ఈ యాప్ వాడినట్లయితే టిక్కెట్ కోసం క్యూ లో ఉండక్కర్లేదు

ఈ యాప్ వాడినట్లయితే టిక్కెట్ కోసం క్యూ లో ఉండక్కర్లేదు
  • ‘యూటీఎస్’ ఉంటే హాయిగా ట్రైన్ జర్నీ
  • ఆన్ రిజర్వ్ డ్ ప్రయాణికుల కోసం అందుబాటులోకి..
  • ఐదు నెలలుగా అందుబాటులో ఉన్నా అవేర్‌‌నెస్‌‌ కరువు
  • వినియోగిస్తే  బెటర్ అంటున్న రైల్వే అధికారులు

హైదరాబాద్, వెలుగు :

రైళ్లలో జర్నీ చేయాలంటే టిక్కెట్ తీసుకోవటం ఎంత కష్టమో తెలిసిందే.  ఆన్ రిజర్వ్ డ్ ప్రయాణికుల కష్టాలకు చెక్ పెట్టేందుకు రైల్వేశాఖ యూటీఎస్ యాప్ ను  అందుబాటులోకి తెచ్చింది. ముందే టిక్కెట్ ను రిజర్వేషన్ చేసుకోవచ్చు. కానీ  ప్రయాణానికి 15 నిమిషాల ముందే అవకాశం ఉంటుంది. ఎంతో ఉపయోగమైన ఈ యాప్ పై సరైన అవగాహన లేకపోవడంతో చాలామంది వినియోగించడం లేదు.

రోజూ వేలమందికి ఎదురయ్యే ప్రాబ్లమ్‌‌

కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్ ప్రధాన స్టేషన్ల నుంచి వేల మంది ప్రయాణికులు రైళ్లలో జనరల్ బోగీల్లో వెళ్తుంటారు. ఇక ఎంఎంటీఎస్ స్టేషన్ ద్వారా రోజు లక్షా 50 వేల మంది జర్నీ చేస్తుంటారు. వీరంతా రైలు వచ్చే కొద్దినిమిషాల ముందే టిక్కెట్ కోసం క్యూ లో ఉంటారు. దీంతో టిక్కెట్ తీసుకోవటానికే చాలా టైం పడుతుంది. ఈ లోపు ట్రైన్ వచ్చి వెళ్లిపోతుంటుంది. చేసేదేమీ లేక హడావుడిగా టిక్కెట్ లేకుండానే కొంత మంది  రైలు ఎక్కేస్తుంటారు. సిటీలోని  ప్రధాన స్టేషన్లలో అయితే  టిక్కెట్ తీసుకున్న తర్వాత కూడా ఫ్లాట్ ఫాం వరకు వెళ్లటానికి ఐదు నుంచి పది నిమిషాల టైం పడుతుంది. దీంతో చాలా మంది రైళ్లను మిస్‌‌  అవుతుంటారు. కొంతమంది టిక్కెట్ లేకుండానే ట్రైన్ లో ఎక్కి ఫైన్లు కూడా కడుతారు. ఎంఎంటీఎస్ ట్రైన్ లో వెళ్లే వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. వీరంతా యూటీఎస్ యాప్ ద్వారా ముందుగానే టిక్కెట్ బుక్ చేసుకుంటే ఎలాంటి  ప్రాబ్లమ్‌‌ ఉండదని రైల్వే అధికారులు చెబుతున్నారు.

యాప్ పై అవేర్‌‌నెస్‌‌ లేదు

ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడే ఈ యూటీఎస్ యాప్ అందుబాటులోకి వచ్చి 5 నెలలు అవుతుంది. ఈ యాప్ ఉందనేది చాలా మంది ప్రయాణికుల్లో అవగాహన లేదు. దీంతో పదిశాతం మంది కూడా దీన్ని వినియోగించడం లేదు. యాప్‌‌ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో రైల్వే అధికారులు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.  స్టేషన్ లో ఎంట్రీ గేట్, ఎగ్జిట్ గేట్ వద్ద వచ్చి పోయే ప్రయాణికులకు ఈ యాప్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. అయితే ప్రతి ప్రయాణికుడు  సద్వినియోగం చేసుకోవాలని  రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

గూగుల్ ప్లే స్టోర్  నుంచి.. 

ప్రతి ప్రయాణికుడు యూటీఎస్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫోన్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత డిజిటల్ పేమెంట్ ద్వారా టిక్కెట్  బుక్ చేసుకోవచ్చు. రైల్వే వాలెట్ ద్వారా ప్రయాణికులకు బోనస్ ఫెసిలిటీ కూడా కల్పించారు. జనరల్, సీజన్ టిక్కెట్ తీసుకున్న వారికి 5 శాతం బోనస్ ఉంటుంది.  ఈ యాప్ ద్వారా స్టేషన్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉండగానే టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. ఇక ఫ్లాట్ ఫామ్ టిక్కెట్ అయితే 2 కిలోమీటర్ల ముందు నుంచే టికెట్ బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ఇక టిక్కెట్ కోసం కౌంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు.