అమెరికా జనాభాలో మనోళ్లు 28 లక్షలు

అమెరికా జనాభాలో  మనోళ్లు 28 లక్షలు
  •     1.06 కోట్ల మందితో టాప్ ప్లేస్ లో మెక్సికో
  •     22 లక్షల మందితో మూడో స్థానంలో చైనా
  •     2022లో 65 వేల మంది మనోళ్లకు అమెరికా పౌరసత్వం

అమెరికాలో మనోళ్ల సంఖ్య పెరుగుతోంది. అమెరికా జనాభాలో 28,31,330 మంది ఇండియన్ అమెరికన్లు ఉన్నారని 2023 గణాంకాలు వెల్లడించాయి. కోటి 6 లక్షల మందితో మొదటి స్థానంలో మెక్సికన్లు ఉన్నారు.

వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతి పౌరుల జనాభా పెరుగుతోంది. ఏటా రికార్డు సంఖ్యలో భారతీయులకు అమెరికా పౌరసత్వం లభిస్తోంది. ఆ దేశ జనాభాలో విదేశీ సంతతికి చెందిన అమెరికన్ పౌరుల లిస్టు చూస్తే భారత్ రెండో స్థానంలో ఉంది. అమెరికా పౌరుల జనాభాలో 28,31,330 మంది ఇండియన్ అమెరికన్లు (ఇండియాలో పుట్టి అమెరికా పౌరసత్వం పొందిన వారు) ఉన్నారని 2023 ఏడాది గణాంకాలు వెల్లడించాయి. ఈ లిస్టులో మెక్సికో టాప్ లో ఉంది.. అమెరికాలో1,06,38,429 మంది మెక్సికన్ అమెరికన్లు ఉన్నారు.

22,25,447 మంది  పౌరులతో చైనా మూడో స్థానంలో ఉంది. ఈ విషయాన్ని యూఎస్  సెన్సస్  బ్యూరోకు చెందిన అమెరికన్  కమ్యూనిటీ సర్వే డేటా వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న భారతీయుల్లో 42 శాతం మంది అమెరికా పౌరసత్వానికి ఇంకా అర్హత సాధించలేదని వివరించింది. 2023 నాటికి గ్రీన్ కార్డ్ పొంది అమెరికా పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న భారతీయుల సంఖ్య 2.90 లక్షలుగా ఉందని తెలిపింది.

2022 లో 65 వేల మందికి..

తాజా సర్వే ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో అమెరికాలో నివసిస్తున్న విదేశీయుల సంఖ్య 4.6 కోట్లు.. ఇందులో 2.45 కోట్ల మందికి అమెరికా పౌరసత్వం లభించింది. ఒక్క 2022 ఏడాదిలోనే 9,69,380 మంది సిటిజన్ షిప్ పొందారు. ఇందులో టాప్ లో మెక్సికన్లు (1,28,878 మంది) ఉండగా.. 65,960 మంది భారత సంతతి పౌరులకు అమెరికా పౌరసత్వం లభించింది. ఈ ఏడాదిలో అమెరికా పౌరసత్వం పొందిన దేశాల జాబితాలో మెక్సికో, భారత్ తర్వాతి స్థానాల్లో ఫిలిప్పీన్స్ (53,413), క్యూబా (46,913), డొమినికన్  రిపబ్లిక్ (34,525), వియత్నాం (33,246), చైనా (27,038) చైనా ఉన్నాయని కాంగ్రెషనల్  రీసెర్చ్  సర్వీస్ (సీఆర్ఎస్) తన ‘యూఎస్  న్యాచురలైజేషన్  పాలసీ’ రిపోర్టులో తెలిపింది.