ప్రపంచంలోని మొత్తం చీమల బరువు 12 మిలియన్​ టన్నులు

ప్రపంచంలోని మొత్తం చీమల బరువు 12 మిలియన్​ టన్నులు

‘నకరాల్​ జేస్తే చీమను నలిపినట్లు నలిపి సంపుత బిడ్డా..’ అంటుంది ఒక సినిమాలో  నటి తెలంగాణ శకుంతల. చూడ్డానికి చిన్నగా ఉండే చీమల్ని చంపడం సులువే. కానీ అవి కుడితే మాత్రం ఎంతటివాళ్లకైనా చుర్రుమనడం ఖాయం. కొన్ని రకాల చీమలు కుడితే ఏకంగా మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. గ్లోబలైజేషన్​ ఎఫెక్టో,  క్లైమేట్​ ఛేంజ్​ వల్లో కానీ చీమల సంఖ్య బాగా పెరిగినట్లు ఈ మధ్య వచ్చిన సర్వేలు చెప్తున్నాయి. అందుకేనేమో ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. ఏకంగా ఊళ్ల మీద దాడికి దిగుతున్నాయి. ఇటీవల తమిళనాడులోని కరంతమలై అడవికి దగ్గరలోని కొన్ని గ్రామాలు, ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా ఇసుకలపేటలో చీమల బాధతో వార్తల్లోకి రావడమే దీనికి ఉదాహరణ.

భూమ్మీద చీమల ఉనికి ఎప్పుడు మొదలైందో చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే, ఇవి డైనోసార్ల కాలం నుంచే ఉన్నాయని సైంటిస్ట్​ల అంచనా. ఇటీవల వచ్చిన హార్వర్డ్​ యూనివర్సిటీ సర్వే ఇదే విషయం చెప్తోంది. దీని ప్రకారం చీమలు సుమారు 148 నుంచి 160 మిలియన్​ సంవత్సరాల నుంచి ఉన్నాయట. అంటే అప్పటికి ఇంకా డైనోసార్లు అంతరించిపోలేదు. అయితే, సైంటిస్ట్​లకు దొరికిన అత్యంత పురాతన చీమ శిలాజం మాత్రం 99 మిలియన్​ సంవత్సరాల కాలం నాటిది. 

15 వేల రకాలు.. 20 క్వాడ్రాలిన్​లు ​

చీమల్లో మొత్తం పదిహేను వేలకు పైగా రకాలున్నట్లు ఇటీవల వచ్చిన ‘ది లిటిల్​ థింగ్స్​ దట్​ రన్​ ద వరల్డ్​’ అనే సర్వే చెప్తోంది. అంతేకాదు, అంటార్కిటికాలో మినహా అన్ని చోట్లా చీమలు ఉన్నాయంటోంది. అలాగే ఇప్పుడు ప్రపంచంలో దాదాపు 20 క్వాడ్రాలిన్​(20 పక్కన 15 సున్నాలు)లు.. అంటే 20వేల ట్రిలియన్​ల చీమలు ఉన్నాయట! ఇది భూమ్మీద ఉండే మొత్తం జంతువులు, పక్షులు, మనుషుల సంఖ్య కంటే దాదాపు 20 రెట్లు ఎక్కువ!! అలాగే ప్రపంచంలోని మొత్తం చీమల బరువు 12 మిలియన్​ టన్నులు. ఇది మొత్తం జంతువులు(2 మిలియన్​ టన్స్​), పక్షులు(7మిలియన్​ టన్స్​) కంటే ఎక్కువ. ఈ సంగతులన్నీ ఈ ఏడాది సెప్టెంబర్​లో ‘ది జర్నల్​ ప్రొసీడింగ్స్​ ఆఫ్​ ద నేషనల్​ అకాడమీ ఆఫ్​ సైన్సెస్’లో పబ్లిష్​ అయ్యాయి. 

రైతు చీమలు 

కాలనీల లాంటి గూళ్లు కట్టుకోవడంలో చీమలు ఎక్స్​పర్ట్స్​. అందుకే ఇవి సొంత నాగరికత కలిగిన జంతువులని సైంటిస్ట్​లు చెప్తారు. అంతేకాదు, భూమ్మీద మొదట వ్యవసాయం చేసింది కూడా చీమలే అంటున్నారు. దీనికి ఉదాహరణగా అమెజాన్​ అడవుల్లోని ‘లీఫ్​–కట్టర్’​ చీమల గురించి చెప్తున్నారు. ఇవి మొక్కలు, చెట్ల నుంచి ఆకుల్ని  కత్తిరించి, వాటిని తమ గూళ్లలోకి తెచ్చి దాస్తాయి. దాని మీద ఫంగస్​ పెరిగేలా చేస్తాయి. ఈ ఫంగసే ఆ చీమల ఆహారం. అందుకే ఈ రకం చీమల్ని వ్యవసాయం చేసిన మొదటి రైతులుగా చెప్తున్నారు. గూళ్లను కాపాడుకోవడానికి వాటికి తమ లాలాజలంలోని ఒక రకం బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. చీమల్లోని మరొక ప్రత్యేక గుణం ఏంటంటే ఏదైనా చీమ తన కడుపు పూర్తిగా నిండిందనుకుంటే అందులోని కొంత భాగాన్ని రిగర్గిటేషన్​ అనే పద్ధతి ద్వారా పంచుకుంటుంది. అలాగే అవి తమ శరీరం నుంచి కొన్ని రకాల యాసిడ్స్​ను విడుదల చేయడం ద్వారా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. తిండి కోసం వెళ్లేటప్పుడు అవి ఒకదాని వెనక మరొకటి వెళ్లడానికి కారణం ఇదే. 

‘బుల్​డాగ్​’ భలే డేంజర్​

చీమలు కుడితే కాసేపు మంటగా అనిపించడం, దద్దుర్లు రావడం కామన్. కానీ, చీమల్లోని బుల్​డాగ్​ యాంట్​ కుడితే మాత్రం మనిషి ప్రాణాలు కూడా పోతాయి. ఆస్ట్రేలియాలో కనిపించే ఈ రకం చీమల వల్ల ఆ దేశంలో 1936 నుంచి ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఈ చీమల వల్ల చివరిసారిగా 1988లో ఒక వ్యక్తి చనిపోయినట్లు రికార్డు అయింది. ఇది అత్యంత డేంజరస్​ యాంట్​గా గిన్నిస్​ రికార్డ్​లోకి ఎక్కింది. ఇదే కాకుండా మరో ఏడు రకాల చీమలు కూడా డేంజర్​ అని సైంటిస్ట్​లు చెప్తున్నారు. అవి బుల్లెట్​​, ఆర్మీ​​, ఫైర్​, ఫ్లోరిడా హార్వెస్ట్​, గ్రీన్ ట్రీ​, పోనీ​, జాక్​ జంపర్​ యాంట్స్​. వీటి విషానికి మనిషిని హాస్పిటల్​లో పడేసేటంతటి శక్తి ఉంది. మనదేశంలో ఎర్ర చీమలు, నల్ల చీమలు, గండు చీమలు, చలి చీమలు ఎక్కువగా కనిపిస్తాయి. 
ఏమాటకామాట.. చీమలైనా, పాములైనా మనిషి జోలికి ఊరికే రావు. వాటి ప్రాణాలకు ముప్పు అనుకున్నప్పుడే అవి కాటేస్తాయి, కరుస్తాయి. అలాగే ఆహారం దొరక్కపోతే ఊళ్లమీద పడతాయి. పాములైతే భయం కానీ చీమలు ఏంచేస్తాయి? అనుకుంటున్నారేమో ‘... బలవంతమైన సర్పము చలి చీమల చేతచిక్కి చావదె సుమతీ’ అనే శతకపద్యం గుర్తుకు తెచ్చుకోండి.   

చీమల వేపుడు.. చట్నీ!

బాబోయ్!​ చీమలతో వేపుడు, చట్నీ ఏంటి అనుకుంటున్నారా? చీమలతో చేసే రకరకాల కూరలు తినేవాళ్లు ఆఫ్రికాలోనో, చైనాలోనే కాదు మనదేశంలోనూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. తెలంగాణలోని భద్రాచలం, ఆంధప్రదేశ్​లోని రంపచోడవరం, అరకు ప్రాంతాల్లోని గిరిజనులు చీమలతో వేపుడు, చారు, చట్నీ వంటివి చేసుకుని తింటారు.