సాదాబైనామాలకు పట్టాలివ్వని ప్రభుత్వం

సాదాబైనామాలకు పట్టాలివ్వని ప్రభుత్వం
  • రెండేండ్లుగా అప్లికేషన్లు పెండింగ్ 
  • 9.24 లక్షల మంది రైతుల ఎదురుచూపులు
  • రైతు బంధు, రైతు బీమా రాక ఇబ్బందులు 
  • అడ్డంకిగా కొత్త రెవెన్యూ చట్టం.. సవరించని సర్కార్  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తెల్ల కాగితంపై రాసుకొని భూములు కొనుగోలు చేసిన రైతుల గోస తీరడం లేదు. ఏండ్ల సంది ఎదురుచూస్తున్నా సాదాబైనామా దరఖాస్తులను సర్కార్ పరిష్కరించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 9.24 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా.. సుమారు 20 లక్షల ఎకరాల భూములకు పట్టాదారు పాస్ బుక్స్ జారీ కాలేదు. పాసుబుక్స్ రాక రైతులు నాలుగేండ్ల నుంచి రైతు బంధు, రైతు బీమా లాంటి స్కీమ్ లు కోల్పోతున్నారు. అంతేగాక భూమి ఉన్నా బ్యాంకు లోన్లు పొందలేకపోతున్నారు. ప్రభుత్వం రెండేండ్ల కింద తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టమే సాదాబైనామాల పరిష్కారానికి అడ్డంకిగా మారింది. చట్ట సవరణ చేసి ఈ భూములకు పట్టాలిచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. 

గతంలో రిజిస్ట్రేషన్ విధానం పకడ్బందీగా అమలుకాని రోజుల్లో గ్రామాల్లో చాలా మంది పెద్ద మనుషుల సమక్షంలోనే తెల్ల కాగితాలపై భూముల కొనుగోలు, అమ్మకాల అగ్రిమెంట్లు రాసుకునేవారు. ఆ తర్వాత వీఆర్వో, తహసీల్దార్ ను కలిసి ఏ మూడు, నాలుగేండ్లకో పహాణీలో నమోదు చేయించేవారు. అది కూడా కాస్తుదారు కాలమ్ లోనే రాయించేవారు. మరికొందరు పట్టాదారు పాసు బుక్స్ తీసుకునేవారు. రెవెన్యూ రికార్డులపై అవగాహన లేని కొందరు రైతులు సాదాబైనామా పేపర్ ఉందనే ధీమాతో రెవెన్యూ ఆఫీసుల వైపు వెళ్లలేదు. కేవలం ఇవి తెల్ల కాగితాలపై రాసుకున్నవి కావడంతో వారికి రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ కాలేదు. దీంతో భూరికార్డుల ప్రక్షాళన సమయంలో పాసు బుక్స్ కూడా జారీ కాలేదు. ఇలాంటి రైతులు లక్షల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు రెండుసార్లు సాదాబైనామా దరఖాస్తులు స్వీకరించారు. 2014 జూన్‌‌‌‌ 2 లోపు తెల్ల కాగితాలపై రాసుకున్న లావాదేవీల రెగ్యులరైజేషన్ కోసం 2016లో అప్లికేషన్లు ఆహ్వానించగా మీ సేవా కేంద్రాల ద్వారా 11.19 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఇందులో 6.15 లక్షల దరఖాస్తులను పరిష్కరించి ప్రభుత్వం వారికి యాజమాన్య హక్కులు కల్పించింది. సరైన ఆధారాలు లేవని సుమారు 3 లక్షల అప్లికేషన్లను రిజెక్ట్ చేయగా మరో 2.4 లక్షల దరఖాస్తులు పెండింగ్ ఉండిపోయాయి. ఈ క్రమంలోనే మంత్రులు,  ఎమ్మెల్యేల డిమాండ్​తో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి 2020 అక్టోబరు 12 నుంచి నవంబరు 10 వరకు సాదాబైనామా అప్లికేషన్లను స్వీకరించగా మరో 7.20 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. పాత వాటితో కలిపితే మొత్తం అప్లికేషన్ల సంఖ్య 9.24 లక్షలకు చేరింది.

చట్టాన్ని సవరిస్తేనే పరిష్కారం..

హైదరాబాద్‌‌‌‌ రికార్డ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ రైట్స్‌‌‌‌ యాక్ట్‌‌‌‌–1948 ప్రకారం తెల్ల కాగితాలపై రాసుకొని కొనుగోలు చేసిన భూములకు పట్టాలిచ్చే అధికారం తహసీల్దార్లకు ఉండేది. రిజిస్ట్రేషన్ తో పాటు సాదాబైనామాను ఇందులో పరిగణనలోకి తీసుకునేవారు. ప్రతి ఏటా జమాబందీ నిర్వహించడం ద్వారా కాస్తుదారులను గుర్తించి తహసీల్దార్లు పట్టాదారు పాస్‌‌‌‌ పుస్తకం జారీ చేసేవారు. 1971లో హైదరాబాద్‌‌‌‌ రికార్డ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ రైట్స్‌‌‌‌ యాక్ట్‌‌‌‌–1948ను అప్పటి ప్రభుత్వం సవరించి భూమి కొనుగోలు లావాదేవీలపై రిజిస్ట్రేషన్‌‌‌‌ డాక్యుమెంట్‌‌‌‌ ఉంటేనే పట్టాదారు పాస్‌‌‌‌ పుస్తకం ఇవ్వాలనే నిబంధనతో ఆర్వోఆర్ యాక్ట్ –1971ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో తెల్లకాగితాలపై లావాదేవీలు చెల్లకుండాపోయాయి. 1989లో ఈ చట్టాన్ని సవరించి సాదాబైనామాలను పరిష్కరించే అధికారాన్ని మరోసారి తహసీల్దార్లకు అప్పగించారు. ఈ సవరణ ఆధారంగానే ఉమ్మడి ఏపీలో 1989, 2000 సంవత్సరాల్లో అప్లికేషన్లు తీసుకున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక 2016, 2020లో దరఖాస్తులు తీసుకున్నారు. అయితే 2020 అక్టోబర్ 29 నుంచి ధరణి పోర్టల్ తో పాటు అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం సాదాబైనామాల రెగ్యులరైజేషన్ కు అడ్డంకిగా మారింది. సాదాబైనామాను కొత్త చట్టం అంగీకరించదు. ధరణిలో డిజిటల్ రూపంలో ఉన్న రికార్డులనే రెవెన్యూ రికార్డులుగాఈ చట్టం పరిగణిస్తుంది. ఇదే విషయాన్ని హైకోర్టు కూడా ప్రశ్నించింది. దీంతో సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంపై అనిశ్చితి ఏర్పడింది. కొత్త చట్టాన్ని సవరిస్తే తప్ప.. సుమారు 20 లక్షల ఎకరాలకు పాసుబుక్స్ జారీ అయ్యే చాన్స్ లేదు. రెండేండ్లలో అనేకసార్లు కేబినెట్ మీటింగ్ జరిగినా, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినా కొత్త రెవెన్యూ చట్టంలో సవరణల గురించి చర్చించలేదు.

కొత్త చట్టంలో ఒక్క ప్రొవిజన్ చేర్చితే చాలు..

సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి అనుగుణంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని సవరిస్తేనే రైతులకు పాసుబుక్స్ జారీ చేయడం సాధ్యమవుతుంది. 1989లో ఆర్వోఆర్ యాక్ట్ లో చేర్చిన సెక్షన్ 5ఏ ప్రొవిజన్ ను కొత్త చట్టంలో చేర్చితే సరిపోతుంది. తహసీల్దార్లకు అధికారాలివ్వాలి. లేదంటే ఆర్డీఓలకైనా ఇచ్చి సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలి. కలెక్టర్లే  9.24 లక్షల దరఖాస్తులు పరిష్కరించాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఆలస్యం చేస్తున్న కొద్దీ భూముల విలువలు పెరగడంతో కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య వివాదాలు పెరిగే అవకాశముంది. భూమిపై హక్కు లేకపోవడం వల్ల రైతులు అనేక అవకాశాలు కోల్పోతున్నారు.
- భూమి సునీల్, భూ చట్టాల నిపుణుడు