
- ముగిసిన ఏ3, ఏ6 నిందితులు కల్యాణి, సంతోషి కస్టడీ.. తిరిగి చంచల్ గూడ జైలుకు తరలింపు
- డాక్టర్ నమ్రతను మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్
- తాజాగా 9 మంది అరెస్ట్.. 26కు చేరిన నిందితుల సంఖ్య
పద్మారావునగర్, వెలుగు: సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ దురాగతాలు దేశవ్యాప్తంగా వ్యాపించడంతో ఈ కేసు విచారణను సీబీఐకీ అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ప్రభుత్వం ఒపీనియన్ కోరినట్లు సమాచారం. సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతున్నది. ఈ కేసులో ఏ-3 గా ఉన్న వైజాగ్ సెంటర్ బ్రాంచీ మేనేజర్ సి.కల్యాణి అచ్చాయమ్మ, ఏ-6 గా ఉన్న మీడియేటర్ ధనశ్రీ సంతోషి ఐదు రోజుల విచారణ కస్టడీ బుధవారంతో ముగిసింది. దీంతో నార్త్ జోన్ డీసీపీ కార్యాలయం నుంచి వీరిద్దరిని తీసుకెళ్లిన గోపాలపురం పోలీసులు.. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి, సికింద్రాబాద్ సివిల్ కోర్టులో హాజరుపర్చారు.
ఇక్కడి నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా, గత 5 రోజుల పోలీసుల కస్టడీ విచారణలో ప్రధాన నిందితురాలు, సృష్టి సెంటర్ ఓనర్ డాక్టర్ నమ్రత పలు కీలక అంశాలకు సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. సరోగసీ పేరుతో ఇప్పటి వరకూ 80 మంది పిల్లలను కొనుగోలు చేసి విక్రయించినట్లు ఆమె అంగీకరించారని తెలిసింది. తెలంగాణతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఏజెంట్ల ద్వారా శిశువులను కొనుగోలు చేసి, సేకరించామని, అందరికి డబ్బులిచ్చినట్లు నమ్రత తెలిపారని తెలిసింది. కానీ తన దగ్గర ఏజెంట్ల వివరాలు లేవని చెప్పినట్లు సమాచారం. 80 మంది శిశువుల కన్న తల్లిదండ్రుల వివరాల గురించి నమ్రతను పోలీసులు ప్రశ్నించారు. సరోగసీ మోసాలు, చైల్డ్ ట్రాఫికింగ్, తదితర అంశాలపై సమగ్ర సమాచారం అవసరం ఉందని, ఇందుకు నమ్రతను మరోసారి కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 26 మందిని అరెస్ట్ చేయగా, ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిసింది.
ప్రముఖ గైనకాలజిస్ట్ లెటర్ హెడ్స్ వాడిన నమ్రత
సృష్టి కేసులో డాక్టర్ నమ్రత చేసిన దారుణాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. నమ్రత అక్రమంగా తన లెటర్‌హెడ్స్ వాడారంటూ సికింద్రాబాద్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ బుధవారం గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లయింట్‌తో కలిపి గోపాలపురం స్టేషన్‌లో ఇప్పటివరకు సృష్టి అరాచకాలపై నమోదైన ఎఫ్ఐఆర్‌ల సంఖ్య ఏడుకు చేరింది. ఈ కేసులో బుధవారం 9 మంది నిందితులను అరెస్ట్ చేసిన గోపాలపురం పోలీసులు.. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. జడ్జి ఆదేశాల మేరకు వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు.
వీరిలో వైజాగ్ సృష్టి బ్రాంచీలో డాక్టర్లుగా పనిచేస్తున్న అనుశ్రీ, రమ్యతోపాటు అనస్థీషియన్ రవి, ముగ్గురు తల్లిదండ్రులు, ముగ్గురు ఏజెంట్లు ఉన్నారు. 2018 నుంచే వీరి దందా కొనసాగుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రముఖ బ్యాంకుల్లో నమ్రత, వారి అనుచరులు ఖాతాలను తెరిచి, అందులో కోట్ల రూపాయలను జమ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అధికారులు నమ్రత బ్యాంక్ ఖాతాల్లోని డబ్బుల లావాదేవీలన్నీ నిలిపివేశారు. అక్రమ సరోగసీ, చైల్డ్ ట్రాఫికింగ్‌తో కోట్ల రూపాయలు సంపాదించిన నమ్రత.. తెలంగాణ, ఏపీలో భారీగా కమర్షియల్ ప్లాట్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. వీటి వివరాలు తెలపాలని పోలీసులు రెండు రాష్ట్రాల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల అధికారులకు లేఖలు రాసినట్లు సమాచారం.