మేడారంతో పాటు ఇవీ చూసేయండి

మేడారంతో పాటు ఇవీ చూసేయండి

ఏటూరునాగారం,వెలుగు: మేడారం జాతర ప్రారంభం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మేడారంలో వనదేవతలను దర్శించుకోవడంతో పాటు అనేక ఆధ్యాత్మిక, టూరిస్ట్ ప్రాంతాలను తిరుగుతూ ఎంజాయ్ చేయొచ్చు. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాళ్లకు వరంగల్ కోట, భద్రకాళి ఆలయం, రామప్ప చూసే ఛాన్స్ ఉండగా, ఏటూరు నాగారం మీదుగా ఖమ్మం జిల్లాతో పాటు ఏపీ నుంచి వచ్చే భక్తులు మంగపేట మండలంలోని మల్లూరు హేమచలక్షేత్రాన్ని దర్శించుకోవచ్చు.

వరంగల్ కోట 

వరంగల్ కోట కాకతీయుల కళానైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ కోట నిర్మాణా న్ని 13వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన గణపతిదేవుడు ప్రారంభించగా.. ఆయన బిడ్డ రాణీరుద్రమదేవి పూర్తి చేశారు. వరంగల్ కోట ప్రతి ఒక్కరూ చూడాల్సిన చారిత్రక స్థలం. దీనినే ఖిలా వరంగల్ అంటారు. వరంగల్ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ నుంచి సుమారు 3 కిలోమీట ర్లు. హనుమకొండ బస్ స్టేషన్ నుంచి 8.7 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. కాకతీయుల కళానైపుణ్యానికి నిదర్శనంగా నిలిచే కట్టడం ఇది. ఇక్కడున్న ఖుష్ మహల్, రాతికోట, చిల్డన్స్ పార్క్ టూరిస్ట్ లను ఆకర్షిస్తాయి. అన్ని స్టేషన్ల నుంచి కోటకు బస్సులు, ఆటోలు నడుస్తాయి.

భద్రకాళి టెంపుల్

వరంగల్ రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి 4.5 కిలో మీటర్లు, హనుమకొండ బస్టాండ్ నుంచి 4.4 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది భద్రకాళి టెంపుల్. ఈ ఆలయానికి దక్షిణ భాగాన ఓ గుహ కూడా ఉంటుంది. అందులో మునులు తపస్సు చేసేవారని చెప్తుంటారు. గుడికి ఎదురుగా పెద్ద చెరువు ఉండగా, కట్టను భద్రకాళి బండ్ గా డెవలప్ చేశారు. దీంతో ఈ ప్రాంతం టూరిస్టులతో కళకళలాడుతోంది.

వేయి స్తంభాల గుడి

హనుమకొండ నుంచి ములుగు వెళ్లే మెయిన్ రోడ్డుపై వేయిస్తంభాల ఆలయం ఉంది. హనుమకొండ బస్టాండ్ నుంచి 2.4 కిలోమీటర్లు, వరంగల్ రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి 5.6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. కాకతీయుల కళానైపుణ్యానికి ఈ టెంపుల్ ప్రతీకగా నిలుస్తోంది. రుద్రేశ్వరాలయంగా పిలువబడే ఈ ఆలయంలో శివ లింగం ఉంటుంది. ఆలయానికి ఈశాన్యంలో కోనేరు, ఎదురుగా నల్లరాతి శిలతో చేసిన నందీశ్వరుడు, కల్యాణమండపం ఉంటాయి. కాకతీయులు ఇక్కడి నుంచి ఓరుగల్లు కోటకు వెళ్లేందుకు రహస్య మార్గం కూడా నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

శ్రీకాళేశ్వర-- ముక్తీశ్వర దేవాలయం

కాళేశ్వరం భూపాలపల్లి జిల్లాలో ఉంది. హనుమకొండ నుంచి ములుగు వైపు వెళ్లే 163 జాతీయ రహదారికి 16 కిలోమీటర్ల దూరంలోని గుడెప్పాడ్​క్రాస్​ ద్వారా భూపాలపల్లి జిల్లా మీదుగా కాళేశ్వరం చేరుకోవచ్చు. అక్కడ గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణిగా సరస్వతీ నది కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడింది. ఈ నది ఒడ్డున శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానపట్టంపై రెండు శివలింగాలు ప్రతిష్ఠించి ఉండడం విశేషం. దేశంలో ఉన్న మూడు సూర్య దేవాలయాల్లో ఒక్కటి ఇక్కడే ఉంది. 

రామప్ప ఆలయం

యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఉంది. హనుమకొండ నుంచి ములుగు రోడ్డు మీదుగా 163వ జాతీయ రహదారిపై ఉన్న జంగాలపల్లి క్రాస్ నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణించి పాలంపేటలోని రామప్పకు చేరుకోవచ్చు. ములుగు జిల్లా కేంద్రం నుంచి కూడా రామప్పకు బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. ఇక్కడికి మేడారం వచ్చేటప్పుడు వెళ్లొచ్చు, తిరుగు ప్రయాణంలో భూపాలపల్లి మీదుగా వచ్చేటపుడు ములుగు గణపురం క్రాస్ మీదుగా కూడా రామప్పకు చేరుకోవచ్చు. 

మల్లూరు హేమాచల క్షేత్రం

మంగపేట మండలంలోని మల్లూరులోని గుట్ట హేమాచల లక్ష్మీనృసింహస్వామి స్వయంభువుగా వెలిశాడు.  ఈ ఆలయం రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధి. ఇక్కడ ఉన్న చింతమాణి అనే జలధార నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. గుట్టలపై నుంచి జాలువారే ఈ నీటిని తాగితే రోగాలు పోతాయని భక్తుల నమ్మకం. బూర్గంపాడు, ఏటూరునాగారం ప్రధాన రహదారిపైన ఉన్న మల్లూరు గ్రామం నుంచి కొండపైకి 4.3 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. స్వయంభువుగా వెలసిన స్వామివారి ఒంటిపై వెంట్రుకలు కనిపిస్తాయి. ఈ ఆలయం ములుగు నుంచి 82, ఏటూరునాగారం నుంచి 27, తాడ్వాయి నుంచి 40, మంగపేట నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

బొగత జలపాతం

తెలంగాణ నయగరాగా పేరుగాంచిన బొగత జలపాతం ములుగు జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి గ్రామంలో ఉంది. జూన్,​ జులై, ఆగస్టు నెలల్లో జలపాతం నిండుగా ప్రవహిస్తుంది. మిగతా రోజుల్లో సన్నటిధారగా మారుతుంది. ఇక్కడికి చేరుకోవాలంటే ఏటూరునాగారం నుంచి 24 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి.