తిరుపతి: వైభవంగా గంగమ్మ జాతర.. మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు

తిరుపతి:  వైభవంగా గంగమ్మ జాతర.. మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు

తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర ఎంతో వైభవంగా జరుగుతోంది.‌  గంగమ్మ  ఆలయంలో ప్రత్యేక పూజలు ‌నిర్వహించారు అర్చకులు.  ఆదివారం‌ కావడంతో  ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.  భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.  

జాతర మహోత్సవాలలో బాగంగా ఆదివారం ( మే 11) న మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు.  వివిధ వేష ధారణలతో కళాకారుల నృత్యాలు భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులకు  ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుపతి  నగర కమిషనర్‌ ఎన్‌.మౌర్య  జాతరను తిలకించేందుకు యాత్రికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ..అందుకు తగిన విధంగా  ఏర్పాట్లు చేశారు.

ఇక ఈ జాతరకు ప్రధాన ఆకర్షణ వేషాలు. ప్రధానంగా జాతరలో బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, మాతంగి వేషం, సున్నపు కుండల వేషం… చివరగా దొర వేషం ధరించి .. భక్తులు ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు. అప్పుడే పుట్టిన పురిటి బిడ్డల నుంచి పండు ముసలి వరకు… చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా వేషాలు ధరించి మొక్కులు తీర్చుకుంటారు. వీటితోపాటు ఆడవేషం, దేవుళ్ళ వేషం, పౌరాణిక ప్రముఖుల వేషాలు ధరించి గంగమ్మ ఆశీర్వాదం పొందుతారు.

గంగమ్మ జాతర..  వేషాల జాతరగా ప్రసిద్ధికి ఎక్కింది.ఈ జాతరలో ఐదవరోజు మాతంగి వేషం..  ప్రత్యేకతే వేరు.  పురుషులు అచ్చం ఆడపడుచుల్లా కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తారు. శరీరమంతా గంధం పూసుకుని చీరలను ధరిస్తారు.  . ఇలా చేస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు తమపై ఉంటాయని భక్తులు నమ్ముతారు. అందుకే సిగ్గు పడకుండా చీరలు కట్టుకుని సింగారించుకుని జాతరలో సందడి చేస్తుంటారు. ఇక గంగమ్మ జాతరలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఎక్కడైనా అమ్మవారి జాతరంటే ఎంతో భక్తశ్రద్ధలతో.. నిష్టగా జరుపుతారు. గంగమ్మ జాతరను కూడా భక్తులు అంతే భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.

గంగమ్మ జాతరకు స్థానికులే కాదు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ , కర్ణాటక, తమిళనాడు వాసులు సైతం తరలి వస్తుంటారు. తిరుపతిని మొత్తం ఏడుగురు గ్రామదేవతలు కాపాడుతున్నారని భక్తుల నమ్మకం. అందులో ఒకరైన   గంగమ్మ తల్లి... శ్రీ వేంకటేశ్వస్వామికి స్వయానా చెల్లెలని భక్తులు విశ్వశిస్తుంటారు. అందుకే ఈ గంగమ్మ జాతర అంటే రాయలసీమలో ఓ రేంజ్‌ హడావుడి కనిపిస్తుంది. 

గంగమ్మ జాతర జరిగే రోజుల్లో  తిరుపతి వీధులు కోలాహలంగా ఉంటాయి.  అంబలి.. పెరుగన్నం జాతరకు వచ్చే భక్తులకు వితరణ చేస్తారు.  జాతర జరిగే రోజులన్నింటిలోనూ వీధులలో అంబలి వితరణ, పెరుగన్నం దానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. 

గంగమ్మ తల్లి ఇక్కడ ఎలా వెలిసిందంటే..

గంగమ్మ ఇక్కడ ఎలా వెలసింది. ఎందుకు వివిధ వేషాలు వేసిందన్న దానికి చాలా కారణాలు ఉన్నాయి.  గతంలో తిరుపతిని పాలిగాళ్లు పరిపాలించే వారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ సమయంలో  ఆరాచకాలు ...  మహిళలపై దాడులు..  వారిని చెరపట్టడం వంటి అకృత్యాలకు పాల్పడేవారు. అప్పుడు  పాలిగాళ్ల పెట్టే భాదలు భరించలేక తిరుపతి ప్రజలు గంగమ్మను వేడుకున్నారు. పాలెగాళ్లను అంతమొందించడం కోసం గంగమ్మ తల్లి అనేక వేషదారణల్లో ప్రయత్నం చేసింది. ఈవిధంగా అనేక వేషాలు వేసి ..చివరికి పాలిగాడి వేషంలోనే పాలిగాడిని అంతమొందించింది. 

పాలిగాడి వేషంలో అమ్మవారు తిరుగుతున్నప్పుడు. తిరుపతిని పాలించడానికి తమకు పోటీగా మరో పాలెగాడు వచ్చాడరి ని భావించిన పాలెగాళ్లు... వేషదారణలో ఉన్న గంగమ్మ దగ్గరకు వచ్చారు.  అప్పుడు గంగమ్మ తన విశ్వ రూపంతో పాలెగాళ్లను మట్టుపెట్టింది. ఈ విధంగా వారం రోజులపాటు ఈ జాతర కన్నులపండువగా సాగిందని చెబుతుంటారు. 

పాలెగాళ్లను అంతమొందించేందుకు  గంగమ్మ కట్టిన వేషాలే భక్తులు జాతర సమయంలో ధరిస్తారు. గంగమ్మజాతరలో భాగంగా వారం రోజులపాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు ఆయా రోజుల్లో ఆరువేషాలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు. బైరాగి వేషంతో ప్రారంభమయ్యే వేషాల కోలాహలం గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగుతాయి.