
- సిద్దిపేటలో మూడు నెలలుగా పెండింగ్.. ఆఫీస్‌లోనే 3 వేల స్మార్ట్ కార్డులు
- పోస్టల్ శాఖకు బకాయిలు చెల్లించకపోవడమే కారణం
- చేతివాటాన్ని ప్రదర్శిస్తున్న సిబ్బంది!
- ఇబ్బందుల్లో వాహనదారులు
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు బి.భూపతి. హకీంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తన హెవీ వెహికల్ లైసెన్స్ రెన్యువల్ కోసం మూడు నెలల కింద సిద్దిపేట డీటీవోలో దరఖాస్తు చేసుకున్నాడు. వెంటనే వారం రోజుల్లోపు కార్డు రావాల్సి ఉన్నా ఇంత వరకు ఇవ్వకపోవడంతో ఇంకా ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. రెన్యువల్ లైసెన్స్ ఇన్‌టైంలో డిపోలో అందజేయకపోతే డ్యూటీ చేయనివ్వరని అతడు ఆందోళన చెందుతున్నాడు. ఇది భూపతి మాత్రమే ఎదుర్కొంటున్న సమస్య కాదు.. జిల్లాలో వేల మంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట డిస్ట్రిక్ట్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్‌లో కొంత కాలంగా స్మార్ట్ కార్డుల జారీలో డిలే కొనసాగుతోంది. ఆఫీస్ నుంచి పోస్టల్ శాఖకు ఇవ్వాల్సిన చార్జీల డబ్బులు చెల్లించకపోవడమే ఇందుకు కారణం. దాదాపు మూడు వేలకు పైగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు వాహనదారులకు అందకుండా ఆఫీస్‌లోనే ఉండిపోయాయి. జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్ ఆర్టీఏ ఆఫీసులకు సంబంధించిన ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ లు డిస్ట్రిక్ట్ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయం నుంచే జారీ అవుతాయి.
ఏరోజుకారోజు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆర్సీ, లైసెన్స్ కార్డుల ప్రింట్ లతో స్మార్ట్ కార్డులను మరుసటి రోజు పోస్ట్ ద్వారా వాహనదారుల అడ్రస్‌కు పంపిస్తారు. ఇది మూడు రోజుల్లో ముగిసే ప్రక్రియ కాగా, ప్రస్తుతం నిలిచిపోయి మూడు నెలలు అవుతోంది. డిస్ట్రిక్ట్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ నుంచి బట్వాడా జరిగే ఒక్కో ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించి పోస్టల్ శాఖకు రూ.35 చొప్పున చెల్లిస్తుంది. ఈ క్రమంలో పోస్టల్ శాఖకు దాదాపు రూ.13 లక్షల బిల్లులు పెండింగ్ లో ఉండటంతో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్ ల జారీ ప్రక్రియకు ఆటంకంగా మారింది. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే ఆర్సీ, లైసెన్స్ కార్డులను పంపిణీ చేస్తామని పోస్టల్ శాఖ స్పష్టం చేసింది.
ఆఫీసర్ల మధ్య కోఆర్డినేషన్ లేక..?
డీటీవోలోని ఆఫీసర్ల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం కూడా స్మార్ట్ కార్డుల జారీ జాప్యంలో కొంత మేర ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తోంది. అలాగే టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్స్ కు, అధికారుల మధ్య మామూళ్ల వ్యవహారం కూడా డిలేకు కారణమవుతున్నట్లు సమాచారం.
పైసలిస్తే పనైతోంది..!
ఎవరైనా వాహనదారులు స్మార్ట్ కార్డులు ఇంకెప్పుడిస్తారని ఆఫీస్‌కు వచ్చి అడిగితే కార్డుల కొరత ఉందని, పోస్టు ద్వారా ఇంటికే కార్డు వస్తుందని చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే అదనంగా డబ్బులిస్తే మాత్రం వెంటనే కార్డు చేతికి అందుతున్నట్టు సమాచారం. దీనికి తోడు స్థానిక ఏజెంట్ల గ్రూపు తగదాలు కొంతమేర కార్డుల జారీ ఆలస్యం కావడంపై ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తోంది. అలాగే హెవీ వెహికల్స్ కు సంబంధించి పేపర్ ఆర్సీలకు కొందరు ప్రైవేటు వ్యక్తులు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
వాస్తవానికి ఆఫీసులో ఇవ్వాల్సిన పేపర్ ఆర్సీలకు ప్రైవేటు ఏజెంట్లు ఒక్కొక్కరి నుంచి రూ.200 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పేపర్ ఆర్సీలు లేకపోతే హెవీ వెహికల్స్ కు చెకింగ్ సమయంలో ఇబ్బంది అవుతుందనే భయంతో వాహన యజమానులు చేసేదేమీ లేక ఎక్కువ డబ్బులు చెల్లించి పేపర్ ఆర్సీలు తీసుకెళ్తున్నారు. ఈ తతంగంపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటున్నాం
పోస్టల్ శాఖకు కొంతమేర చార్జీలు పెండింగ్ లో ఉండటంతోనే స్మార్ట్ కార్డుల పంపిణీ లో జాప్యం ఏర్పడింది. రెండు రోజుల కిందే దీనిపై పోస్టల్ శాఖ అధికారులతో చర్చించి పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని చెప్పాం. ఒకటి, రెండు రోజుల్లో డీటీవో ఆఫీస్‌లోని స్మార్ట్ కార్డులను వాహనదారుల అడ్రస్ లకు పోస్టల్ శాఖ ద్వారా పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. - సి.దుర్గాప్రసాద్, డిస్ట్రిక్ట్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్, సిద్దిపేట