న్యాయ వ్యవస్థలోనూ సమన్యాయం కావాలి : బైరి వెంకటేశం

న్యాయ వ్యవస్థలోనూ సమన్యాయం కావాలి : బైరి వెంకటేశం

సామాజిక న్యాయం జరగాలంటే న్యాయవ్యవస్థలోనూ ప్రక్షాళన జరగవల్సిందే – ఈ వ్యాఖ్యలు అన్నది మరెవరో కాదు సాక్షాత్తు భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్. నవంబర్ 12న ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు . ఈ దేశ న్యాయవ్యవస్థలో  ఉన్నత స్థాయిలో రావల్సిన  మార్పులపై  సీజేఐ స్వయంగా ప్రభుత్వ బాధ్యతలను గుర్తింప చేస్తూ చేసిన ప్రసంగం మరిన్ని కీలక మార్పులకు శ్రీకారం చుడుతుందని సామాన్య ప్రజలు భావిస్తున్నారు. మహిళలు, సమాజంలోని అణగారిన వర్గాల వారు న్యాయపాలికలోకి మరింత పెద్ద సంఖ్యలో ప్రవేశించాలని అభిప్రాయపడ్డారు. అందుకు వీలుగా మొత్తం న్యాయ వ్యవస్థ మరింత ప్రజాస్వామ్యయుతంగా, ప్రతిభ ఆధారితంగా మార్చాల్సిన అవసరం చాలా ఉందన్నారు. 

అణగారిన  వర్గాలకు అన్యాయమే ..

‘ఎవరూ పట్టించుకోని అణగారిన వర్గాల ఆక్రందన వినగలిగి, వారి బాధలను చూడగలిగి, చట్టాన్ని, న్యాయాన్ని నేర్పుగా బ్యాలెన్స్ చేయగలిగిననాడు న్యాయమూర్తిగా బాధ్యతలను సరిగా నిర్వర్తించినట్టు లెక్క’ అని ఇటీవల  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు. కానీ ఈ దేశ జనాభాలో 85 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాల ప్రాతినిధ్యం  దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థలో సరైన నిష్పత్తిలో  లేక పోవడమే ఇక్కడ చర్చనీయాంశం. ఈ దేశ అత్యున్నత నాయస్థానంలో 1980లో జస్టిస్ వరదరాజన్ మొదటి దళిత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.  కేజీ బాలకృష్ణన్  తొలి దళిత ప్రధానన్యాయమూర్తిగా 2007 నుంచి 2010 వరకు విధులు నిర్వహించారు.  మొత్తం మీద దేశంలో 20 శాతం జనాభా గలిగిన దళిత వర్గాల నుంచి ఏడుగురు మాత్రమే న్యాయమూర్తులుగా బాధ్యతలు నిర్వర్తించారు. 1980 వరకు ఓబీసీ, ఎస్సీ కులాల నుంచి ఒక్క జడ్జి కూడా సుప్రీం కోర్టులో లేరు. ఆ తర్వాతనే  ఓబీసీకి చెందిన జస్టిస్ ఎస్​ఆర్​ పాండ్యన్, కేఎన్​ సైకియా, కేఎస్​ హెగ్డే, ఏఎన్​ అలెగిరిస్వామి  సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులుగా ఉన్నారు. 

బ్రిటీష్ కాలం నాటి కొలీజియం వ్యవస్థ 

భారత న్యాయ వ్యవస్థలో ప్రధాన లోపం హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకం, కొలీజియం ద్వారా  చేయడం. భారతదేశంలో అత్యున్నత స్థాయి పదవులైన ఐఏఎస్ లేదా ఐపీఎస్​కు ఎంపిక కావాలంటే యూపీఎస్సీ  నిర్వహించే రెండంచెల రాత పరీక్షలు, మౌఖిక పరీక్షల్లో  అత్యధిక మార్కులు వచ్చిన  ప్రతిభావంతులైన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తున్నారు. భారత దేశంలో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకీ ఇవే విధానాలు అనుసరిస్తారు. కానీ  భారత న్యాయ వ్యవస్థలో అలాంటి పరీక్షా విధానంతో జడ్జీల నియామకం లేకపోవడం గమనార్హం. లోపభూయిష్టమైన  కొలీజియం వ్యవస్థ ద్వారా చేపడుతున్నారు.  ప్రస్తుత కొలీజియంలో ఐదుగురు సభ్యులు ఉన్నారు. పైగా ఇక్కడ రిజర్వేషన్లు పాటించడం ఉండదు. కొలీజియం చెప్పిందే శాసనం. కాబట్టి ఇప్పటికైనా ఈ కొలీజియం వ్యవస్థకు చరమగీతంపాడి, రాజ్యాంగ బద్ధంగా న్యాయ మూర్తుల నియామకంలో సామాజిక న్యాయం పాటిస్తూ, ప్రామాణిక పరీక్షల ద్వారా  అన్ని వర్గాల వారికి అవకాశం కలిపించినప్పుడే వారిచ్చే తీర్పులు  కూడా ఏకపక్షంగా కాకుండా సామాజికన్యాయం పాటించే విధంగా ఉంటాయని చెప్పొచ్చు.

ప్రజలకు చేరువ కావాలంటే ..

మన రాజ్యాంగ స్వరూపం,  ప్రజాస్వామ్య వ్యవస్థ  మనకు అండగా ఉన్నది. దానికి ప్రతిరూపమే  న్యాయవ్యవస్థ కనుక  ధైర్యంగా ప్రజాసమస్యలను  తీసుకెళ్లడంద్వారా న్యాయవ్యవస్థకు  ప్రజలు మరింత చేరువ కావాలి.  ప్రస్తుతం ప్రజలు  న్యాయవ్యవస్థతో మనకు సంబంధం లేదని, అది కేవలం  అత్యున్నత స్థాయి అంశమని,  ప్రజల కష్టసుఖాలు కేవలం పాలకులే తీరుస్తారని నమ్మకంతో ఉన్నారు . అలాంటి ఆలోచన నుంచి బయటపడాలి.  న్యాయ వ్యవస్థ మరింత బలోపేతానికి మనం సంపూర్ణ మద్దతు ఇవ్వడం ద్వారా  పాలకులపై  ఒత్తిడి పెంచి, హక్కులను సాధించడానికి  అవకాశం ఉన్నదని సీజేఐ  ప్రసంగం ద్వారా  స్పష్టమైన అవగాహన మాత్రం కలుగుతున్నది.

జస్టిస్ చంద్రచూడ్​ వ్యాఖ్యలు మార్పుకు దారి!

న్యాయవ్యవస్థపై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మార్పునకు నాంది పలుకనున్నాయా ? ఎవరూ పట్టించుకోని అణగారిన వర్గాల ఆక్రందన వినగలిగి, వారి బాధలను చూడగలిగి చట్టాన్ని, న్యాయాన్ని నేర్పుగా బ్యాలెన్స్ చేయగలిగిన నాడు న్యాయమూర్తిగా బాధ్యతలను సరిగా నిర్వర్తించినట్టు లెక్క" అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు. దేశ ప్రజలకు జవాబుదారీగా ఉండడంకోసం  సుప్రీంకోర్టును సమాచార హక్కు పరిధిలోకి తెచ్చి ఈమధ్యనే ఆర్టీఐ పోర్టల్ ను ప్రారంభించారు. ఈ క్రమంలోనే న్యాయ వ్యవస్థలో సామాజిక న్యాయానికి సమూల మార్పులకు నూతన సీజేఐ శ్రీకారం చుడతారని, దేశంలోని అణగారిన వర్గాలు ఆశిస్తున్నాయి. 

వారిదే ఆధిపత్యం.. 

సుప్రీం కోర్టు ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 247 మంది న్యాయమూర్తుల నియామకం జరిగింది. ఇందులో  బ్రాహ్మణుల ప్రాతినిధ్యం సగటున 30 నుంచి 40 శాతం వరకు స్థిరంగా ఉంది.  గత మార్చి నెలలో జరిగిన రాజ్యసభ సమావేశంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజీజు తెలిపిన ప్రకారం.. దేశంలోని 25 రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో ఉన్న ప్రస్తుత న్యాయమూర్తుల సంఖ్య1108 కాగా, ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి చెందిన న్యాయమూర్తుల సంఖ్య 529గా ఉంది. ఈ లెక్కన న్యాయ వ్యవస్థలో బడుగు బలహీన వర్గాల స్థానం ఎక్కడో ఊహించవచ్చు. ఈ దేశ జనాభాలో కేవలం 3 శాతం ఉన్న బ్రాహ్మణ వర్గానికి చెందినవారు ఈనాటికీ భారత సుప్రీంకోర్టు న్యాయ మూర్తుల్లో లో 56 శాతం, హైకోర్టుల్లో 40 శాతంగా  ఉండటాన్ని బట్టి సామాజిక న్యాయాన్ని పాటించినట్లుగా ఎలా భావించగలం?    

- బైరి వెంకటేశం
రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి