ఎస్‌బీఐలో భారీ చోరీ .. రూ.3.08 కోట్లు మాయం

ఎస్‌బీఐలో భారీ చోరీ ..  రూ.3.08 కోట్లు మాయం

ఎస్‌బీఐలో భారీ చోరీ జ‌రిగింది. గురువారం అర్ధరాత్రి ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం బ్యాంకులోనికి ప్ర‌వేశించిన దుండ‌గులు.. సీసీ కెమెరాల కనెక్షన్‌ కట్‌ చేసి.. కరెంటు తీసేసి.. అలారం మోగకుండా ఉండేందుకు బ్యాకప్ గా ఉన్న బ్యాటరీని తొలగించి రూ. 3.08 కోట్ల సొత్తును దొంగిలించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ఎస్‌బీఐ బ్యాంకులో చోటుచేసుకుంది.

 గ్రామంలోని  ఎస్‌బీఐ  బ్యాంకు లో నిన్న‌ అర్థరాత్రి బ్యాంకు కిటికీని తొలగించిన దొంగ‌లు..  అలారం మోగకుండా ఉండేందుకు ముందుగానే బ్యాటరీ కనెక్షన్ తీసేశారు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్‌తో లాకర్ బద్దలు కొట్టి, అందులోని రూ. 18.46 లక్షల నగదుతోపాటు రూ. 2.92 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను అపహరించారు. అంతేగాక, చోరీకి సంబంధించిన దృశ్యాలు రికార్డైన సీసీ ఫుటేజీ డీవీఆర్ బాక్స్‌ను కూడా  తీసుకెళ్లారు. ఈ ఘటనపై బ్యాంక్ మేనేజర్ పాలరాజు ఫిర్యాదుతో మంథని పోలీసులు కేసు నమోదు చేశారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన‌ రామగుండం సీపీ సత్యనారాయణ.. ఈ కేసును సవాలుగా తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల కోసం మొత్తం 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.