
- యూఎస్ విజిట్ ముందు మోడీ కొన్ని ప్రకటనలు చేయొచ్చు
- మన దగ్గర అన్నీ ఉన్నాయి..క్రెడిబిలిటీ పెంచుకోవడంపై ఫోకస్ పెట్టాలి
- సెమీకండక్టర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ అజిత్ మనోచా
న్యూఢిల్లీ: దేశంలో సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఎదిగేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని, కానీ, క్రెడిబిలిటీని మెరుగుపరుచుకోవడంపై ఇండియా ఫోకస్ పెట్టాలని సెమీకండక్టర్ ఇండస్ట్రీకి ప్రాతినిధ్యం వహించే టాప్ గ్రూప్ ఒకటి వెల్లడించింది. ఇండియాలో సెమీకండక్టర్ ఇండస్ట్రీలో ఏడాదిన్నర కిందటి వరకు జీరో స్టార్టప్‌లు ఉన్నాయని, ప్రస్తుతం 2024 నాటికి 100 స్టార్టప్‌లు పుట్టుకొచ్చే స్టేజ్‌లో ఉందని వివరించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన రూ.76 కోట్ల విలువైన పీఎల్‌ఐ స్కీమ్ దేశ సెమీ కండక్టర్ సెక్టార్ రూపురేఖలను మారుస్తోంది. ట్యాలెంట్ ఎక్కువగా ఉండడం, స్కిల్ ప్రోగ్రామ్‌లు సెమీకండక్టర్ సెక్టార్ విస్తరించడానికి బాటలు వేస్తున్నాయి. సెమీకండక్టర్ ఇండస్ట్రీలో ఎదగడానికి ఇండియాకి ఇదే మంచి టైమ్ అని సెమీకండక్టర్ ఎక్విప్‌మెంట్ అండ్ మెటీరియల్స్ ఇంటర్నేషనల్ (సెమీ) ప్రెసిడెంట్ అజిత్ మనోచా పేర్కొన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ చేయలేమని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఇప్పుడున్న స్పీడ్ (సెమీకండక్టర్ సెక్టార్‌లో) ను చేరుకోవడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఇదే సరైన సమయం. ఇప్పుడు మనం ఏం చేయలేకపోతే మన క్రెడిబిలిటీ పోతుంది’ అని పేర్కొన్నారు. దేశ సెమీకండక్టర్ ఇండస్ట్రీలోకి కంపెనీలను ఆకర్షించేందుకు యూఎస్ విజిట్‌కు ముందే ప్రధాని కొన్ని ప్రకటనలు చేసే అవకాశం ఉందని అన్నారు.
అతిపెద్ద మార్కెట్.. ఫుల్ ట్యాలెంట్
‘సెమీకండక్టర్ ఇండస్ట్రీ సక్సెస్ కోసం కావాల్సినవన్నీ ఇండియాలో ఉన్నాయి. మన దగ్గర ట్యాలెంట్ ఉంది. ప్రపంచంలోనే మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన దగ్గర మార్కెట్ ఉంది. ఇండియాలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. చైనా కంటే అతిపెద్ద దేశంగా మారం. ఇక్కడ సుమారు అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంకా మనం ఇంటర్నేషనల్ రూల్స్‌ను ఫాలో అవుతున్నాం. కంపెనీలను ఆకర్షించడానికి అవసరమయ్యేవన్నీ మన దగ్గర ఉన్నాయి’ అని అజిత్ వివరించారు. రాజీవ్ చంద్రశేఖర్, అశ్వినీ వైష్ణవ్ వంటి మినిస్టర్లు ఉండడం మన అదృష్టమని అన్నారు. దేశం గురించి ఆలోచించే మోడీ లాంటి విజనరీ లీడర్ ఉన్నారని, చివరికి అన్ని అంశాలు కలిసొచ్చాయని అభిప్రాయపడ్డారు. కాగా, సిలికాన్ వ్యాలీలో హెడ్ క్వార్టర్ ఉన్న సెమీలో 2,500 కంపెనీలు మెంబర్లుగా ఉన్నాయి. సెమీకండక్టర్ టెక్నాలజీని, ఎలక్ట్రానిక్స్ డిజైన్‌ను, మాన్యుఫాక్చరింగ్‌ను మరింతగా విస్తరించడానికి 13 లక్షల మంది ప్రొఫెషనల్స్ గ్లోబల్‌గా పనిచేస్తున్నారు. గత కొన్నేళ్లుగా సెమీకి ఇండియాకి మధ్య సహకారం బాగుంది.
పీఎల్‌ఐ వంటి స్కీమ్‌లు అవసరం..
తాజాగా తెచ్చిన పాలసీ (పీఎల్‌ఐ) స్టార్టింగ్ పాయింట్ అని అజిత్ పేర్కొన్నారు. క్రెడిబిలిటీని పెంచుకోవడానికి ఇండియా పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వం కిందటేడాది తెచ్చిన ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం) లో ఆయన మెంబర్‌గా కూడా ఉన్నారు. ‘చాలా ఐఎస్‌ఎం మీటింగ్స్‌లలో పాల్గొన్నాను. మేము కొన్ని అప్లికెంట్లను పరిశీలించాం. వాటి వివరాలను ఇప్పుడే చెప్పలేను. కానీ, కనీసం ఒకటి లేదా రెండు పెద్ద అనౌన్స్‌మెంట్లు అయితే వచ్చే అవకాశం ఉంది’ అని అజిత్ పేర్కొన్నారు. దేశ సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఎదగడంలో యూఎస్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. యూఎస్‌లో చాలా రకాల సెమీకండక్టర్ సెగ్మెంట్‌లు ఉన్నాయని, డిజైన్, ఎక్విప్‌మెంట్ వంటి సెగ్మెంట్లలో లీడర్‌గా కొనసాగుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా మెటీరియల్స్ వంటి సెగ్మెంట్‌లో కూడా యూఎస్ స్ట్రాంగ్‌గా ఉందని, కానీ, ఈ సెగ్మెంట్‌లో జపాన్ టాప్‌లో ఉందని వివరించారు. టెక్నాలజీ విషయంలో యూఎస్ మనకు సాయం చేయగలదని అన్నారు. గ్లోబల్ కంపెనీలు ఇండియాకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, వాటికి రెడ్ కార్పెట్ వేయాలని అజిత్ సలహా ఇచ్చారు. కేవలం చిప్ ప్లాంట్ల కోసమే కాకుండా ఎకోసిస్టమ్ డెవలప్ అయ్యేందుకు సబ్సిడీలు ఇచ్చే స్కీమ్‌లను తేవాలని అన్నారు. సాయం చేయడానికి ముందుకొచ్చే కంపెనీలు, సహకారం అందించే కంపెనీల నుంచి ఇండియా నేర్చుకోవాలని అన్నారు. ఇండియాలో మంచి ట్యాలెంట్ ఉందని, వారికి ట్రెయినింగ్ ఇవ్వడంలో యూఎస్ సాయం చేస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఈ నెల చివరిలో యూఎస్‌లో పర్యటించనున్నారు.