పనులు సరే.. క్వాలిటీ జాడేది..

పనులు సరే.. క్వాలిటీ జాడేది..
  • సీఎం కేసీఆర్ వస్తుండని హడావుడిగా పనులు 
  • మొన్న వేసిన బీటీ రోడ్డులో దిగబడ్డ ఉల్లిగడ్డల లారీ
  • ఇన్నాళ్లు ఆగి ఇప్పుడే మొక్కలు సైతం పెడుతుండ్రు

గద్వాల, వెలుగు:  సీఎం కేసీఆర్ వస్తున్నాడనే  తొందరలో క్వాలిటీ లేకుండా రోడ్లు  వేసేస్తున్నారు. మొన్ననే వేసిన బీటీ రోడ్డులో శనివారం వెళ్తున్న ఉల్లిగడ్డల లారీ దిగబడడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నది. కొన్ని ఏళ్ల నుంచి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డా చేయని పనులు ఇప్పుడు కేసీఆర్ వస్తున్నాడని హడావుడిగా చేస్తున్నారు. మూడేళ్ల కిందట గద్వాల పోలీస్ స్టేషన్ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. సగం పనులు చేసి చాలా రోజులు వదిలేశారు. ఇప్పుడు అక్కడ బీటీ రోడ్డు వేశారు. అయితే క్వాలిటీ లేకపోవడంతో వాహనాలు రాకపోకలకు ఇబ్బందు ఏర్పడుతున్నాయి. రోడ్డు మధ్యలో డివైడర్ వేసి మధ్యలోనే వదిలేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, యాక్సిడెంట్లు జరుగుతున్నా పనులు పూర్తి చేయలేదు. కానీ ఇప్పుడు హడావిడిగాడివైడర్ కు పైన కలర్లు వేసేసి మట్టి నింపి చెట్లు పెడుతున్నారు.

గుంతలమయంగా అయిజ రోడ్డు

గద్వాల్ నుంచి అయిజ కు వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. దీనికి రిపేర్లు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈనెల 12వ తేదీన  కేసీఆర్ వస్తున్నాడని అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు.  అయితే సభ ఏర్పాటు చేసే ప్రదేశం వరకు మాత్రమే రోడ్డు రిపేర్లు ఆగమేఘాల మీద చేస్తున్నారు. ఆ ప్రాంతం మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అని, రాత్రివేళ లేబర్ వెళ్లడానికి ఇబ్బందులు వస్తున్నాయని లైట్లు వేయాలని చెప్పినా గతంలో పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం సభ జరిగే చోటు వరకు ఐమాక్స్ లైట్లు వేసేందుకు చర్యలు తీసుకోవడం పలు విమర్శలకు తావిస్తున్నది.  

సభ చుట్టూ మాత్రమే పనులు

కేసీఆర్ పర్యటించే ప్రాంతాల్లో మాత్రమే పనులు చేస్తున్నారు. మిగతా చోట్ల అసలు పట్టించుకోవడం లేదు. మిగతా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ వాటి జోలికి పోవడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. కలెక్టరేట్ ను ఓపెన్ చేసిన తర్వాత ఫ్లైఓవర్ మీదుగా ఐజ రోడ్డుకు సీఎం చేరుకుంటారు. అక్కడ నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ఓపెన్ చేసి బహిరంగ సభకు వెళతారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను మాత్రమే రోడ్లకు రిపేర్లు, చెట్లు నాటడం, ఫ్లైఓవర్ కి ఇరువైపులా కలర్లు కొట్టి ముస్తాబు 
చేస్తున్నారు.

తొమ్మిదేళ్ల నుంచి పనులు చేస్తలేరు

 పట్టణంలో ముఖ్యమైన రోడ్ల రిపేర్లు 9 ఏళ్ల నుంచి చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఫ్లైఓవర్ వేసేముందు సర్వీస్ రోడ్డు కంప్లీట్ చేయాలి. కానీ గద్వాలలో మాత్రం కొన్ని ఏళ్ల నుంచి సర్వీస్ రోడ్డు వేయడం లేదు. దీంతో అటుగా వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కొంత భాగంలో  సీసీ రోడ్డు వేశారు. దరూరు మెట్టు నుంచి దర్గా వరకు డివైడర్ పనులు కొన్ని ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. వాటి జోలికి వెళ్లడం లేదు. కేవలం సీఎం కేసీఆర్ వచ్చి వెళ్లే ప్రాంతాల్లో మాత్రమే పనులు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.