ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు

ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు

జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు... అంటారు పెద్దలు. మానవ జీవితం నిత్యం సంఘర్షణలతో కలిసి ప్రయాణిస్తుంది. సాలెపురుగు గూడు కట్టడంలో ఎంతో నేర్పరితనం ప్రదర్శిస్తుంది. తను అల్లుకునే గూటిలో చిన్న దోషం కూడా రాకూడదు. ఎక్కడ తేడా వచ్చినా ఆ గూడు వదిలేసి, మరో గూడు కట్టుకోవటం మొదలుపెడుతుంది. 

అనగనగా కాశీ నగరం. ఆ నగరాన్ని శంభుపాలుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజ్యం సుభిక్షంగా ఉండేది. అందరూ సంపదలతో తులతూగేవారు. అటువంటి రాజ్యం మీద కోసలరాజైన మహాపాలుడికి కన్ను పడింది. కాశీ రాజు మీద యుద్ధం ప్రకటించాడు. తప్పనిసరి పరిస్థితుల్లో కాశీ రాజు యుద్ధం చేయవలసి వచ్చింది. ఇష్టం లేకుండానే యుద్ధం చేశాడు. ఓడిపోయాడు. అలా పదిహేను సార్లు యుద్ధం చేసి అన్నిసార్లూ పరాజితుడయ్యాడు. ఇక చివరకు తను యుద్ధంలో గెలవలేనని నిశ్చయించుకుని, రాజ్యం విడిచి అడవులకు వెళ్లిపోయాడు. మనసంతా దుఃఖంతో నిండిపోయింది. ఇంత శక్తి ఉండి కూడా ఎందుకు గెలవలేకపోయానా? అని మనసులో మదనపడసాగాడు. అలా ఆలోచిస్తుండగా మధ్యాహ్నం అయింది. ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని, గడ్డి మీద పడుకుని, చెట్టుని తదేకంగా చూస్తున్నాడు. ఆ చెట్టు కొమ్మ మీద ఒక సాలెపురుగు గూడు కడుతూ కనిపించింది. గూడు కట్టడం మొదలుపెట్టిన కాసేపటికే ఆ గూడు విడిచిపెట్టి, మరో గూడు కట్టడం ప్రారంభించింది. అలా సుమారు పదిహేను సార్లు గూడు కడుతూనే ఉంది. ప్రతిసారి గూడు అల్లికలో తేడా రావటం వల్ల మరో ప్రయత్నం చేసేది. చిట్టచివరకు పదహారోసారి సాలెపురుగు గూడు కట్టడంలో విజయం సాధించింది. హాయిగా గూటిలో చేరి గుడ్లు పెట్టి, సుఖంగా కాలం గడిపింది. అది చూసిన కాశీరాజులో పరివర్తన వచ్చింది. జీవితంలో గెలుపు సాధించాలంటే ధైర్యాన్ని విడిచిపెట్టకూడదని అర్థం చేసుకున్నాడు. 

ఒక గూడు కాకపోతే మరో గూడు అనుకుంటూ విజయం సాధించేవరకు ధైర్యాన్ని విడిచిపెట్టలేదు సాలెపురుగు. దాని ధైర్యాన్ని చూడకముందు వరకు కాశీ రాజు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కాని సాలెపురుగు పట్టుదల చూసిన తరువాత, ధైర్యం ఉంటేనే కాని విజయం సాధించలేమని తెలుసుకున్నాడు. ఎన్నిసార్లు గూడు కట్టడంలో తేడా వచ్చినా, సాలెపురుగు ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. 

జీవితమనే యుద్ధంలో గెలవాలంటే ధైర్యంతో పోరాడాలి అని తెలుసుకుని, వెంటనే తన రాజ్యానికి వెళ్లాడు. సైన్యాన్ని సర్వసన్నద్ధం చేశాడు. కోసల రాజు మీద యుద్ధం ప్రకటించాడు. విజయం సాధించాడు.

*   *   *
ఒక చీమ తన కంటె మూడు రెట్లు బరువుని మోయగలదు. అలా మోసేటప్పుడు ఎన్నోసార్లు అది పడిపోతుంటుంది. కానీ, గమ్యం చేరేవరకు తన ప్రయత్నాన్ని విడిచిపెట్టదు. గాలికి ఎదురీదుతూ, లక్ష్యాన్ని చేరుకుంటుంది.

*   *   * 
గిజిగాడు గూడు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. లోపల రెండు గదులుగా నిర్మిస్తుంది. గూటి నిర్మాణంలో ఏ చిన్న తేడా వచ్చినా, ఆ గూటిని విడిచిపెట్టి, వేరే గూటిని అల్లుతుంది. లోపం లేకుండా వచ్చేవరకు గూడు కట్టడానికి ఎక్కడా ధైర్యం కోల్పోదు. సృష్టిలోని ప్రతి ప్రాణీ తన లక్ష్యం సాధించుకునేవరకు ధైర్యంగా పోరాడుతూనే ఉంటుంది. కానీ, మానవుల విషయంలోనే అధైర్యం కనిపిస్తుంది. ధైర్యాన్ని కోల్పోయిన మరుక్షణం మనిషి అన్ని విషయాల్లోనూ అపజయం చవిచూస్తాడు. ఎందులో గెలవాలన్నా ధైర్యమే అసలైన ఆయుధం. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు ధైర్యాన్ని కోల్పోతుంటే, శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించాడు. అర్జునుడు ధైర్యంగా యుద్ధం చేశాడు. విజయం సాధించాడు, విజయుడయ్యాడు. సింహము కుందేలు కథలో... సింహంతో కుందేలు నిర్భయంగా మాట్లాడి, అన్ని జంతువులను ప్రాణాపాయం లేకుండా  సింహం బారి నుండి తప్పించగలిగింది. ధైర్యంతో పోరాడగలిగితేనే, అపాయం ఎదురైనప్పుడు ఉపాయంతో తప్పించుకోగలుగుతాం.

ప్రతి ప్రాణి జీవితంలో కష్టాలు, ఇబ్బందులు, అపాయాలు ఎదురవ్వటం సర్వసాధారణం. వాటిని ఎదుర్కోవటానికి నిరంతరం పోరాడుతూనే ఉండాలి. పోరాటానికి ధైర్యం అవసరం. ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉండాలని మన ఇతిహాసాలు, పురాణాలు, మరెన్నో కథలు మనకు బోధిస్తున్నాయి. 

*   *   * 
మానవ జీవితం కూడా సంఘర్షణలతో నిండి ఉంటుంది. నిరంతరం పోరాడుతూనే ఉండాలి. విజయం సాధించేవరకు ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు.
-  డా. వైజయంతి పురాణపండ 
ఫోన్: 80085 51232