
దుబాయ్: ఇంగ్లండ్(2016లో), ఆస్ట్రేలియా(2017లో)తో ఇండియా ఆడిన రెండు టెస్టు మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయంటూ వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఐసీసీ సోమవారం స్పష్టం చేసింది. ఆ రెండు టెస్టుల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనేందుకు తగిన ఆధారాల్లేవని ఇంటర్నేషనల్ బాడీ తేల్చిచెప్పింది. ‘క్రికెట్స్ మ్యాచ్ ఫిక్సర్స్’ పేరిట 2018, మే 27న ఆల్‌జజిరా సంస్థ ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. ఇందులో భాగంగా 2016లో చెన్నై వేదికగాఇండియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్‌తోపాటు 2017లో రాంచీ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయంటూ ఆరోపించింది. అంతేకాక డాక్యుమెంటరీలో పాల్గొన్న ఓ ఐదుగురు వ్యక్తులు (మాజీ క్రికెటర్లు) ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ కామెంట్స్ కూడా చేశారు. అయితే, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిన ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్(ఏసీయూ).. అవినీతి జరిగిందని అనడానికి ఎలాంటి ఆధారాల్లేవని తేల్చింది. ‘ ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో ఇండియా ఆడిన రెండు టెస్టు మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయని ఆ ప్రోగ్రామ్‌లో ఆరోపించారు. ఫిక్సింగ్ ఇలా జరిగిదంటూ ఓ నాలుగు సంఘటనలను హైలెట్ చేశారు. ఇందులో నిజాన్ని తేల్చేందుకు నలుగురు సభ్యుల ఎక్స్‌పర్ట్ టీమ్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాం. అయితే, డాక్యుమెంటరీలో చెప్పిన విధంగా అనుమానించే అంశాలు ఏవీ లేవని, వారు పేర్కొన్న వాటిని ఎవరైనా ముందే ఊహించగలరని నలుగురు సభ్యులు మాకు రిపోర్టు ఇచ్చారు.అందువల్ల ఫిక్సింగ్ జరిగింది అనేందుకు ఎలాంటి ఆధారాల్లేవు. ఇక, ఆ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఐదుగురు వ్యక్తులపై మేము ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు’ అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.