతులు చేస్తోంది. ఇప్పటిదాకా మన పొరుగు దేశాలకే దాదాపు 5.5 లక్షల డోసుల టీకాలను అందించింది. మరో 2.7 కోట్ల డోసులను వివిధ దేశాలకు అతి తక్కువ ధరకే అమ్మేందుకు సిద్ధమవుతోంది.

అమెరికా, బ్రెజిల్​తో భారత్​ బయోటెక్​ ఒప్పందం

కొవాగ్జిన్​ టీకా తయారీ కోసం విదేశాలతో భారత్​ బయోటెక్​ ఒప్పందం చేసుకుంటోంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్​లో ఎమర్జెన్సీ వాడకానికి దరఖాస్తు చేసిన సంస్థ.. అమెరికా, బ్రెజిల్ కు చెందిన కంపెనీలతో అగ్రిమెంట్​ చేసుకుంది. అమెరికాకు చెందిన ఆక్యుజెన్​తో కలిసి అక్కడ కొవాగ్జిన్​ టీకాలను ఉత్పత్తి చేయనుంది. అయితే, అంతకన్నా ముందు మన దగ్గరే తయారైన కొన్ని కొవాగ్జిన్​ డోసులను ఆక్యుజెన్​కు ఇవ్వనుంది. అయితే, ఎన్ని డోసులను ఇవ్వనుందన్న దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలోనే కొవాగ్జిన్​ టీకా తయారీపై అమెరికా ఫుడ్​ అండ్​ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్​, బయోమెడికల్​ అడ్వాన్స్​డ్​ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్ అథారిటీకి ఆక్యుజెన్​ దరఖాస్తు చేసుకుంది. ఇటు బ్రెజిల్​లోని ప్రెసిసా మెడికమెంటోస్​ అనే కంపెనీతోనూ సంస్థ ఒప్పదం చేసుకుంది. గత నెలలో ప్రెసిసా ప్రతినిధులు భారత్​ బయోటెక్​ ప్లాంట్​కు వెళ్లి టీకాల ఎగుమతిపై ఒప్పందం కుదుర్చుకున్నారు.

సీరమ్​తో యునిసెఫ్​ జట్టు

ఆస్ట్రాజెనికా–ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ కొవిషీల్డ్​తో పాటు అమెరికా కంపెనీ నోవావ్యాక్స్​ తయారు చేస్తున్న కొవోవ్యాక్స్​ టీకాను సీరమ్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. సీరమ్‌‌తో యునిసెఫ్ లాంగ్​టర్మ్​ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు యునిసెఫ్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ హెన్రిటా ఫోర్​ ప్రకటన చేశారు. 100 దేశాలకు 110 కోట్ల డోసులు అందిస్తామని తెలిపారు. ఒక్కో డోసును 3 డాలర్ల చొప్పున కొంటామన్నారు. డబ్ల్యూహెచ్​వో ఆమోదం రాగానే వ్యాక్సిన్లను అన్ని దేశాలకు పంపిస్తామన్నారు. ఫైజర్​ టీకాను 18 దేశాలకు ఎగుమతి చేస్తామని, 4 కోట్ల డోసుల కొనుగోలుకు కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని, తొలిదశలో 12 లక్షల డోసులను పంపిస్తామని చెప్పారు. 33.6 కోట్ల డోసుల ఆస్ట్రాజెనికా–ఆక్స్​ఫర్డ్​ టీకాకు ఆర్డర్​ పెట్టామన్నారు. ఆఫ్గనిస్థాన్​ నుంచి జింబాబ్వే వరకు అన్ని పేద దేశాలకు ఫ్రీగా వాటిని సరఫరా చేస్తామని వివరించారు. ఆయా దేశాల్లోని 3.3 శాతం మందికి టీకాలు అందుతాయన్నారు.

ఇప్పటికే 15 దేశాలకు వ్యాక్సిన్లు

ఇప్పటికే మన పొరుగు దేశాలు సహా 15 దేశాలకు కరోనా వ్యాక్సిన్లను పంపించింది మన దేశం. ముందుగా భూటాన్​, మాల్దీవులు, సీషెల్స్​, బంగ్లాదేశ్​, నేపాల్​, మయన్మార్​ వంటి ఆరు దేశాలకు ఫస్ట్​ బ్యాచ్​ టీకాలను ఫ్రీగా పంపించింది. ఆ తర్వాత  మారిషస్​, శ్రీలంకలకు ఎగుమతి చేసింది. ఆపైన బ్రెజిల్​కు 20 లక్షల డోసులను పంపించింది. దానికి కృతజ్ఞతగా ‘కరోనా సంజీవని మోసుకొస్తున్న ఆంజనేయుడి’ ఫొటోను ట్వీట్​ చేసి ఆ దేశ ప్రెసిడెంట్​ జెయిర్​ బోసనారో థ్యాంక్స్​ కూడా చెప్పారు. అదే దారిలో మిడిల్​ ఈస్ట్​ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈలకూ వ్యాక్సిన్లను పంపించింది. రాబోయే రోజుల్లో లాటిన్​ అమెరికా దేశాలైన మెక్సికో, అర్జెంటీనాలకు, మొరాకో, నార్త్​ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా, పశ్చిమాసియా దేశాలు, ఒమన్​, బహ్రెయిన్​లకూ టీకాలను అందించనుంది. ఇటు ఫిలిప్పీన్స్​కూ మన దేశ టీకాలు అందనున్నాయి. అమెరికా, బ్రిటన్​ వంటి అగ్రదేశాలూ మన దేశంతో ఒప్పందం చేసుకుంటున్నాయి.

మన టీకాలే ఎందుకు?

ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దగ్గర టీకాలు ఎక్కువగా తయారవుతాయి. అందుకే వ్యాక్సిన్లకు క్యాపిటల్​ అని ఇండియాను పిలుస్తుంటారు. అదే టైంలో వేరే దేశాలతో పోలిస్తే మన దగ్గర టీకా ధరలు తక్కువ. కరోనా టీకాల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఫైజర్​, మోడర్నా కంపెనీల టీకాల ధర చాలా ఎక్కువ. అదీకాకుండా మైనస్​80 డిగ్రీల వద్ద వాటిని నిల్వ చేయాలి. వాటితో పోలిస్తే మన దగ్గర తయారైన వ్యాక్సిన్లను మామూలు ఫ్రిజ్​ టెంపరేచర్ల వద్దే నిల్వ చేసుకోవచ్చు. ధర కూడా తక్కువ. అందుకే చాలా దేశాలు మన టీకాలవైపు మొగ్గు చూపడానికి కారణమవుతున్నాయి.