తొక్కు కాయలు దొరకట్లే.. గాలివానలకు రాలిన మామిడి కాయలు

తొక్కు కాయలు దొరకట్లే.. గాలివానలకు రాలిన మామిడి కాయలు
  • గతేడాదితో పోలిస్తే రేట్లు డబుల్
  • క్రమంగా తగ్గుతున్న తొక్కు మామిడి సాగు
  • బంగినపల్లి, దసేరి వైపే రైతుల మొగ్గు

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/మహాముత్తారం, వెలుగు :ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో మామిడి తొక్కు పెడ్తుంటారు. ముఖ్యంగా మేలో మామిడి కాయలకు మస్త్ గిరాకీ ఉంటుంది. పిక్క గట్టి పడిన కాయలు, ఎండు మిర్చి ఈ టైంలోనే ఎక్కువ దొరుకుతాయ్. ఏడాదంతా స్టోర్ చేసే అవకాశం ఉండటంతో చాలా మంది మేలోనే మామిడి తొక్కు తయారీకి మొగ్గుచూపుతుంటారు. కానీ, కొన్నేండ్లుగా వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా తొక్కు కాయల దిగుబడి తగ్గిపోతున్నది.

ముఖ్యంగా పూత, కాత టైంలో కురుస్తున్న వడ గండ్ల వానతో సగానికి సగం కాయలు రాలిపోతున్నాయి. ఫలితంగా తొక్కుకాయలకు కొరత ఏర్పడుతున్నది. గతేడాదితో పోలిస్తే ఈసారి తొక్కు కాయల దిగుబడి గణనీయంగా తగ్గడంతో రేట్లు డబుల్ అయ్యాయి. ప్రతిసారీ వంద కాయలతో తొక్కు పెట్టేవాళ్లు సగానికి పరిమితమవుతున్నారు.

తొక్కు మామిడి కాయల కొరత

రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ వ్యాప్తంగా 5 లక్షలకుపైగా ఎకరాల్లో మామిడి తోటలుండేవి. కొన్నేండ్లుగా అకాల వర్షాల వల్ల పూత, కాత రాలిపోయి నష్టం వాటిల్లుతుండడంతో క్రమంగా రైతులు తోటలు నరికేసి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుతున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో మామిడి తోటలు 3లక్షల ఎకరాలకు పడిపోయినట్లు హార్టీకల్చర్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇందులోనూ బంగినపల్లి, దసేరి, కేసరి, తోతాపురిలాంటి రకాలనే రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. జలాల్, హైదర్ సాహెబ్, ఆమిని, తెల్లగులాబీ లాంటి తొక్కు కాయల వాటా పదో వంతు కూడా ఉండడం లేదు. నాలుగైదేండ్లుగా అకాల వర్షాలు, వడగండ్లతో సీజన్​కు ముందే కాయలన్నీ రాలిపోతున్నాయి. ఆ టైంలో వీటిని అమ్ముకునే పరిస్థితి లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మే నెల వచ్చేసరికి మార్కెట్​లో కాయలు దొరకడం లేవు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్​లో కురిసిన వడగండ్ల వానలతో ప్రస్తుతం తొక్కు మామిడి కొరత తీవ్రంగా ఏర్పడింది.

గతేడాదితో పోలిస్తే డబుల్ రేట్లు

తొక్కు కాయల కొరత కారణంగా గతేడాదితో పోలిస్తే ఈసారి రేట్లు డబుల్ అయ్యాయి. గతేడాది ఒక్కో కాయను రూ.5 నుంచి రూ.10 వరకు అమ్మితే ఈసారి సైజును బట్టి రూ.10 నుంచి రూ.30 దాకా అమ్ముతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది రైతులు, కూలీలు నేటికీ పొలం, లేబర్ పనులకు వెళ్లేటప్పుడు అన్నంలోకి మామిడి తొక్కు పట్టుకెళ్తారు. పొద్దున్నే పనికి పోవాల్సి రావడం, కూర వండుకునే టైం లేకపోవడం ఇందుకు ఒక కారణమైతే, ప్రతిరోజూ కూరలు వండుకునే స్థోమత లేకపోవడం మరో కారణం. ఇలాంటి వాళ్లు 100కు తగ్గకుండా కాయలు కొని తొక్కు తయారు చేసుకునేవారు. కానీ, ఈసారి మామిడి రేట్లు పెరగడంతో 50కి మించి కాయలు కొనలేకపోతున్నామని వాపోతున్నారు. మిర్చి, వెల్లుల్లి, నూనె రేట్లు కూడా పెరగడంతో మామిడి తొక్కు క్వాంటిటీ తగ్గించుకుంటున్నారు.

ముగ్గురు బిడ్డలకు పంపేటోన్ని

ఏటా వంద కాయలతో తొక్కుపెట్టి ముగ్గురు కూతుళ్లకు పంపేటోన్ని. అప్పుడు ఒక్కో కాయ 2 లేదా 3 మహా 5 రూపాయలు ఉం డేది. ఇప్పుడు పదికి తక్కువ లేదు. వంద కాయలకు వెయ్యి పెట్టాలి. కారం, అల్లం, నూనె అన్నీ కలిపితే 2 వేలకు తక్కువ కాదు. దీంతో ఈసారి మా ఇంటి వరకే మామిడి తొక్కు పెట్టుకుంటున్నం. కూతుళ్లకు పంపే పరిస్థితి లేదు.
‒ కస్తూరి సారయ్య, ములకలపల్లి,  భూపాలపల్లి జిల్లా

సద్దిలోకి మామిడి తొక్కే..

ఈసారి మార్కెట్లకు మామిడి కాయలు తక్కువొచ్చినయ్. ఒక్కో కాయకు రూ.20 చెప్తున్రు. కూలీ చేసుకునే మాకు సద్దిలకు మామిడి తొక్కే కావాలి. కానీ, 50 కాయలతో తొక్కుపెట్టాల్నంటే వెయ్యి రూపాయలు ఖర్చు అవుతున్నయ్. ఏం చేయాల్నో అర్థం కావట్లే. తొక్కు కాయలు మస్త్​ పిరం అయినయ్.
‒ పొలవేని రాజమ్మ, ఖాసీంపల్లి, భూపాలపల్లి జిల్లా