
- పరారీలో బ్యాంకు క్యాషియర్
చెన్నూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్ లోని ఎస్ బీఐ బ్యాంక్ లో ఇంటి దొంగలు పడ్డారు. మేనేజర్, క్యాషియర్ కలిసి రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల విలువైన గోల్డ్, క్యాష్ మాయం చేసినట్టు బ్యాంకు ఉన్నతాధికారులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్ బీఐ మేనేజర్ గా చెన్నూర్ మండలం ముత్తారావుపల్లికి చెందిన వెన్నపురెడ్డి మనోహర్ రెడ్డి, క్యాషియర్ గా జైపూర్ మండలం శెట్ పల్లికి చెందిన నరిగ రవీందర్ పని చేస్తున్నారు.
మూడు నెలలకోసారి ఎస్ బీఐ ఉన్నతాధికారులు నిర్వహించే జనరల్ ఆడిటింగ్ బుధవారం నుంచి చేపట్టగా బ్యాంకులో మోసం జరిగినట్టు గుర్తించారు. కస్టమర్లు లోన్ల కోసం కుదువ పెట్టిన బంగారాన్ని బ్యాంకు మేనేజర్, క్యాషియర్ కలిసి మాయం చేసినట్టు అనుమానించారు. కాగా.. సమాచారం తెలియడంతో క్యాషియర్ రవీందర్ తన కుమార్తె ఆరోగ్యం బాగాలేదని గురువారం బ్యాంకు నుంచి వెళ్లిపోయాడు.
ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్టు బ్యాంకు ఉన్నతాధికారులు తెలిపారు. సమాచారం అందించగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సాయంత్రం బ్యాంకును సందర్శించి ఉన్నతాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఆడిటింగ్ జరుగుతుందని, కంప్లయింట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని మీడియాకు తెలిపారు. కాగా.. క్యాషియర్ రవీందర్ ఇటీవల ఆన్ లైన్ గేమింగ్ లో భారీగా నష్టపోయినట్టు సమాచారం.
దీంతో తన భూమిపై రూ.40 లక్షల లోన్ కూడా తీసుకున్నట్టు తెలిసింది. బ్యాంకు లాకర్లకు సంబంధించిన తాళాలు కూడా వీరి వద్దనే ఉండడంతో మేనేజర్ కు తెలియకుండా ఇది జరిగే చాన్స్ లేదని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఆడిటింగ్ పూర్తయితే గాని ఎంత మాయమైందనే దానిపై క్లారిటీ వస్తుందని పేర్కొన్నారు.