ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

భోజనంలో బల్లి పడ్డ స్కూల్​లో అన్నీ సమస్యలే

పాలకుర్తి(దేవరుప్పుల), వెలుగు: ఇటీవల భోజనంలో బల్లి పడి, స్టూడెంట్లకు ఫుడ్ పాయిజన్ అయిన జనగామ జిల్లా దేవరుప్పుల కస్తూర్బా గాంధీ స్కూల్​లో సమస్యలు వేధిస్తున్నాయి. సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అధ్వానంగా ఉంది. స్కూల్​లో నాణ్యమైన భోజనం అందడం లేదు. టాయిలెట్లకు కనీసం డోర్లు లేవు. గదుల్లో లైట్లు వెలగడం లేదు. వాటర్ ప్లాంట్ రిపేరుకు గురై మూలన పడింది. ఈ స్కూల్​లో 120 మంది స్టూడెంట్లు చదువుతుండగా.. వీరికి 20 టాయిలెట్లు నిర్మించారు. ఇందులో సగం మాత్రమే పని చేస్తున్నాయి. డోర్లు, కిటీకీలు విరిగిపోవడంతో పురుగులు, కీటకాలు లోపలికి వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి స్కూల్ ను బాగు చేయాలని స్టూడెంట్లు, పేరెంట్స్ కోరుతున్నారు.

పుడ్ పాయిజన్ పై విచారణ జరపాలి
జనగామ అర్బన్:
దేవరుప్పుల కస్తూర్బా స్కూల్​లో పుడ్ పాయిజన్ ఘటనపై విచారణ జరిపించాలని ఏబీవీపీ జనగామ జిల్లా కన్వీనర్ ఉల్లెంగుల రాజు డిమాండ్​చేశారు. ఈమేరకు శుక్రవారం జనగామ చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. హాస్టళ్లలో సౌలతులు లేక స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో వేల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం.. స్కూళ్లకు నయాపైసా కేటాయించడం లేదన్నారు.

స్కాలర్ షిప్ లు రిలీజ్ చేయాలి
పెండింగ్​లో ఉన్న స్టూడెంట్ల స్కాలర్​షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ ను వెంటనే చెల్లించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధర్మబిక్షం ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. ఈమేరకు శుక్రవారం జనగామ కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు. విద్యారంగంపై కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. పెంచిన ఇంజనీరింగ్ ఫీజులు తగ్గించాలన్నారు. నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలన్నారు. హాస్టళ్లలో ఏఎన్ఎంలను నియమించాలని కోరారు. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు.

‘పట్టా చేయండి సారు..’
కలెక్టర్ కాళ్లుపట్టుకున్న గిరిజన మహిళ
నల్లబెల్లి, వెలుగు:
వరంగల్ జిల్లా నల్లబెల్లిలో శుక్రవారం కలెక్టర్ గోపి పర్యటించి, పోడు  సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా తనకు పట్టా చేయాలని ఓ గిరిజన మహిళ కలెక్టర్ కాళ్ల మీద పడింది. గోవిందపురం పరిధిలోని ఎర్రాయి చెరువు తండాకు చెందిన గూగులోతు పూలమ్మ 20 ఏండ్లుగా పోడు భూమి సాగు చేసుకుంటుంది. ఇప్పటివరకు పట్టా రాకపోవడంతో కలెక్టర్ కాళ్లపై పడి వేడుకుంది. పట్టా వచ్చేలా చూస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ గోపి మండలంలోని కొండాపూర్, మూడుచెక్కలపల్లి, గోవిందాపూర్ గ్రామాల్లో పర్యటించి పోడు సర్వేను పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేశారు. గడువులోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు.

క్వాలిటీ లేకుంటే బిల్లుల్లో కోత
వరంగల్ సిటీ, వెలుగు :
అభివృద్ధి పనుల్లో క్వాలిటీ లేకుండా బిల్లుల్లో కోత తప్పదని కమిషనర్ ప్రావీణ్య హెచ్చరించారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో జరుగుతున్న పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. శుక్రవారం సిటీలోని పలు వార్డుల్లో కమిషనర్ పర్యటించారు. బాలసముద్రం, సర్క్యూట్ గెస్ట్ హౌస్, హంటర్ రోడ్, వడ్డేపల్లి, అశోక్ కాలనీ, జవహర్​నగర్ తదితర ప్రాంతాల్లో బీటీ రోడ్లు, మురుగు కాలువ నిర్మాణాలను పరిశీలించారు. కొన్నిచోట్ల బిల్డింగ్ పర్మిషన్లను పరిశీలించారు. సిబ్బందికి సూచనలు, సలహాలు చేశారు. ఆమె వెంట సీపీ వెంకన్న, ఇంజనీర్లు ఉన్నారు.

హోటళ్లలో తనిఖీలు
జనగామ అర్బన్, వెలుగు :
జనగామ పట్టణంలోని పలు హోటళ్లలో మున్సిపల్ ఆఫీసర్లు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ జంపాల రజిత ఆధ్వర్యంలో హోటళ్లు, బేకరీల్లోని ఆహార పదార్థాలను చెక్ చేశారు. 9 హోటళ్లు, ఒక బేకరీలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటికి రూ.15వేల జరిమానా విధించారు.

నకిలీ బిల్లులతో ఇసుక దందా
రఘునాథపల్లి, వెలుగు :
నకిలీ వే బిల్లులతో ఇసుక తరలిస్తున్న నాలుగు లారీలను జనగామ జిల్లా రఘునాథపల్లి మండల పోలీసులు సీజ్ చేశారు. శుక్రవారం మండలంలోని కొమ్మల్ల వద్ద నేషనల్ హైవేపై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించగా.. ఇసుక లారీలు కనిపించాయి. బిల్లులు చెక్ చేయగా.. అవి నకిలీవని తేలడంతో నాలుగు లారీలు స్వాధీనం చేసుకున్నారు. ఈ లారీలకు సంబంధించిన ఓ కారు వెనకాలే వస్తుండగా.. దానికి కూడా పట్టుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేశారు.

ఎంజీఎంలో ధరల దోపిడీ
వరంగల్ సిటీ, వెలుగు :
ఎంజీఎం ప్రాంగణంలో వెలసిన షాపులు పేషెంట్ల వద్ద అందినకాడికి దోచుకుంటున్నాయి. లీటర్ బాటిల్ రేట్ 20 రూపాయలైతే.. రూ.50 వసూలు చేస్తున్నాయి. రూ.10 సబ్బుకు రూ.15 నుంచి రూ.20 తీసుకుంటున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే.. తమ నుంచి ఆఫీసర్లకు ముడుపులు కూడా ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఎంజీఎం ఆర్ఎంవో మురళిని దీనిపై వివరణ కోరగా.. ఇది తమ పరిధిలోకి రాదని చెప్పడం గమనార్హం.

ఓటమి భయంతోనే కేసీఆర్ నీచ రాజకీయాలు

మహాదేవపూర్, వెలుగు : మునుగోడులో టీఆర్ఎస్ ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ లీడర్లు మండిపడ్డారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ కుట్రను నిరసిస్తూ.. శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కొనుగోళ్ల డ్రామా కేసీఆర్ దేనని, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు టీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో లేరన్నారు. ఆయా కార్యక్రమాల్లో మహదేవపూర్ బీజేపీ మండలాధ్యక్షుడు సిరిపురం శ్రీమన్నారాయణ, ప్రధాన కార్యదర్శి మంత్రి రాజేందర్, బొల్లం కిషన్, మండల ఉపాధ్యక్షులు ఆన్ కారి రాజేందర్, సంతోషం, సురేశ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు గోర శ్రీకాంత్, ఏటూరునాగారం బీజేపీ మండలాధ్యక్షుడు గండెపల్లి సత్యం, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం సత్యం, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఈక మహాలక్ష్మీ, యువ మోర్చా మండలాధ్యక్షుడు వినుకొల్లు చక్రి తదితరులున్నారు.

రొమ్ము క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలి
వరంగల్ సిటీ, వెలుగు :
రొమ్ము క్యాన్సర్ పై మహిళలు అవగాహన పెంచుకోవాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. ఈ వ్యాధి గుర్తించడానికి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలన్నారు. శుక్రవారం బల్దియా, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, ఎన్ఎస్​ఎస్, షీ  టీం, ఒమేగా బన్ను హాస్పిటల్, కూరపాటి హాస్పిటల్ ఆధ్వర్యంలో సిటీలో ‘మెగా బ్రెస్ట్ క్యాన్సర్’ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మేయర్ గుండు సుధారాణి జెండా ఊపి ఈ ర్యాలీ ప్రారంభించారు. రొమ్ము క్యాన్సర్ నానాటికీ విస్తరిస్తోందని, అనుమానాలు ఉన్న మహిళలు ఎలాంటి అపోహలకు పోకుండా టెస్టులు చేయించుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పువాటిల్లుతుందన్నారు.

పోడు సర్వే స్పీడప్ చేయాలి

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలో పోడు సర్వీ స్పీడప్ చేయాలని, ప్రతి క్లెయిమ్​ను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. గురువారం భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రుతో కలిసి బయ్యారం మండలంలోని రామచంద్రాపురం, అల్లీగూడెం, పందిపంపుల గ్రామాల్లో కలెక్టర్ పోడు సర్వేను పరిశీలించారు. అటవీ చట్టం నియమాలను అనుసరించి రిపోర్టు రెడీ చేయాలన్నారు. ఎఫ్ఆర్సీ  కమిటీలు సర్వే సిబ్బందికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో  ఏటీడీవో భాస్కర్, తహసీల్దార్ రమేశ్ తదితరులున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నాణ్యమైన వైద్యం
బయ్యారం పీహెచ్ సీని కలెక్టర్ శశాంక పరిశీలించారు. వార్డులు, ఆపరేషన్ థియేటర్, ఫార్మసీ స్టోర్ ను తనిఖీ చేశారు. పీహెచ్ సీలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలకు పీహెచ్ సీలను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో హరీశ్​రాజు తదితరులున్నారు. అనంతరం బయ్యారం మండలం ఇర్సులాపురం ఆశ్రమ ఉన్నత పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు.

బెల్ట్ షాపులపై చర్యలేవి?

మండల సభలో ప్రజాప్రతినిధుల ఫైర్

స్టేషన్ ఘన్ పూర్, వెలుగు : గ్రామాల్లో మద్యం ఏరులై పారుతున్నా బెల్ట్ షాపులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. శుక్రవారం స్టేషన్ ఘన్ పూర్ ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ కందుల రేఖగట్టయ్య అధ్యక్షత మండల సభ నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో జడ్పీ స్టాండింగ్​కమిటీ చైర్మన్ మారపాక రవి.. ఎక్సైజ్ ఆఫీసర్ల నిర్లక్ష్యంపై ధ్వజమెత్తారు. బెల్ట్ షాపులను ప్రోత్సహించడం సరికాదన్నారు. స్టేషన్ ఘన్ పూర్ ఎంపీటీసీలు మాట్లాడుతూ.. స్థానిక బస్టాండ్​ సమీపంలో నేషనల్ హైవే పక్కనే బెల్ట్ షాపులు ఉన్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు. హెల్త్ ఆఫీసర్లు ప్రగతి నివేదిక చదువుతుండగా ఇప్పగూడెం ఎంపీటీసీ గండి విజయలక్ష్మి అడ్డుకుని, వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పగూడెంలో డ్రైనీజీలు అధ్వానంగా ఉన్నా, దోమలతో డెంగీ జ్వరాలు వస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్​ పూల్ సింగ్ చౌహాన్, ఇన్ చార్జి ఎంపీడీవో క్రిష్ణ, ఎంపీవో సుధీర్ కుమార్, పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్ ఉన్నారు.

పాలేరు వాగులో యువకుడి గల్లంతు

తొర్రూరు(పెద్దవంగర), వెలుగు : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలపరిధిలోని బొమ్మకల్ వద్ద పాలేరు వాగులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఎస్సై రియాజ్ పాషా, గ్రామస్తుల వివరాల ప్రకారం.. తొర్రూరు పట్టణానికి చెందిన చింతల అనిల్(33) దీపావళి సందర్భంగా బొమ్మకల్ గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. పాలేరు వాగు సమీపంలోనే బంధువుల పొలం ఉండడంతో శుక్రవారం అక్కడికి వెళ్లాడు. వాగులో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుందామని వెళ్లి, ప్రమాదవశాత్తు  నీటిలో పడిపోయాడు. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వాగులో కొట్టుకుపోయాడు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.