సిటీ నుంచి జిల్లాలకు వెళ్లే ప్యాసింజర్లకు ఇబ్బందులు

సిటీ నుంచి జిల్లాలకు వెళ్లే ప్యాసింజర్లకు ఇబ్బందులు

హైదరాబాద్, వెలుగు: సిటీ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సు ఉన్నదో, వెళ్లిపోయిందో తెలుసుకోవడం ప్రయాణికులకు సవాల్​గా మారింది. సిటీ నుంచి జిల్లాలకు వెళ్లే డిస్ట్రిక్ట్ సర్వీసుల సమాచారం ఆర్టీసీ అధికారుల వద్ద ఉండటం లేదు. ఎంజీబీఎస్, జేబీఎస్​తోపాటు శివారు ప్రాంతాల్లోని బస్టాపు​ల్లో ఎక్కడ అడిగినా సరైన సమాచారం దొరకడం లేదు. చాలా బస్టాపుల్లో కంట్రోలర్లు కూడా  కనిపించడం లేదు. బస్సులు ఎక్కడున్నాయో ఆన్​లైన్ ద్వారా తెలుసుకునేందుకు అధికారులు ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అయితే రాజధాని, సూపర్ లగ్జరీ, ఎయిర్ పోర్ట్ పుష్పక్ బస్సులకు మాత్రమే ఉన్న ఈ ట్రాకింగ్ సిస్టమ్.. డీలక్స్, ఎక్స్​ప్రెస్, పల్లె వెలుగు బస్సులకు లేదు. దీంతో వీటి సమాచారం తెలియకపోతుండటంతో బస్సుల కోసం బస్టాపుల్లో ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. వీటికి కూడా ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

హైల్ప్ లైన్​కు కాల్ చేసినా నో రెస్పాన్స్

ఆర్టీసీ హెల్ప్​లైన్ నంబర్లకి కాల్ చేసినా అన్ని బస్సుల సమాచారం దొరకడం లేదు. సిటీ నుంచి శివారు ప్రాంతాలకు, జిల్లాలకు వెళ్లే ఎక్స్​ప్రెస్, పల్లె వెలుగు బస్సుల సమాచారం కావాలంటూ ప్యాసింజర్లు ఎంజీబీఎస్​హెల్ప్​లైన్ నంబర్​కి కాల్ చేస్తే.. తమ వద్ద ఆఫ్​లైన్ బస్సుల సమాచారం ఉండదని , కేవలం ట్రాకింగ్ ఏర్పాటు చేసిన బస్సుల సమాచారం మాత్రమే ఉంటుందని సమాధానం ఇస్తున్నారు. మరి ఆ బస్సుల వివరాలు ఎలా అని అడిగితే అవి ప్లాట్ ఫాం మీద నుంచి వెళ్లిపోతాయని, వాటి వివరాలు మేము తీసుకోమని అధికారులు సమాధానం ఇస్తున్నారని ప్యాసింజర్లు చెబుతున్నారు.

కంట్రోలర్లు ఉండట్లే ..

బస్సులకు సంబంధించి సమాచారం అందించేందుకు అన్ని బస్టాప్​లలో ఆర్టీసీ కంట్రోలర్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రమే వారు ఉంటున్నారు. కంట్రోలర్లు ఉన్న దగ్గర కూడా ప్యాసింజర్లు అడిగినా వాటికి వారు సరైన సమాచారం ఇవ్వడం లేదు. కేవలం సిటీ బస్సుల్లో ప్యాసింజర్స్​ను ఎక్కించేందుకే  కంట్రోలర్లు పనిచేస్తున్నారు. జిల్లాలకు వెళ్లే బస్సుల సమాచారం అందించడం లేదు. కనీసం బస్సు ఉన్నదో, పోయిందో కూడా చెప్పడం లేదని ప్యాసింజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము వెళ్లాల్సిన బస్సు ఎప్పుడొస్తుందో తెలియక  ప్రైవేట్ వెహికల్స్​లో వెళ్తున్నామని ప్యాసింజర్లు చెబుతున్నారు.

దశలవారీగా అందుబాటులోకి తెస్తం

ఇటీవల ‘ట్రాకింగ్ సిస్టమ్’ అమల్లోకి తీసుకొచ్చామని, ప్రస్తుతం దూర ప్రాంతాలకు వెళ్లే రాజధాని, సూపర్ లగ్జరీ బస్సులకు దీన్ని ఏర్పాటు చేశామని ఆర్టీసీకి చెందిన ఓ అధికారి చెబుతున్నారు. ప్యాసింజర్ల సమయం వృథా కాకుండా ఉండేందుకే బస్సు ఎక్కడుందో ట్రాకింగ్​ సిస్టం ద్వారా ఆన్​లైన్​లో చూసుకోవచ్చని పేర్కొన్నారు. దీనిపై ప్యాసింజర్ల సలహాలు సూచనలు కోరుతున్నామని చెప్పారు. సమస్యలను అధిగమిస్తామని,దశల వారీగా అన్ని బస్సులకుఈ ట్రాకింగ్ సిస్టమ్ అందుబాటులోకి  తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.