తుర్​తుక్​లోని మ్యూజియంలో రాజవంశాల వస్తువులు

తుర్​తుక్​లోని మ్యూజియంలో రాజవంశాల వస్తువులు

ఒక ఊరికి వెళ్లాలంటే రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో వెళ్లొచ్చు. వాటిలో కూడా రెండు మూడు దారులు ఉంటాయి. ఒకదారి కాకపోతే మరో దారిలో వెళ్లొచ్చు. కానీ, ఈ ఊరికి వెళ్లాలంటే ఉన్నది ఒకే ఒక దారి. అందుకే ఈ ఊరికి ఎలా వెళ్లారో అలాగే తిరిగి రావాలి. ఇండియా, పాకిస్తాన్​ సరిహద్దులో ఉన్న ఈ ఊళ్లో ఇంకా బోలెడు స్పెషల్స్ ఉన్నాయి. ఆ ఊరి పేరు తుర్​తుక్. 

తుర్​తుక్​లో13వశతాబ్దంలో బౌద్ధులు ఉండేవాళ్లు. కానీ, ఇప్పుడు అక్కడ బాలిస్టిక్ ప్రజలు, సూఫీ ముస్లింలు ఉన్నారు. తుర్​తుక్ ఊళ్లోని మసీదు మీద స్వస్తిక్, బౌద్ధ, ఇరానియన్లకు సంబంధించిన డిజైన్లు ఉంటాయి. ఇక్కడి వాళ్లు మాట్లాడే భాష బాల్టి. పాత టిబెట్​, పర్షియన్​ భాషల కలయిక నుంచి వచ్చింది ఈ భాష. టూరిస్ట్​లు ఇక్కడికి వెళ్లేందుకు 2010 నుంచి అనుమతినిచ్చింది భారత ప్రభుత్వం. 

వీళ్లు ఇక్కడ – వాళ్లు అక్కడ

1971 వరకు తుర్​తుక్ పాకిస్తాన్​లోనే ఉంది. ఆ తర్వాత మన దేశంలో కలిసింది. అప్పటి వరకు వాళ్లు పాకిస్తానీయులే. భారత్​ – పాక్ యుద్ధంలో తుర్​తుక్​ని భారత్​ స్వాధీనం చేసుకుంది. సరిహద్దును కాపాడుకోవడం కోసం మనదేశం ఈ ప్రాంతాన్ని తిరిగి పాకిస్తాన్​కి ఇవ్వలేదు. మనదేశంలో కలిశాక కూడా తుర్​తుక్​ గ్రామానికి చెందిన కొంతమంది ప్రజలు పాకిస్తాన్​లో ఉండిపోయారు. ఇప్పటికీ తుర్​తుక్​లో ఉన్న వాళ్ల బంధువులు, రక్త సంబంధీకులు, తోబుట్టువులు చాలామంది పాకిస్తాన్​లో ఉన్నారు.

చూసేవి.. చేసేవి..

కారకోరం పర్వతాల అందాలు, ఆప్రికాట్ తోటలు కనువిందు చేస్తాయి. బక్​వీట్​(గోధుమల్లో ఒక రకం)తో తయారుచేసే రొట్టెలు, మాంసం, ఆప్రికాట్​, వాల్ నట్స్​తో తయారుచేసిన పాయసం వాళ్ల ట్రెడిషనల్ ఫుడ్.16వ శతాబ్దానికి చెందిన పోలో గ్రౌండ్​ ఒకటి ఉంది ఇక్కడ. ఈ గ్రౌండ్​లో ఇప్పటికీ ఆడుతుంటారు. టూరిస్ట్​లు కూడా సరదాగా ఇక్కడ కాసేపు ఆడుకోవచ్చు. తుర్​తుక్​లో బ్రోక్పా అనే పురాతనమైన కోట ఉంది. ఈ కోటలోకి వెళ్తే యగ్బో రాజవంశం ఆనవాళ్లు చూడొచ్చు. అలాగే సింపుల్​గా గ్రీక్​ స్టైల్​లో కట్టిన వాటర్ మిల్ కూడా తుర్​తుక్​లో ఉంది. తుర్​తుక్​లో ఉన్న లోకల్ మ్యూజియంలో అప్పటి రాజవంశాల వాళ్లకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి. మ్యూజియంకు వెళ్తే వాటన్నింటి గురించి వివరంగా తెలుసుకోవచ్చు.  

వెళ్లాలంటే...

తుర్​తుక్​ వెళ్లి రావడానికి ఉన్నది ఒక్కటే దారి. అందుకని అక్కడికి వెళ్లి వచ్చేందుకు పర్మిషన్ ఇచ్చినంత టైంలోపే రిటర్న్ అవ్వాలి.  జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మనవాళ్లు లద్దాక్​లో కొన్ని  ప్రాంతాలకు వెళ్లాలంటే ఇన్నర్ లైన్​ పర్మిట్ ఉండాలి. ఎందుకంటే కొన్ని ప్రొటెక్టెడ్​ ఏరియాల్లోకి కొంత టైం మాత్రమే పర్మిట్​ చేస్తారు కాబట్టి. అందుకని, అక్కడికి వెళ్లాలంటే... ‘మనదేశ పౌరుడే. లోపలికి అనుమతించండి’ అని తెలిపేందుకు ఇండియన్ అథారిటీ స్టాంప్ వేసిన ఈ పర్మిట్ ఇస్తారు. ఆ పర్మిట్ మనవాళ్లకైతే మూడు వారాలు పనికొస్తుంది. అదే విదేశీయులకైతే15 రోజులు పనిచేస్తుంది. ‘ ప్రొటెక్టెడ్​ ఏరియా పర్మిట్’ ఉంటేనే అనుమతిస్తారు. ఈ పర్మిట్​ల​ను ఆన్​లైన్​లో తీసుకోవచ్చు. లేదంటే లెహ్​ మెయిన్ మార్కెట్లో ఉన్న డిప్యూటీ కమిషనర్ ఆఫీస్​లో తీసుకోవాలి. సోమవారం నుంచి శనివారం వరకు ఆఫీస్ ఉంటుంది. వేసవిలో అయితే ఆదివారం కూడా ఓపెన్​లో ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసి, ఫీజు కడితే స్టాంప్​ వేసి ఇస్తారు. దానికోసం డ్రైవింగ్ లైసెన్స్, పాస్​పోర్ట్, ఓటర్​ కార్డ్, ఆధార్, పాన్​ కార్డ్ వంటి ఐడి ప్రూఫ్ ఉండాలి. విదేశీయులు పాస్​పోర్ట్​తో పాటు వీసా లేదా ఓసీఐ (ఓవర్సీస్​ సిటిజన్​షిప్​ ఆఫ్​ ఇండియా) కార్డ్ చూపించాలి. ఈ పర్మిట్ కోసం ఎన్విరాన్​మెంట్ (400రూ.), రెడ్ క్రాస్(100రూ.), వైల్డ్ లైఫ్​ ప్రొటెక్షన్​ ఫీజు(20రూ/రోజుకి)ఉంటాయి. ఉదాహరణకు మూడు రోజుల కోసమైతే 560 రూపాయలు కట్టాలి. అదంతా జరగాలంటే లేట్ అవుతుంది. కాబట్టి ప్రాసెసింగ్ ఫీజుగా 200 రూపాయలు కడితే  వెంటనే పర్మిట్ ఇస్తారు. దీనికోసం ఆన్​లైన్​లో అఫీషియల్ సైట్​లో అప్లై చేయొచ్చు. అప్రూవ్​ అయిన కాపీ తీసుకుని అక్కడికి వెళ్లాక దాన్ని చూపించాలి. 
తుర్​తుక్ గ్రామానికి వెళ్లడానికి రోడ్డు మార్గం ఒక్కటే ఉంది.  లెహ్​ ఎయిర్​ పోర్ట్​లో దిగి, 205 కి.మీలు అంటే... దాదాపు 6 నుంచి 8 గంటల జర్నీ చేయాలి. లెహ్ నుంచి ట్యాక్సీ లేదా బస్​లో వెళ్లొచ్చు.  

రాతి బంకర్లే ఫ్రిజ్​లు

కారకోరం, హిమాలయ పర్వతాల మధ్యలో ఉంటుంది తుర్​తుక్​. ఈ ఊరిని ఆనుకుని షయోక్​ నది పారుతూ ఉంటుంది. ఇక్కడ చలి ఎంత ఎక్కువో, వేసవిలో టెంపరేచర్స్‌ కూడా అంత ఎక్కువగానే ఉంటాయి. అందుకే ఇక్కడి ప్రజలు ఆహారం పాడుకాకుండా ఉంచేందుకు ప్రత్యేకమైన పద్ధతులు పాటిస్తారు. రాళ్లతో చిన్న చిన్న బంకర్లు కడతారు. రాళ్ల మధ్య చిన్న రంధ్రాలు ఉండేలా పేరుస్తారు. ఆ రంధ్రాల ద్వారా బయట నుంచి కొత్త గాలి వస్తుంది. లోపలి వేడి గాలి బయటకు పోతుంది. వీటిని నాన్​ చంగ్ అంటారు. ఆ బంకర్లలో మాంసం, పెరుగు వంటివి దాచిపెడతారు. అక్కడక్కడా రాతి ఆనకట్టలు కూడా కనిపిస్తాయి.