
దేశంలో స్వపరిపాలన మొదలై ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలకు, ప్రజల ఆశలకు ఇంతవరకు సార్ధకత లభించక పోవడం గమనార్హం. ఒకవిధంగా చెప్పాలంటే దేశంలో ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత ప్రధాన సమస్య పేదరికం. పేపర్లలో గణాంకాల పరంగా దేశంలో రాష్ట్రాలలో పేదరికం గణనీయంగా తగ్గుతున్నట్లు పాలకులు ప్రతిసంవత్సరం చూపుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉందనేది నిర్వివాదాంశం. తాత్కాలిక ఉచితాలు, ఉచిత పథకాలు కూడా శాశ్వత పేదరిక నిర్మూలనకు ఏమాత్రం ప్రయోజనం కల్పించవు.
ఉచిత పథకాలు కేవలం పేదలకు ఉపశమనం మాత్రమే కల్పిస్తాయి. సామాజిక పరంగా పేదల జీవన మనుగడకు అవసరమైన సౌకర్యాలను ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కల్పించినప్పుడే పేదలు ఆర్థికంగా బలపడతారు. అలా పేదలు తమ కాళ్లపై తాము నిలబడినప్పుడే దేశంలో, రాష్ట్రాలలో పేదరికం సంపూర్ణంగా నిర్మూలించబడేందుకు అవకాశం ఏర్పడుతుంది అని కచ్చితంగా చెప్పవచ్చు.
అభివృద్ధికి మూలం విద్య
మానవ మనుగడకు, అభివృద్ధికి మూలం విద్య. నాణ్యమైన విద్య ఉచితంగా ప్రజలందరికీ అందించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ, ప్రభుత్వ విద్యావ్యవస్థపై విద్యార్ధుల తల్లిదండ్రులలో విశ్వసనీయత పూర్తిగా క్షీణించింది. దీంతో ప్రభుత్వ విద్యాసంస్థలలో తమ పిల్లలను చదివించడాన్ని విద్యార్ధుల తల్లిదండ్రులు ప్రస్తుతం చాలా చిన్నతనంగా భావిస్తున్నారు . ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలలో చదివిస్తేనే తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనే భ్రమలోకి విద్యార్థుల తల్లిదండ్రులు వెళ్లిపోయారు. దీంతో అర్హతా ప్రమాణాలు, ఫీజులపై నియంత్రణ లేని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలలో తమ పిల్లలను చేర్పించి ఎగువ, దిగువ మధ్య తరగతి ప్రజలు తమ పిల్లల ఫీజులు చెల్లించడానికి ఎన్నో అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా తమ పిల్లల ఫీజులు చెల్లించడానికి జీవితాంతం తీర్చలేని అప్పులు చేస్తూ ప్రతి సంవత్సరం అనేక మంది ఎగువ, దిగువ మద్యతరగతి తల్లిదండ్రులు కడు పేదరికంలోకి దిగజారిపోతున్నారు. పాలకులు ప్రతి సంవత్సరం విద్యపై వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటు చేయడం, విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకు రావడం చేస్తున్నా ప్రజలలో ప్రభుత్వ విద్యావ్యవస్థపై ఉన్న చులకన భావం ప్రస్తుత పరిస్థితులలో తొలగేటట్లు
కనిపించడం లేదు.
విద్య, వైద్యానికి ప్రాధాన్యమివ్వాలి
ప్రభుత్వ విద్యాసంస్థలపై విద్యార్థుల తల్లిదండ్రులకు విశ్వసనీయత కలిగేటట్లు ప్రభుత్వం చిత్తశుద్ధితో తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారికి పై తరగతుల అడ్మిషన్లలో, ప్రభుత్వ ఉద్యోగాలలో కొద్దిశాతం రిజర్వేషన్లు కల్పించాలి. పాలకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం వంటి ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వ విద్యావ్యవస్థకు మళ్ళీ మహర్దశ కలిగినట్లే. పేద ప్రజలు ఎదుర్కొంటున్న రెండో ప్రధానమైన సమస్య వైద్యం. తగిన వైద్యం ప్రతి పేదవానికి ఉచితంగా సకాలంలో అందించవలసిన బాధ్యత కచ్చితంగా పాలకులదే. కానీ, అకస్మాత్తుగా కొద్దిపాటి అనారోగ్యం కలిగినా వసతులు లేని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లలేక, ప్రైవేటుగా వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక రాష్ట్రంలోని పేద ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. తీవ్రమయిన, ప్రాణాపాయం కలిగించే అనారోగ్యం కలిగితే వారి బాధ వర్ణనాతీతం. వైద్యం కూడా ప్రస్తుతం కార్పొరేట్ కబంధ హస్తాలలో చిక్కుకుపోయింది. పేదలకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా మారింది. ముఖ్యమంత్రి సహాయ నిధులు, మూడు వేలకు పైగా జబ్బులకు వర్తించే ఆరోగ్యశ్రీ పథకాలు పేద ప్రజలకు సకాలంలో సరైన వైద్యం ఉచితంగా అందించలేకపోతున్నాయి.
ఉపాధి అవకాశాలు కల్పించాలి
రాష్ట్రాన్ని పీడిస్తున్న మరో అతి పెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. కనుక ఖాళీగా ఉన్న అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేసి, ప్రైవేటు రంగంలో నిరుద్యోగులకు విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. దీంతో ఆర్థిక భరోసా కలుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధిని, యం.యస్.యం.ఈలను బలోపేతం చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే రాష్ట్రంలో నిరుద్యోగంతోపాటు పేదరికం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. నిరుద్యోగులకు లోన్లు ఇచ్చే విషయంలో బ్యాంకులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. కనుక నిరుద్యోగులకు సులభతరంగా బ్యాంకులు లోన్లు మంజూరు చేసేటట్లు ప్రభుత్వం చొరవ చూపాలి. ఈ అంశాలన్నింటినీ కచ్చితంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో నెరవేరిస్తే పేదలకు ఏ ఉచితాలు అవసరం లేదు, పేదలు ఎవరిపైనా ఆధారపడవలసిన అవసరం ఏర్పడదు. పేదలకు విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, వసతి కల్పన వంటి శాశ్వత ప్రయోజనాల కల్పనతోనే పేదరికం సమూలంగా నిర్మూలించే అవకాశం ఉంది.
- కైలసాని శివప్రసాద్