టీఎస్​పీఎస్సీ ఎగ్జామ్స్​పై నో క్లారిటీ

టీఎస్​పీఎస్సీ ఎగ్జామ్స్​పై నో క్లారిటీ
  • సిట్ నివేదిక వచ్చేదాకా అయోమయమే..
  • ఆందోళనలో నిరుద్యోగులు
  • ఇప్పటికే జరిగిన నాలుగు ఎగ్జామ్స్ రద్దు 
  • మరో రెండు పరీక్షలు వాయిదా.. ఇంకోటి రీషెడ్యూల్ 
  • ఏప్రిల్​లో జరగాల్సిన పరీక్షలన్నా జరుగుతయా?
  • ఈ నెల 23న ఏఎంవీఐ , 25న ఏవో, 26, 27 తేదీల్లో గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ పోస్టులకు
  • పరీక్షలు.. వాటి నిర్వహణపైనా డౌట్లే

హైదరాబాద్, వెలుగు : టీఎస్​పీఎస్సీ ఎగ్జామ్స్​ నిర్వహణపై అయోమయం నెలకొంది. పలు పరీక్షలను రద్దు చేసి, కొన్నిటిని వాయిదా వేసిన కమిషన్.. వాటిని మళ్లీ ఎప్పుడు పెడుతుందనే దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఎగ్జామ్ డేట్లను ప్రకటిస్తామని వారం  కింద అధికారులు కొంత హడావుడి చేసినా.. ఆ తర్వాత వెనక్కి తగ్గారు. నెల రోజులుగా రాష్ట్రంలో టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టిస్తున్నది. దీనిపై సిట్​ విచారణ రోజుకో మలుపు తిరుగుతున్నది. సిట్​ నివేదిక వచ్చే వరకూ ఎగ్జామ్స్​ నిర్వహణపై క్లారిటీ  వచ్చే పరిస్థితి లేదని అధికారులు అంటున్నారు. ఇప్పటికే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్​లు తీసుకొని, ప్రిపేరైన నిరుద్యోగులు.. పేపర్ల లీకేజీతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. లేకలేక నోటిఫికేషన్లు వస్తే వాటిని కూడా లీక్​ చేయడం ఏమిటని మండిపడుతున్నారు. తమ జీవితాలతో ప్రభుత్వం, కమిషన్​ ఆడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఏఈ, డీఏవో, టౌన్​ ప్లానింగ్, ఇతర పరీక్షలెప్పుడో?

ఇప్పటికే నిర్వహించిన గ్రూప్1 ప్రిలిమ్స్, అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్(ఏఈఈ), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పరీక్షలను పేపర్ల లీకేజీ కారణంగా కమిషన్​ రద్దు చేసింది. మార్చిలో జరగాల్సిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సంబంధించిన పరీక్షలనూ వాయిదా వేసింది. ఈ నెల 4న జరగాల్సిన హార్టికల్చర్ పరీక్షను జూన్ 17కు రీ షెడ్యూల్ చేసింది. ఈ క్రమంలోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను జూన్ 11న, ఏఈఈ పరీక్షలను మే 8, 9, 21 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే ఏఈఈ ఎగ్జామ్​లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ర్టానిక్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ పరీక్షలను ఆన్​లైన్​లో.. సివిల్ ఇంజినీర్ ఎగ్జామ్​ను ఆఫ్​లైన్​లో పెడ్తామని తెలిపింది. ఇదే క్రమంలో ఏఈ, డీఏవో, టౌన్​ ప్లానింగ్, ఇతర పరీక్షలను మే, జూన్​లో నిర్వహించేందుకు డేట్లనూ ప్రకటించాలని మార్చి నెలాఖరులో కమిషన్​ అధికారులు కసరత్తు చేశారు. కానీ, ప్రకటించలేదు. 

డేట్లు ప్రకటించినా లాభం లేదని... 

టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సిట్ విచారణ చేస్తున్నది. ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసింది. కమిషన్​చైర్మన్​జనార్దన్ రెడ్డితో పాటు సెక్రటరీ అనితారాంచంద్రన్, మెంబర్ లింగారెడ్డిని కూడా విచారించింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్​చార్జి శంకరలక్ష్మితో పాటు మరికొంత మంది నిందితుల నుంచి సమాచారం సేకరించింది. ఈ క్రమంలో రోజుకో అంశం బయటపడుతున్నది. నిరుద్యోగుల ఆందోళనలను తగ్గించాలనే ఉద్దేశంతో పరీక్షా తేదీలను ప్రకటించాలని టీఎస్​పీఎస్సీపై సర్కారు ఒత్తిడి చేసినట్టు తెలుస్తున్నది. రెండు ఎగ్జామ్స్​ తేదీలను ప్రకటించినా రాష్ట్రంలో ఆందోళనలు తగ్గలేదు. సిట్ దర్యాప్తు జరుగుతుండగానే, తేదీలను ప్రకటించడంపై విమర్శలు వచ్చాయి. పేపర్ల లీకేజీపై కొందరు రాష్ట్రపతికి, గవర్నర్​కు, ఈడీకి, సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈడీ కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తున్నది.  దీంతో సర్కారులోనూ కలవరం మొదలైనట్టు తెలుస్తున్నది. పలు పరీక్షల తేదీలను టీఎస్​పీఎస్సీ రెడీ చేసినా.. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారికంగా వాటిని  ప్రకటించడం లేదు. అయితే, సిట్ నివేదిక ఈ నెల 11లోగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సిట్​ నివేదిక వచ్చిన తర్వాతే ఎగ్జామ్స్​ నిర్వహణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టీఎస్​పీఎస్సీ అధికారులు అంటున్నారు. 

ప్రిపరేషన్​ వదిలేసి..!

ఏండ్ల నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పరీక్షలు రద్దు కావడం, వాయిదా పడటం, వాటిని ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక..  ప్రిపేర్ కావాలా లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఎగ్జామ్ డేట్లు  ప్రకటించే అవకాశం ఉందా లేదా అనే దానిపై కమిషన్ నుంచి సమాచారం కోసం వేచిచూస్తున్నారు. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు కోచింగ్ వదిలేసి, ఇంటిబాట పట్టారు. కొత్త తేదీలు ప్రకటించిన తర్వాతే మళ్లీ హైదరాబాద్ రావాలని అనుకుంటున్నారు. ఏప్రిల్, మే నెలలో జరిగే ఎగ్జామ్స్​కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తమ పరీక్షలూ కొనసాగుతాయా లేదా అనే దానిపై కమిషన్​ అధికారుల నుంచి స్పష్టత కోరుతున్నా.. సమాధానం దాట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఏప్రిల్ పరీక్షలన్నా జరుగుతయా?

ఈ నెల 23న అసిస్టెంట్​ మోటర్ వెహికల్ ఇన్స్ పెక్టర్, 25న అగ్రికల్చర్ ఆఫీసర్, 26, 27 తేదీల్లో గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ పోస్టులకు పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు కూడా లీక్​అయ్యాయయని, వీటినీ వాయిదా వేస్తామని కమిషన్ అధికారులు ఆఫ్​ ది రికార్డులో చెప్పారు. కానీ, ఈ నెల 4న జరిగే హార్టికల్చర్ ఎగ్జామ్ మాత్రమే రీ షెడ్యూల్ చేశారు. మిగిలిన వాటిపై అధికారికంగా ఏ విషయాన్ని వెల్లడించలేదు. దీంతో ఆయా పరీక్షలు రాసే వేలాది మంది అభ్యర్థుల్లో పరీక్షలు జరుగుతాయా.. వాయిదా వేస్తారా అనే ఆందోళన మొదలైంది.