కరెంట్​ డిపార్ట్​మెంట్​లో ప్రతి దానికీ ఓ రేటు

కరెంట్​ డిపార్ట్​మెంట్​లో ప్రతి దానికీ ఓ రేటు
  • ట్రాన్స్​ఫార్మర్లు చెడిపోతే రైతులకే పని 
  • వేలాడుతున్న వైర్లనూ సరిచేస్తలే
  • సొంతంగా రిపేర్లు చేసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న రైతులు
  • కొత్త మీటర్​కు, వైర్ కనెక్షన్ కు అ‘ధనం’గా ముట్టజెప్పాల్సిందే 
  • స్తంభం ఎక్కాలంటే  చేతులు తడపాల్సిందే..  
  • ట్రాన్స్​ఫార్మర్లు  చెడిపోతే రైతులకే పని
  • రిపేర్లు చేసుకుంటూ  ప్రాణాలు  పోగొట్టుకుంటున్న అన్నదాతలు 

హనుమకొండ, జగిత్యాల, వెలుగు : ఎలక్ట్రిసిటీ డిపార్ట్​మెంట్​లో ప్రతి పనీ ఒక రేటు పలుకుతోంది. కొత్త మీటర్ కావాలన్నా..దానికి సర్వీస్​వైర్​ కనెక్షన్​ ఇవ్వాలన్నా..కరెంట్​కు సంబంధించిన రిపేర్లు చేయాలన్నా సిబ్బంది చేతులు తడపాల్సిన పరిస్థితి నెలకొంది. ముల్లె ముట్టనిదే ఆఫీసర్లు కూడా కుర్చీల్లోంచి కదలకపోవడం, కంప్లయింట్​ చేసినా ఫీల్డ్​మీదకు రాకపోవడంతో అధికారులు, సిబ్బంది  చేయాల్సిన పనిని రైతులు, వినియోగదారులే చేసుకోవాల్సి వస్తోంది. దీంతో కరెంట్​ షాక్​ కొట్టి ఎంతోమంది సాధారణ జనాలు ప్రాణాలు కోల్పోతుండగా..తప్పనిసరి పరిస్థితుల్లో ట్రాన్స్​ఫార్మర్ల జోలికి వెళ్తూ  రైతులు మృత్యువాతపడుతున్నారు. పైసా ఖర్చు లేకుండా పని చేసి పెట్టాల్సిందిపోయి..లంచాలకు అలవాటుపడి వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తుండటంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్​మెంట్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక్కో పనికి ఒక్కో రేటుటీఎస్ఎన్పీడీసీఎల్ ​పరిధిలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్​, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మంలోని18  జిల్లాలుండగా.. డొమెస్టిక్, నాన్​డొమెస్టిక్​, ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ ​ఇలా అన్నీ కలిపి దాదాపు 62 లక్షలకుపైగా కనెక్షన్లున్నాయి. రాష్ట్ర ఏర్పాటుకు ముందు వరకు దాదాపు 47లక్షల వరకు కనెక్షన్లు ఉండగా.. తొమ్మిదేండ్లలో సుమారు 15 లక్షల కనెక్షన్లు పెరిగాయి. ఇలా ఎప్పటికప్పుడు రెసిడెన్షియల్​, కమర్షియల్, అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనెక్షన్లకు అప్లికేషన్లు పెరిగిపోతుండగా..కొత్త కనెక్షన్స్​ తీసుకోవాలంటే సదరు సంస్థలోని ఆఫీసర్లు, సిబ్బంది మీటర్ కేటగిరీని బట్టి వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిజానికి ఒక్కో కేటగిరీ కనెక్షన్​కు వినియోగించే కిలోవాట్లను బట్టి టీఎస్ఎన్పీడీసీఎల్​కు డీడీ చెల్లించాల్సి ఉండగా.. ఫీల్డ్​ లెవెల్​లో సిబ్బంది అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది. 

డొమెస్టిక్​ మీటర్ కోసం సుమారు రూ.1,500 నుంచి రూ.2 వేలు, కమర్షియల్, ఇండస్ట్రియల్ మీటర్ల కోసం  రూ.20 వేలకు పైగానే వసూలు  చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన డీడీలు కాకుండా అదనంగా సబ్సిడీ ట్రాన్స్ ఫార్మర్ల కోసం రూ.30 వేలు, కమర్షియల్ ట్రాన్స్ ఫార్మర్లకు రూ.50 వేలకు పైగా మామూళ్ల రూపంలో గుంజుతున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. ఇదిలాఉంటే టీఎస్ఎన్పీడీసీఎల్​ పరిధిలో ఏటా 36 వేల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, వ్యవసాయ కనెక్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న రైతులను.. మామూళ్లు ఇవ్వకుంటే నెలల తరబడి తిప్పుకుంటున్నారనే విమర్శలున్నాయి. రెండేండ్లలో ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణల్లో వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు కమిషన్​ముందే ఈ ఆరోపణలు చేయడం కరెంటోళ్ల  అక్రమాలకు సాక్ష్యంగా నిలుస్తోంది. 

స్తంభం ఎక్కితే పైసలే.. 

ఎలక్ట్రిసిటీ డిపార్ట్​మెంట్​లో చాలామంది ఏఈలు, లైన్​మన్లు నామ్​ కే వాస్తేగా డ్యూటీలు చేస్తున్నారు. దీంతో గ్రామాలు, పొలాల్లో వేలాడుతున్న తీగలతో పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. వినిమోగదారుల సమస్యలు పరిష్కరించడంతో పాటు కరెంట్ తీగలకు తాకుతున్న చెట్లు, కొమ్మలను క్లియర్ ​చేయాల్సిన ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. దీంతో చాలామంది ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడుతున్నారు. కొన్నిచోట్ల సొంతంగానే పనులు చేసుకుంటున్నారు. చాలా సందర్భాల్లో చెయ్యి తడపనిదే లైన్​మన్లు స్తంభం కూడా ఎక్కడం లేదు. కొంతమంది లైన్ మన్లకు స్తంభాలు కూడా ఎక్కడం రావట్లేదు. ఇలాంటి వారు ఇతరులతో పనులు చేయించి తమ వద్ద ఎక్కువమొత్తంలో గుంజుతున్నారని  వినియోగదారులు వాపోతున్నారు.  

ట్రాన్స్​ఫార్మర్ల రిపేర్ల ఖర్చంతా రైతులదే..

చాలా చోట్ల లోడ్​ ప్రాబ్లం వల్ల ట్రాన్స్​ఫార్మర్లు కాలిపోతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో రవాణా ఛార్జీలతో పాటు రిపేర్లు కూడా డిపార్ట్​​మెంటే భరించాలి.  పోల్స్​అవసరమున్నా అధికారులే  చూసుకోవాలి. కానీ, అన్ని ఖర్చులను రైతులపైనే వేస్తున్నారు.  హనుమకొండ జిల్లా ధర్మసాగర్​ మండలం దేవునూరుశివారులో 20 రోజుల కింద ఓ ట్రాన్స్​ఫార్మర్ కాలిపోయింది. ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో రైతులే తలా కొంత వేసుకుని రిపేర్​కు తరలించారు. ట్రాన్స్​ఫార్మర్లలో ఫ్యూజులు పోయాయని, లూజ్ ​కనెక్షన్ ​ఉందని లైన్​మన్లు, ఏఈలకు చెప్పినా పట్టించుకోకపోవడంతో రైతులే రిపేర్లు చేసుకుంటున్నారు. దీంతో షాక్​ కొట్టి  చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రెండేండ్ల కింద కామారెడ్డి జిల్లా గిద్దెలో ఇలాగే ఇద్దరు రైతులు చనిపోయారు. ఈ ఏడాది జనవరిలో భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రాపురంలో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్ ఫ్యూజ్​వైరు వేస్తూ రమేశ్​ అనే రైతు ప్రాణాలు కోల్పోయాడు. మెదక్​ జిల్లా చెర్లపల్లి తండాలో నాగులు అనే రైతులు కూడా ఇలాగే మృతిచెందాడు.  

ఈ మధ్యే జగిత్యాల పట్టణానికి చెందిన శివకృష్ణ కొత్తగా ఇల్లు కట్టుకుని కరెంట్ మీటర్ కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. ఇందు కోసం రూ.3,300 ఫీజుతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్​ చేశాడు. దరఖాస్తుపై లైన్ మన్ సంతకం కావాలని చెప్పడంతో ఆయన వద్దకు వెళ్లగా.. అదనంగా రూ.వెయ్యి తీసుకున్నాడు. మీటర్​ మంజూరయ్యాక వైర్ కనెక్షన్ ఇచ్చేందుకు మరో రూ.500 తీసుకున్నాడని శివకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు.

జగిత్యాల జిల్లాలోని మెట్ల చిట్టాపూర్ లో పుర్రె లింగం అనే రైతు తన పొలంలో వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయని కరెంటోళ్లకు చెప్పాడు. వారు పట్టించుకోకపోవడంతో ఓ 
లీడర్ తో ఫోన్ చేయిస్తే టెంపరరీగా రిపేర్​ చేసి వదిలేశారు. తర్వాత మోటరు నడుస్తుందో.. లేదో  చూసి రావాల్సిందిగా ఆఫీసర్లు కోరడంతో లింగం పొలం వద్దకు బయల్దేరాడు. అప్పటికే ఎలక్ట్రిసిటీ డిపార్ట్​మెంట్ రిపేర్​ చేసిన వైరు తెగిపడి ఉంది. ఆ తీగను తొక్కడంతో షాక్​ కు గురైన లింగం అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. 
 

డబ్బులు పెట్టి పోల్స్​వేసుకోమంటున్నరు

గ్రామాల్లో చాలాచోట్ల వైర్లు వేలాడుతున్నయ్​. ఏఈలు, లైన్ మన్లకు  చెప్పినా పట్టించుకోవడం లేదు. డబ్బులు పెట్టి పోల్స్ వేసుకోవాలని సలహా ఇస్తున్నారు. వైర్లు వేలాడుతున్న ప్రాంతాల్లో పోల్స్ వేయకపోవడంతో ప్రాణాలు పోతున్నాయి.  ఈ చావులకు ఆఫీసర్లే బాధ్యత వహించాలి. ఇకనైనా రైతులను సతాయించకుండా వాళ్ల డ్యూటీ వాళ్లు చేయాలి.  
- గంగారెడ్డి, రైతు, మెట్లచిట్టాపూర్,   మెట్ పల్లి  మండలం, జగిత్యాల

చస్తాం అంటే తప్పా రాలే..

కొద్దిరోజుల  కింద మా బావి దగ్గర ట్రాన్స్​ఫార్మర్​ కెపాసిటర్లు కాలిపోయినయ్. కరెంటోళ్లకు చెప్పినా పట్టించుకోలే. పైగా కెపాసిటర్లు కూడా మమ్మల్నే  కొని తెచ్చుకోమన్నరు. చుట్టుపక్కల బావులున్నోళ్లందరం కలిసి తలాకొంత వేసుకుని కొనుక్కొచ్చినం. ఈ విషయం ఫోన్​చేసి చెప్పినా రాలే. చివరకు సబ్​స్టేషన్​కు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటామని నిరసన చేపడితే అప్పటికప్పుడు వచ్చి కెపాసిటర్లు బిగించి పోయిన్రు.   
- గువ్వాడ శ్రీనివాస్, నర్సింగరావుపల్లి, ధర్మసాగర్ మండలం, హనుమకొండ జిల్లా