
బాలీవుడ్ నటి, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ మాజీ భార్య సంగీత బిజ్లానీ ఫామ్ హౌస్ పై దొంగలు బీభత్సం సృష్టించారు. విలువైన వస్తువులు దొంగలించారు. మరికొన్ని వస్తువులను ధ్వంసం చేశారు. ఈ సంఘటన పూణే జిల్లా, పావనా డ్యామ్ సమీపంలోని టికోనా గ్రామంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన సినీ వర్గాలలో, స్థానికులలో కలకలం రేపుతోంది. ఈ దుశ్చర్యలపై పోలీసులకు సంగీత ఫిర్యాదు చేశారు.
దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత తన తండ్రి అనారోగ్య సమస్యల కారణంగా ఫామ్ హౌస్ ను సందర్శించలేకపోయానని సంగీత బిజ్లానీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం నాడు ( జూలై 18, 2025 ) తన ఇద్దరు పనిమనుషులతో కలిసి ఫామ్ హౌస్ కు వెళ్ళగా అక్కడ దృశ్యాలు చూసి షాక్ కు గురిచేసింది. ఇంటి ప్రధాన తలుపుతో పాటు కిటికీ గ్రిల్స్ దెబ్బతిన్నాయి. ఒక టీవీ కూడా కనిపించకుండా పోయింది. మరొకటి పగిలిపోయింది అని ఆమె తన ఫిర్యాదులో తెలిపారు.
దొంగలు ఫామ్ హౌస్ లోని వస్తువులను ధ్వంసం చేయడమే కాకుండా విలువైన వస్తువులు కూడా అపహరించారు. పై అంతస్తు ఉన్న మంచాలు విరిగిపోయాయి. వస్తువులు చిందరవందర చేశారు. సీసీటీవీ కెమెరాలు కూడా ధ్వంసం చేశారని పూణే రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సందీప్ సింగ్ గిల్ కు బిజ్లానీ ఫిర్యాదు చేశారు. కొన్ని వస్తువులు చిందరవందర చేయడంతో పాటు ఫ్రిజ్ ను కూడా ధ్వంసమయ్యాయని వివరించారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ ఘటనపై లోనావాలా పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ దినేష్ తాయ్డే మాట్లాడుతూ, సంఘటనా స్థలానికి ఒక బృందాన్ని పంపినట్లు తెలిపారు. నష్టం, దొంగతనం అంచనా పూర్తయిన తర్వాత కేసు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకుని నిందితులను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.