పశువుల ఆస్పత్రులపై దృష్టి పెట్టని సర్కార్

పశువుల ఆస్పత్రులపై  దృష్టి  పెట్టని సర్కార్
  •    రాసిస్తే బయట కొనుక్కోవలసిందే..
  •     జిల్లాలో 39 ఆస్పత్రులకు  24 మంది డాక్టర్లే
  •     49 అటెండర్​ పోస్టులకు16 మందే..
  •     శిథిలావస్థలో  మెజారిటీ హాస్పిటల్స్

పెద్దపల్లి, వెలుగు:  రైతులు, గొల్లకుర్మలు ఆర్థికంగా ఎదగడానికి గొర్రెలు, బర్రెలు సబ్సీడీ మీద అందజేస్తున్న సర్కార్ పశువుల ఆస్పత్రులపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. చాలా ఆస్పత్రుల్లో మందుల కొరత ఉంది. హాస్పిటళ్లకు జీవాలను తీసుకెళ్తే డాక్టర్లు మందులు రాసి బయట కొనుక్కోమంటుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పెద్దపల్లి జిల్లా కేంద్రంగా మారి ఆరేళ్లయినా ఏరియా పశువైద్యశాలను ఇప్పటి వరకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్​గా అప్​గ్రేడ్​ చేయలేదు.  
డాక్టర్లు, సిబ్బంది పోస్టులు ఖాళీ..
పెద్దపల్లి, గోదావరిఖని, మంథనిలో ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు ఉండగా 10 ప్రైమరీ వెటర్నరీ, 7 సబ్ సెంటర్లు ఉన్నాయి. ప్రతీ కేంద్రానికి ఒక వైద్యాధికారి ఉండాల్సిఉండగా ఐదుగురు వెటర్నరీ డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్నల్​ ఏరియాలకు, తండాలకు సరైన పశువైద్యం అందటం లేదు. మొబైల్ పశువైద్యం ఎక్కడా కనిపించడం లేదు. పెద్దపల్లి జిల్లాలో 8,03,482 పశువులు, 10 లక్షలకు పైగా కోళ్లు ఉన్నాయి. 39 వెటర్నరీ హాస్పిటల్స్, సబ్​సెంటర్లు ఉండగా 24 మందే డాక్టర్లున్నారు. 44 అటెండెంట్ పోస్టులకుగాను 16 మందే ఉన్నారు. సిబ్బంది లేక ఆసుపత్రులు ఊడ్చడం నుంచి పశువులకు చేయాల్సిన సపర్యల దాకా మొత్తం డాక్టర్లే చేస్తున్నారు. జిల్లాకు ఏటా రూ.17 నుంచి రూ.25 లక్షల గ్రాంట్స్ రిలీజ్ అవుతున్నాయని, ఫండ్స్​సరిపోక సరైన వైద్యం అందించలేకపోతున్నామని పుశు వైద్య సిబ్బంది చెబుతున్నారు. 

బయట నుంచే మందులు..

జిల్లాలో 14 మండలాలు, 265 గ్రామ పంచాయతీలున్నాయి. ఆవులకు, బర్రెలకు, మేకలకు, గొర్రెలకు, పెంపుడు కుక్కలకు ఏదైనా సమస్య వచ్చి వెటర్నరీ ఆస్పత్రులకు తీసుకెళితే అక్కడ మందులు ఉండడం లేదు. దీంతో డాక్టర్ల సూచన మేరకు బయట కొనుక్కుని జీవాలకు వాడుతున్నారు. జిల్లా, మండల కేంద్రాలకు 5 కిలో మీటర్ల పరిధిలో ఉన్నవారు మాత్రమే వారి జంతువులకు వ్యాధి వస్తే ఆస్పత్రులకు తీసుకొస్తున్నారు. దూరంగాఉన్న గ్రామాలు, తండాల ప్రజలు నాటు మందులపైనే ఆధారపడుతున్నారు. డాక్టర్లు లేని హాస్పిటళ్లలో కాంపౌండర్లే వైద్యం చేస్తున్నారు. చాలా ఆస్పత్రుల్లో యాంటీ బయోటిక్, లివర్ టానిక్​లు, ఫీడ్​ సప్లిమెంట్​లు, నట్టల నివారణ మదులు దొరకడం లేదు. జిల్లాకేంద్రంలో ఆపరేషన్​థియేటర్ ఏర్పాటు చేయకపోవడంతో జంతువుల కండీషన్ సీరియస్ అయితే  కరీంనగర్ కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గోదావరిఖనిలో రామగుండం కార్పోరేషన్ ఆధ్వర్యంలో పశువ్యాధి నిర్ధారణశాలను ఏర్పాటు చేయడానికి సింగరేణి యాజమాన్యం 6 ఎకరాల భూమి కేటాయించింది. ప్రభుత్వం రూ. కోటి నిధులు మంజూరు చేసింది. అయినా భవన నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలోని చాలా హాస్పిటళ్లు శిథిలావస్థలో మగ్గుతున్నాయి. 

సరైన వైద్యం అందుత లేదు

జిల్లాలో జీవాలు ఎక్కువయ్యాయి. ఆసుపత్రులు సరిగ్గా లేవు. డాక్టర్లు లేకపోవడంతో కాంపౌండర్లే వైద్యం చేస్తున్నరు. పశువులకు ఏదైనా పెద్ద రోగం వస్తే బాగు చేసే పరిస్థితి లేదు. ఆసుపత్రులలో మందులుంట లేవు. డాక్టర్లు రాసిస్తే బయట కొనుక్కుంటున్నం. 
- బిరుదు రాజయ్య, 
అడవి శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా