ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోర్డర్ లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇప్పటికే అక్కడ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్వీపురం టోల్ ప్లాజా దగ్గర టోల్ ప్లాజా సిబ్బందికి, తమిళనాడుకు చెందిన కొంతమంది లా స్టూడెంట్స్ కు మధ్య గొడవ జరిగింది. ఇది ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ప్రస్తుతం వడమాలపేట టోల్ ప్లాజా వద్ద పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు. ఎలాంటి గొడవలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయనే కారణంతో రాకపోకలను నిలిపివేశారు. వాహనాల తనిఖీలను కూడా ముమ్మరం చేశారు. తమిళనాడు నుంచి ఏపీలోకి వెళ్లే అన్ని వాహనాలను చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నారు. అత్యవసరం అనుకున్న వారినే పంపిస్తున్నారు. 

అసలేం జరిగింది..?

తమిళనాడుకు చెందిన కొందరు లా స్టూడెంట్స్ తిరుపతి నుంచి చెన్నైకి వెళ్తున్నారు. ఈ క్రమంలో వడమాలపేట మండంలోని టోల్ ప్లాజా వద్దకు రాగానే ట్యాక్స్ చెల్తిస్తుండగా కొన్ని వెహికల్స్ కు ఉన్న ఫాస్ట్ ట్యాగ్ లు పని చేయలేదు. దీంతో ట్యాక్స్ చెల్లింపులో కొంత ఆలస్యమైంది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో.. త్వరగా టోల్ చెల్లించాలని సిబ్బంది కోరారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన లా స్టూడెంట్స్ టోల్ ప్లాజా సిబ్బందితో గొడవకు దిగి.. వారిపై హెల్మెట్స్ తో దాడికి దిగారని అంటున్నారు. అక్కడే ఉన్న కొన్ని వాహనాలను కూడా ధ్వంసం చేశారని టోల్ ప్లాజా సిబ్బంది ఆరోపించారు.

ఈ ఘటనతో అక్కడ చాలాసేపు వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొందరు వాహనదారులు లా స్టూడెంట్స్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. టోల్ సిబ్బందితో పాటు కొంతమంది వాహనదారులపై కూడా లా స్టూడెంట్స్ దాడి చేశారని సమాచారం. విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

చిన్న వివాదం పెద్దగా మారిందని, దీన్ని రెండు రాష్ట్రాల గొడవలా చూడొద్దని పోలీసు అధికారులు కోరారు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల వారు ఎప్పటిలానే అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని కోరారు.