సామాన్య జనాలకు ప్రశ్నించడం నేర్పిండు

సామాన్య జనాలకు ప్రశ్నించడం నేర్పిండు

ఏడాది కాలం క్షణంలో జరిగిపోయినట్టు అనిపిస్తోంది. కానీ నరెడ్ల శ్రీనివాస్ మిగిల్చిన శూన్యం ఇంకా అలాగే ఉంది. కరోనా ఎంతో మందిని నిర్ధాక్షిణ్యంగా తనతోపాటు తీసుకుపోయింది. వారిలో నరెడ్ల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ కూడా ఒకరు. శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ వామపక్ష భావజాలం నుంచి వచ్చిన వ్యక్తి. అందుకే ప్రపంచం మొత్తం మారాలని అతనేమీ ఆశించలేదు. కానీ దేశంలో ఉన్న చట్టాలు, శాసనాలు ఏరకంగా వాడుకోవచ్చునో అందరికీ తెలియచెప్పారు. చట్టాలు ఏవీ పనికిరావని ఆయన అనుకోలేదు. ఉన్న చట్టాలతో సామాన్యులకు ఏ విధంగా సహాయం చేయవచ్చు అన్న విషయాన్ని ఆయన నిశితంగా పరిశీలించారు. ఆ దిశగా తన ప్రయత్నాలను తుది వరకు కొనసాగించారు. అది వినియోగదారుల రక్షణ చట్టం కావచ్చు.. సమాచార హక్కు చట్టం కావచ్చు.. అవినీతి నిరోధక చట్టం కావచ్చు.. చట్టాన్ని ఉపయోగించి సామాన్యులకు న్యాయం చేయాలని సంకల్పించిన వ్యక్తి నరెడ్ల శ్రీనివాస్.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని కందుగుల గ్రామంలో ఓ పేద కుటుంబంలో పుట్టిన శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ విద్యార్థి దశలోనే ప్రగతిశీల భావాలతో ప్రేరేపితం అయ్యారు. 1972 –73 ప్రాంతంలో మిత్రులతో  కలిసి ఒక సాహితీ సంస్థను ప్రారంభించి శ్రీశ్రీని రప్పించి ఊరేగించిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన చదువంతా కరీంనగర్​లోనే సాగింది. డిగ్రీ చదువు పూర్తి చేసిన తర్వాత సివిల్స్ రాద్దామని అనుకున్నంతలోనే యూనియన్ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. బ్యాంకులో వచ్చిన ప్రమోషన్​ కారణంగా గుజరాత్ వెళ్లి అక్కడ ఉధృతంగా జరుగుతున్న వినియోగదారుల ఉద్యమ స్ఫూర్తిని గమనించారు. కరీంనగర్​కు తిరిగి వచ్చిన తర్వాత ఆ ఉద్యమాన్ని ఇక్కడ కూడా చేపట్టారు. వినియోగదారుల రక్షణ చట్టం దేశంలోకి రావడానికి ముందే కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వినియోగదారుల కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఆ కౌన్సిల్ ద్వారా దాదాపు పది వేల కేసులను పరిష్కరించారు. రూ.25 కోట్ల మేరకు నష్ట పరిహారాలను సామాన్యులకు ఇప్పించారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే  కాకుండా స్టేట్ కమిషన్లు, జాతీయ కమిషన్లలో కూడా కేసులను బాధితుల తరపున వేస్తూ ముందుకు సాగారు. అమల్లో ఉన్న చట్టాలైన వినియోగదారుల రక్షణ చట్టం, సమాచార హక్కు చట్టాన్ని, అవినీతి నిరోధక చట్టాన్ని ఆధారం చేసుకొని న్యాయపోరాటం చేసి, జనంతో శెభాష్​ అనిపించుకున్నారు.

కోటి ఉత్తరాల కార్యక్రమం..

సమాచార హక్కు చట్టం వల్ల అవినీతి తగ్గుముఖం పడుతుందని భావించి కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని కరీంనగర్​లో చేపట్టారు. మొదటి ఉత్తరాన్ని డాక్టర్ నాగభూషణంతో రాయించారు. డాక్టర్ కాని వాడు డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చలామణి కావడాన్ని వ్యతిరేకించారు. కార్పొరేట్ వైద్య సంస్థలు ఆర్ఎంపీ​, పీఎంపీ వైద్యులకు స్వాగతం పెడుతూ బ్యానర్లు పెడితే ఆ పద్ధతిని విమర్శించారు. వాళ్లు సమాజానికి చేస్తున్న మోసాన్ని బహిర్గతం చేశారు. కార్పొరేట్ వైద్య సంస్థల దుర్మార్గాలను ఎండగట్టారు. ఎంతో మంది బోగస్‌‌‌‌‌‌‌‌గా గౌరవ డాక్టర్ డిగ్రీ పెట్టుకోవడం చూసి, యూజీసీ నుంచి వివరణ తెప్పించుకొని అలాంటి వ్యక్తులను తన చర్యల ద్వారా నిరోధించారు. అదే విధంగా వినియోగదారుల రక్షణ చట్టం పరిధి నుంచి డాక్టర్లను తొలగించే కుట్రను గట్టిగా వ్యతిరేకించారు.

చెప్పడమే కాదు.. ఆచరణలో పెట్టారు

ఏదైనా చెప్పడం వేరు.. దానిని ఆచరణలో పెట్టడం వేరు. హైదరాబాద్​ లాంటి మహానగరంలో ఉంటూ ఎవరైనా ఎవరినైనా విమర్శించవచ్చు. కానీ కరీంనగర్ లాంటి చిన్న టౌన్‌‌‌‌‌‌‌‌లో ఉంటూ అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం మాత్రం శ్రీనివాస్​కే చెల్లింది. అన్యాయం ఎక్కడ జరిగినా ఎదిరించారు. ప్రజల్లో మార్పు కోసం జీవితం చివరి వరకూ  కృషి చేశారు. జీవితాంతం సామాన్యునికి అండగా నిలిచారు. అమల్లో ఉన్న చట్టాలతో ప్రజలకు ఏ విధంగా మేలు చేయవచ్చో, వాటిని ఏవిధంగా ఆయుధాలుగా మలుచుకోవచ్చో అందరికీ చేసి చూపించారు. తన చర్యల ద్వారా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఏఎస్ఐ మోహన్ రెడ్డి బాధితులను ఐక్యం చేసి వారికి న్యాయం జరిగే విధంగా పోరాటం చేసారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న అవినీతిని బయట పెట్టి.. వాటికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏకైక గొంతు శ్రీనివాస్ ది.

చట్టాలను ఎలా ఉపయోగించుకోవాలో..

అంపశయ్య నవీన్ ఆధ్వర్యంలో ఏర్పడిన ఫిల్మ్ సొసైటీ బాధ్యతల్ని 1980లో చేపట్టిన శ్రీనివాస్, దానికి ఉద్యమ రూపాన్ని ఇచ్చారు. కరీంనగర్ ఫిలిం సొసైటీకి మొదటిసారిగా 16 ఎంఎం ప్రొజెక్టర్​ను, ఆ తర్వాత 35 ఎంఎం  ప్రాజెక్టర్లను సమకూర్చుకుని సమాంతర, అర్థవంతమైన సినిమాలకు వేదికగా ఆ సంస్థను తీర్చిదిద్దారు. సినిమా అప్రిసియేషన్ కోర్సులను జిల్లావ్యాప్తంగా నిర్వహించి సమాంతర సినిమాకు ఒక మంచి వాతావరణాన్ని కల్పించారు. కరీంనగర్ నుంచి వెలువడిన జీవగడ్డ పత్రికలో ‘పెన్నుపోటు’ పేరుతో ఓ కాలం కూడా నిర్వహించారు. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి భూకబ్జా, గ్రానైట్ రాళ్ల కుంభకోణాలను వెలికి తీశారు. కొత్త చట్టాల కోసం ఎదురు చూడకుండా ఉన్న చట్టాలను ఉపయోగించుకుని ప్రజలకు ఏవిధంగా సహాయం చేయవచ్చు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా నిలిచారు శ్రీనివాస్. ఈ ప్రయత్నంలో ఆయనకు వచ్చిన ఒత్తిడులను, బెదిరింపులను ఎంత మాత్రం ఖాతరు చేయలేదు. వాటికి బెదిరి ఆగిపోలేదు. ధైర్యంగా ముందుకు సాగి ఎంతో మందికి స్ఫూర్తి దాయకమయ్యారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఇంకా కరీంనగర్​లో కొనసాగాల్సిన అవసరం ఉంది. దాన్ని కొనసాగించడం కోసం కరీంనగర్​ లోని ఓ వీధికి ఆయన పేరును పెడితే శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ సేవలకు అర్థం ఉంటుంది. ఆ దిశగా స్థానిక నాయకత్వం ప్రయత్నం చేస్తుందని ఆశిద్దాం. అదే మనం నరెండ్ల శ్రీనివాస్​కు ఇచ్చే ఘన నివాళి.

యూనియన్ బ్యాంక్ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా శ్రీనివాస్​ పని చేసినప్పుడు అవసరమున్న ఎంతో మందికి లోన్లు ఇప్పించి సహకరించారు. కరీంనగర్ జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి రాజకీయ నాయకులు దగ్గరికి వెళ్లకుండా శ్రీనివాస్ దగ్గరికు వెళ్లేవాళ్లంటే అతిశయోక్తి కాదు. మోహన్ రెడ్డి దగ్గర నుంచి సామాన్యుల ఆస్తిపాస్తులను కాపాడుకునేలా చేయడానికి ఎంతగానో కృషి చేసిన ధైర్యశీలి శ్రీనివాస్. ప్రభుత్వ ఆఫీసుల్లో తలెత్తుతున్న సమస్యలను తీర్చుకోవడానికి ప్రజలు నేరుగా లోక్ సత్తా కార్యాలయం వైపు పరుగులు తీసేవారు. శ్రీనివాస్ ఇస్తున్న చేయూత వారిని ఆ విధంగా పరుగులు పెట్టించేది. ఆయన చేసిన కృషి వల్లే మోహన్ రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ తమ దర్యాప్తు మొదలుపెట్టింది. తన ఆఫీసుకు వచ్చిన ప్రజల సమస్యలను శ్రద్ధగా వినడం, వాటి పరిష్కారం కోసం ఏ అధికారి దగ్గరికి వెళ్లాలో సూచించడమే కాదు ఎలాంటి దరఖాస్తులు ఇవ్వాలి, ఎలాంటి ఫిర్యాదు ఇవ్వాలి అన్న విషయంలో అందరికీ మార్గదర్శకత్వం చేసిన వ్యక్తి ఆయన. అవసరమైన వ్యక్తులకు దరఖాస్తులను, ఫిర్యాదులను కూడా రాసి ఇచ్చేవారు. చదువుకున్న వాళ్లకు ఆయన శ్రీనివాస్ అయితే, సామాన్యులకు మాత్రం శీనన్న.
- మంగారి రాజేందర్, 
రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ జిల్లా, సెషన్స్‌‌‌‌‌‌‌‌ జడ్జి