కరోనా 2021: గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి

కరోనా 2021: గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి

కరోనా వైరస్ ఎఫెక్ట్ రాష్ట్రంపైనా చాలానే పడింది. చాలా మంది ఫ్రంట్ లైన్ సిబ్బందితో సహా జనం చనిపోయారు. ట్రీట్మెంట్ దగ్గర్నుంచి కరోనా కేసులు, మరణాల లెక్కలపై రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పలు సందర్భాల్లో హైకోర్టు కూడా తీవ్రస్థాయిలో రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. దేశంలో ప్రతి పది వేల మంది జనాభాకు సగటున 8.5 హాస్పిటల్ బెడ్స్, ఎనిమిది మంది డాక్టర్లు యావరేజ్ గా అందుబాటులో ఉన్నారు. సెకండ్ వేవ్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు వారానికి 10 లక్షలకు పైగా కరోనా కేసులు వచ్చాయి. వస్తున్న పేషెంట్లకు, ఉన్న మెడికల్ హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు అసలు సంబంధమే లేకుండా పోయింది. దీంతో చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. 


సెకండ్ వేవ్ అలా ముగియగానే ఇలా థర్డ్ వేవ్ అంటూ ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. పిల్లలపైనే కరోనా ఎఫెక్ట్ చూపుతుందన్న విశ్లేషణలు వచ్చాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకోలేకపోవడం ఒకటైతే, అప్పుడప్పుడే బయటకు వెళ్తుండడంతో వారిపైనే ఎఫెక్ట్ ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే అనుకున్నంత స్థాయిలో పిల్లలపై కరోనా పంజా విసరలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలో మొదటి నుంచి కరోనా హెల్త్ కేర్ పై తక్కువ వసతులు ఉన్నట్లు విమర్శలు వచ్చాయి. కరోనా కట్టడి చర్యల విషయంలోనూ తీవ్ర విమర్శలు వచ్చాయి. కరోనా కేసులు, మరణాల లెక్కలపై గతేడాది, ఇప్పుడు అదే పరిస్థితులు రిపీట్ అయ్యాయి. చాలా వరకు లెక్కలు పూర్తిగా చెప్పలేదన్న విమర్శలు వచ్చాయి. మరణాలను కూడా పూర్తిస్థాయిలో చూపెట్టలేకపోయారు. హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ విషయంలోనూ చాలా సమస్యలు ఎదురయ్యాయి. నిజానికి సెకండ్ వేవ్ ను కట్టడి చేసే అవకాశం మన రాష్ట్రంలో ఉన్నా... ఆ దిశగా సర్కారు చర్యలు చేపట్టలేకపోయింది. పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరిగినా సరిహద్దుల్లో చెక్ పోస్టులు పెట్టడం, టెస్టులు చేయడం, ప్రజారవాణాపై ఆంక్షలు పెట్టకపోవడం వంటి చర్యలతో పెద్ద ఎత్తున వైరస్ వ్యాప్తి జరిగింది. చాలా వరకు నష్టం జరిగిపోయింది.

ప్రజారోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని హైకోర్టు ఈ ఏడాది చాలా సార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా సెకండ్ వేవ్ స్పీడ్ గా ఉంటే స్లో గా టెస్టుల సంఖ్య పెంచుతామనడం ఏమిటని నిలదీసింది. నిద్ర నుంచి మేల్కోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సెకండ్ వేవ్ ముందే చురకలంటించింది. కరోనా టెస్టులు, ట్రీట్మెంట్, కట్టడిపై ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టులపైనా చాలా సందర్భాల్లో ప్రశ్నల వర్షం కురిపించింది. టెస్టుల సంఖ్య ఎందుకు పెంచడం లేదని అడిగింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచకుండా యాంటిజెన్ టెస్టులు మాత్రమే చేయడంపై ప్రశ్నించింది. 

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పైనా ఈ ఏడాది గందరగోళం నెలకొంది. ఇప్పుడిప్పుడే పరిస్థితి దారికి వచ్చింది. గతంలో హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకుంది రాష్ట్ర సర్కారు. సెలవుల్లో వ్యాక్సిన్ ఇవ్వకపోవడమేంటని, దేశంలో ఒక రూల్, రాష్ట్రంలో మరో రూల్ ఉంటుందా అని అడిగింది. కరోనా కేసుల డైలీ బులెటిన్లో  టెస్టులు, రిజల్ట్స్, బెడ్స్ ఖాళీల వివరాలు సమగ్రంగా ఇవ్వాలని చెప్పినా వాటిని రాష్ట్ర సర్కార్ సరిగా మెయింటేన్ చేయలేకపోయింది. చెప్పినా డేటా పెట్టట్లేదని కూడా ఆగ్రహించిన సందర్భాలున్నాయి. వైన్స్, బార్లు, పబ్లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు చాలా సందర్భాల్లో ప్రశ్నించింది. పెండ్లిళ్లు, అంత్యక్రియల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని, మాస్కులు ధరించని వాళ్లకు జరిమానా విధించాలని కరోనాపై విచారణ సందర్భంగా ఎన్నోసార్లు హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. కరోనాపై హైకోర్టులో విచారణ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి, హెల్త్ డైరెక్టర్లు పలుమార్లు హాజరవ్వాల్సి వచ్చింది. కేవలం నైట్ కర్ఫ్యూ పెట్టి చేతులు దులిపేసుకుంటున్నట్లు కనిపిస్తోందని హైకోర్టు సెకండ్ వేవ్ టైంలో అసంతృప్తి వ్యక్తం చేసింది.

ప్రైవేట్ హాస్పిటల్స్ లో పెద్ద ఎత్తున దోపిడీ జరిగినట్లు పేషెంట్లు పలు సందర్భాల్లో వాపోయారు. హెల్త్ కార్డులు ఏవీ పని చేయలేదు. బిల్లు ముందు కడితేనే బెడ్ కన్ఫామ్ అయ్యే పరిస్థితి వచ్చింది. చాలా మంది ఆస్తులు, బంగారం కుదువ పెట్టి డబ్బులు కట్టి తమ వారిని కాపాడుకునే ప్రయత్నాలు చేశారు. జనం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న హాస్పిటల్స్ పై హైకోర్టు ఆదేశాలతోనే ప్రభుత్వం ముందుకు కదిలింది. కొన్ని హాస్పిటల్స్ కరోనా ట్రీట్మెంట్ లైసెన్స్ రద్దు చేసింది. అయితే అక్కడ పేషెంట్లు కట్టిన డబ్బులను కొందరివి ఇప్పించారు. అది కూడా హైకోర్టు డైరెక్ట్ గా ఫాలో అప్ చేయడంతో పనులు జరిగాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత బ్లాక్, యెల్లో ఫంగస్ కేసులు చాలా వరకు వచ్చాయి. కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత ఫంగస్ లు ఎటాక్ చేశాయి. ఇలా కూడా చాలా మంది చనిపోయారు. కరోనా ట్రీట్మెంట్ లో పెద్ద ఎత్తున మెడిసిన్స్ ఇవ్వడం, యాంటీ వైరల్ ఔషధాలు వాడడంతో అప్పటికప్పుడు కరోనా తగ్గినా ఆ తర్వాత ఫంగస్ లు ఎటాక్ చేశాయి. వీటి మందులు దొరకడం కూడా గగనమైంది. చాలా వరకు కరోనా మందులు బ్లాక్ మార్కెట్ కు తరలిపోయాయి. 


మరోవైపు కరోనాతో రాష్ట్రంలో లక్షా 20 వేల మంది చనిపోయారని, కానీ, 3,912 మందే చనిపోయారంటూ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు హైకోర్టులో ఇటీవలే పిల్ వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం కరోనా మృతుల కుటుంబాలకు 50 వేల సాయం ప్రకటించిందని, కానీ, రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కల వల్ల తక్కువ మందికే సాయం అందుతుందన్నారు. అందరికీ న్యాయం జరగాలంటే మరణాల అసలు సంఖ్య బయటపెట్టాలని, అందుకు కొవిడ్ డెత్ ఆడిట్ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తంగా ఇలాంటి ఘటనలతో ఈ ఏడాది ముగిసిపోయింది. ఇక ఇప్పుడు రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు ఒక్కొక్కటిగా పెరుగుతున్నాయి. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు, కేంద్రం సూచనలతో కొన్ని కరోనా గైడ్ లైన్స్ ను అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించారు.