ఐటీ కారిడార్ చుట్టుపక్కల బస్తీల్లో కనిపించని అభివృద్ధి

ఐటీ కారిడార్ చుట్టుపక్కల బస్తీల్లో కనిపించని అభివృద్ధి

ఐటీ కారిడార్ చుట్టుపక్కల బస్తీల్లో కనిపించని అభివృద్ధి
కార్పొరేట్  కంపెనీలు, గేటెడ్​ కమ్యూనిటీలు ఉన్న ఏరియాలోనే డెవలప్​మెంట్
బస్తీల్లో సరైన రోడ్లు, డ్రైనేజీ లేక స్థానికులకు ఇబ్బందులు

మాదాపూర్, వెలుగు : మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో  ఐటీ, మల్టీ నేషనల్ ​కంపెనీలు, ఇతర కార్పొరేట్   కంపెనీలు ఉన్న ప్రాంతంలోనే డెవలప్​మెంట్​జరుగుతోంది. ఈ కంపెనీలు ఉండే ఏరియాను, ఐటీ ఉద్యోగులు ఉండే కాలనీలు, గేటెడ్​కమ్యూనిటీల డెవలప్​మెంట్​పైనే ప్రభుత్వం దృష్టిపెడుతోంది. కానీ దీని చుట్టుపక్కల  కాలనీలు, బస్తీల్లో  మాత్రం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడంలేదు. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేని కాలనీలు, బస్తీలు కూడా ఐటీ కారిడార్​ ఏరియాలో ఉన్నాయి. తమ సమస్యలను అధికారులు  పట్టించుకోవడం లేదని ఆయా బస్తీలు, కాలనీల వాసులు ఆవేదన చెందుతున్నారు.

మెయిన్ ఏరియాల్లోనే..

విప్రో జంక్షన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్​రాం గూడ, బయోడైవర్సిటీ జంక్షన్, రాయదుర్గం నాలెడ్జ్​ సిటీ, మైండ్​స్పేస్​ జంక్షన్లలో ఎక్కువగా భారీ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని మల్టీపర్సస్ బిల్డింగ్​ల నిర్మాణాలు పూర్తవ్వడంతో వాటిల్లో ఐటీ కంపెనీలు కొలువై ఉన్నాయి. దీంతో ఈ ఏరియాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు రూ.కోట్ల ఖర్చుతో మౌలిక వసతులపై ఫోకస్ ​చేశారు. ఐటీ ఉద్యోగులు, కంపెనీ ప్రతినిధులు ఉండే కాలనీలు, గేటెడ్ ​కమ్యూనిటీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ సిస్టమ్ కు సంబంధించి నిర్మాణాలు చేపట్టడంతో పాటు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తున్నారు.

ఆ ప్రాంతాల్లో పరిస్థితులు వేరు..

ఇదే ఐటీ కారిడార్​లో భాగమైన మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్​ఏరియాల్లోని బస్తీలు, కాలనీలు  డెవల్​మెంట్​కు నోచుకోవడం లేదు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగు రోడ్లపైనే పారుతున్న బస్తీలు చాలానే ఉన్నాయి. కొండాపూర్​లోని గఫూర్​నగర్, ప్రేమ్​నగర్, మార్తాండ్​నగర్, సిద్ధిక్​నగర్​లలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఇండ్ల మధ్య నుంచే మురుగు పారుతోంది. గచ్చిబౌలి డివిజన్​లోని గోపన్​పల్లి తండా, ఎన్​టీఆర్​నగర్, నానక్​రాంగూడ, నల్లగండ్ల గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. మాదాపూర్ ​డివిజన్​లోని అయ్యప్ప సొసైటీ, చంద్రనాయక్​ తండా, సర్వే ఆఫ్​ ఇండియాలోని కాలనీల్లో ఇప్పటికీ సీసీ రోడ్లు లేవు. వర్షం పడితే దారులన్నీ బురదమయంగా మారుతున్నాయి. సీసీ రోడ్లుకు అధికారులు, ప్రజాప్రతినిధులు శంకు స్థాపనలు చేయడం, నెలల తరబడి పనులు చేపట్టకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

బస్తీలను ఎందుకు డెవలప్ మెంట్ చేయట్లే? 

మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్​ఏరియాల్లో పెద్ద కంపెనీలు, బిల్డింగులు ఉన్న ఏరియాల్లోనే డెవలప్​మెంట్ పనులు జరుగుతున్నాయి.  రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్​లైట్లు వెంటనే నిర్మిస్తున్నారు. కానీ​ఇదే ప్రాంతంలోని బస్తీలు, కాలనీలను అభివృద్ధి చేస్తలేరు. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. వానాకాలంలో బస్తీల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది.

- సందీప్, ప్రైవేటు ఎంప్లాయ్, మాదాపూర్