విశ్వాసం : అధర్మానికి ప్రాయశ్చిత్తం లేదు

విశ్వాసం :  అధర్మానికి ప్రాయశ్చిత్తం లేదు

మనుషులు చేసే తప్పులు మూడు రకాలు. తెలియక చేసేది, తెలిసి చేసి సరిదిద్దుకునేది, మోసంతో చేసేది. రావణాసురుడు తాను సాధువునని నమ్మించి మోసం చేసి సీతను ఎత్తుకెళ్లాడు. రావణుడు చేసిన తప్పు – యుగయుగాలుగా చేయటానికి దారి చూపించింది. అటువంటి తప్పు చేసినవాడు క్షమకి అర్హుడు కాదు. రావణుడు వేసిన సాధువు వేషం నేటికీ ఎందరో వేస్తూ జనాల్ని నమ్మిస్తున్నారు. అందువల్లే  రావణాసురుడు చేసిన తప్పుని శివుడు క్షమించలేదు. 

ఇక మరో కథ భాగవతంలో కనిపిస్తుంది.

ఒకనాడు ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన యదువంశ రాకుమారులు విహారం కోసం ఉద్యానవనానికి వెళ్లి, హాయిగా క్రీడలు సాగించి, అలసి దాహంతో ఒక చోట పెద్ద నుయ్యి చూశారు. ఆ బావిలో పర్వతమంత ఊసరవెల్లి కనిపించింది. ఆ విషయం శ్రీకృష్ణుడికి చెప్పగా, దాని తోకపట్టి గడ్డిపరకలా లాగి బయట పడేశాడు శ్రీకృష్ణుడు. అప్పుడు అది అమర పురుషుడిలా మారింది. ఆయన పేరు నగ్నుడు. ఇక్ష్వాకు మహారాజు కుమారుడు. ఆయన సకల దానాలూ చేశాడు. మహాయజ్ఞాలు, నిరతాన్నదానం అన్నీ చేశాడు. ఒకనాడు ఒక వేదవేత్తకు కొన్ని గోవులు దానం చేశాడు. అందులో ఒక గోవు తిరిగి నగ్నుని మందలోకి వచ్చి చేరింది. విషయం తెలియని నగ్నుడు మరొక వేదవేత్తకు చేసిన దానంలో ఆ గోవు కలిసిపోయింది.

విషయం తెలుసుకున్న వారిరువురూ ఆ గోవు కోసం వాదులాడుకుని, నగ్నుని దగ్గరకు వచ్చారు. తన తప్పు తెలుసుకున్న నగ్నుడు, తన అధర్మాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుందామనే ఉద్దేశంతో ‘వేదవేత్తలారా! మీకు లక్ష గోవుల చొప్పున ఇస్తా’ అన్నాడు. వారు అందుకు అంగీకరించకపోగా ‘నీ అపరాధం నిన్నే వేధిస్తుంది’ అని వెళ్లిపోయారు. కొంతకాలానికి నగ్నుడు దేహయాత్ర చాలించి, పరలోకానికి చేరుకున్నాడు. అక్కడ ‘నీ అధర్మానికి ప్రాయశ్చిత్తం చేసుకుని రా’ అని భూలోకానికి పడదోశారు. అది మొదలు ఊసరవెల్లి జన్మతో కాలం గడిపాడు. తెలిసి కాని.. తెలియక కాని.. వేదవిదుల విషయంలో ధర్మం తప్పి చరించటం కంటె ప్రమాదం వేరొకటి లేదు.

అంతకన్న విషపానం చేయటం మేలు, ఎందుకంటే ‘విషానికి విరుగుడుంది కాని అధర్మానికి విరుగుడు లేదు’ అని భాగవతంలో ఈ కథ ద్వారా చెప్తోంది. ఈ రెండు కథలు మనకు రెండు మంచి అంశాలు చెప్తున్నాయి. త్రేతాయుగంలో రావణాసురుడు చేసి చూపిన ఈ మోసం  కలియుగంలోనూ మోసగాళ్లకు మార్గదర్శకం అవుతోంది.ఒక వ్యక్తి పాపం చేసినా, అధర్మం చేసినా అది విషం కంటే ప్రమాదకరమైనదని చెప్పటంలోని ఆంతర్యం అదే. ఒక వ్యక్తి విషం సేవిస్తే, ఆ విషానికి విరుగుడు మందు ఉంటుంది. ఆ మందు శరీరాన్ని విషప్రభావం నుంచి కాపాడుతుంది. అదే ఒక వ్యక్తి పట్ల అధర్మంగా ప్రవర్తిస్తే, ఆ అధర్మానికి విరుగుడు ఉండదు. దానివల్ల జరిగిన నష్టాన్ని తిరిగి సంపాదించలేం అని చెప్తోంది భాగవతం. 

రామాయణంలో దశరథుడు... పొరపాటున వేసిన బాణం కారణంగా శ్రవణకుమారుడు గతించాడు. అంధులు, వృద్ధులు అయిన ఆ తల్లిదండ్రులకు అన్యాయం జరిగింది. ఆ తప్పును దశరథుడు సరిచేసుకోలేడు. అందుకే దశరథుడు.. రాముని ఎడబాటు భరించలేక విలపించి కన్నుమూశాడు. భారతంలో.. దుర్యోధనుడిని మించిన అధర్మ వర్తనుడు మరొకడు కనిపించడు. చిన్ననాటి నుంచే పాండవులకు విషం పెట్టాడు. లక్క ఇంట్లో పెట్టి తగులపెట్టించాడు. అంతేనా పాండవులతో మాయాజూదం ఆడాడు. నిండు కొలువులో ద్రౌపది వస్త్రాపహరణం చేయించాడు. తమ కంటి ఎదురుగా ఎన్నో అధర్మాలు జరుగుతున్నా.. పెదవి కదపని ద్రోణుడు, భీష్ముడు ... ఎంతో ప్రతాపవంతులై ఉండి కూడా కురుక్షేత్ర యుద్ధంలో కన్నుమూశారు.  

కౌరవులు ఎన్ని అరాచకాలు చేస్తున్నా.. పుత్రప్రేమతో మారుమాట్లాడకుండా ఉన్న గాంధారి, ధృతరాష్ట్రుడు; నూరుగురు సంతానాన్ని కోల్పోయారు.ఇక పంచతంత్ర కథలు పరిశీలిస్తే... అధర్మ ప్రవర్తనతో ప్రాణాలు పోగొట్టుకున్న కొంగ, పిల్లి, నక్కలకు సంబంధించిన కథలు కోకొల్లలు. అందుకే మన వేదాలు ధర్మంచర అని బోధిస్తున్నాయి.

- డా. వైజయంతి పురాణపండ
ఫోన్​: 80085 51232