తెలంగాణలో సింగిల్ టీచర్​తో నడిచే స్కూళ్లు 5 వేల 821

తెలంగాణలో సింగిల్ టీచర్​తో నడిచే స్కూళ్లు 5 వేల 821
 
  • సింగిల్ టీచర్​తో నడిచే స్కూళ్లు 5,821 
  •  డైట్ కాలేజీల్లో 67%.. ఎస్సీఈఆర్టీలో 46% ఖాళీలు 
  • సమగ్ర శిక్ష పీఏబీ మినిట్స్ కేంద్ర విద్యాశాఖ వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని సర్కారు బడుల్లో స్టూడెంట్ల సంఖ్య తగ్గిపోతున్నది. 2023–24 విద్యాసంవత్సరం మొత్తం 30 వేల స్కూళ్లుంటే..దాంట్లో 13,364 బడుల్లో 50 మందిలోపే విద్యార్థులున్నారని సమగ్ర శిక్ష పీఏబీ మినిట్స్ వెల్లడించింది. ఈ13,364 బడుల్లో ప్రైమరీ స్కూళ్లతోపాటు యూపీఎస్, హైస్కూళ్లు కూడా ఉండటం విద్యావేత్తలను ఆందోళన కలిగిస్తున్నది. మరోపక్క.. సింగిల్ టీచర్ తో నడుస్తున్న స్కూళ్లు స్టేట్​లో 5,821 ఉండగా, 1213 బడుల్లో ఒక్క స్టూడెంట్ కూడా చేరలేదు. సింగిల్ టీచర్ స్కూళ్లలోని ఉపాధ్యాయులను దగ్గరలోని ఇతర బడులకు డిప్యుటేషన్ పై పంపించారు. అయితే, ఏటా జీరో ఎన్ రోల్ మెంట్ స్కూళ్లు మారుతూ ఉన్నాయి.

రాష్ర్టానికి రూ.1907 కోట్ల నిధులు..

సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అవ్రూవల్ బోర్డు(పీఏబీ)సమావేశం ఢిల్లీలో  ఫిబ్రవరి 16న జరగ్గా..దాంట్లో 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్లాన్, బడ్జెట్ పై చర్చించారు. ఈ క్రమంలో  మీటింగ్ మినిట్స్​ను కేంద్ర విద్యాశాఖ రెండ్రోజుల క్రితం రిలీజ్ చేసింది. 2024–25 విద్యాసంవత్సరానికిగాను తెలంగాణకు సమగ్ర శిక్ష స్కీమ్ ద్వారా రూ.1907 కోట్ల నిధులను ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంట్లో కేంద్రం తనవాటా కింద 1,148 కోట్లు ఇస్తుండగా, మిగిలిన రూ.765 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. కేంద్రం ఇచ్చే నిధుల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోసం 906 కోట్లు, సెకండరీ, సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ కోసం రూ.230 కోట్లు, టీచర్ ఎడ్యుకేషన్ కోసం రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నారు.  

నిధులిచ్చినా నిర్మాణాలు జరగలే..

 రాష్ట్రానికి తాము నిధులు ఇచ్చినా విద్యాలయాల్లో ఇంకా పలు నిర్మాణాలు  ప్రారంభించలేదని కేంద్రం తెలిపింది. దీంట్లో  బాయ్స్ టాయ్ లెట్లు 9.44%,  గర్ల్స్ టాయ్ లెట్లు 5.86%, సీడబ్ల్యూఎస్ఎన్ టాయ్ లెట్లు 15.45%, ఇంటిగ్రేటెడ్ సైన్స్ ల్యాబ్స్ 18.13%, ఐసీటీ 11.7%, సికల్ ఎడ్యుకేషన్ ల్యాబ్స్ 71% పనులు ప్రారంభం కాలేదని వివరించింది. వచ్చే విద్యాసంవత్సరమైనా పనులు పూర్తిచేయాలని ఆదేశాలిచ్చింది. అలాగే..ఎస్సీఈఆర్టీలో 46.16%, డైట్ కాలేజీల్లో 67.83%   పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. వాటిని వెంటనే భర్తీ చేసి విద్యాలయాలను బలోపేతం చేయాలని సూచించింది. ఈ పోస్టులను జూన్ 30లోగా భర్తీ చేస్తే, డైట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద నిధులు ఇవ్వనున్నట్టు పేర్కొన్నది. రాష్ట్రంలోని ప్రైమరీ స్కూళ్ల రేషనలైజేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తెలిపింది. సోషల్ ఆడిట్ నిర్వహణ ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని  కోరింది.