
సిద్దిపేట/కోహెడ, వెలుగు : సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని శనిగరం రిజర్వాయర్ నుంచి యాసంగి సీజన్ కోసం అధికారులు వారం రోజుల కింద నీళ్లొదిలారు. కానీ కాల్వ రిపేర్లు చేయకపోవడంతో చివరి ఆయకట్టు భూములకు నీళ్లు అందే పరిస్థితి కనిపిస్తలేదు.
వందేండ్ల నాటి ప్రాజెక్టు...
ఈ ప్రాజెక్టును 1891లో 1.09 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. అప్పుడు కోహెడ, బెజ్జంకి మండలాల్లోని గుగ్గిళ్ల, శనిగరం, బెజ్జంకి, ముత్తన్నపేట, దాచారం, గాగిళ్లాపూర్, పోతారం, రేగులపల్లి,తంగళ్లపల్లి గ్రామాలకు సంబంధించి 4827 ఎకరాల ఆయకట్టుకు నీరందే విధంగా మూడు కాల్వలను నిర్మించారు. ప్రభుత్వం 2002లో దీని ఎత్తు పెంచి ఆయకట్టు సామర్థ్యాన్ని 5100 ఎకరాలకు పెంచి మధ్య తరహా ప్రాజక్టుగా మార్చింది.
కాల్వలకు రిపేర్లు చేస్తలే..
దాదాపు 20 కిలో మీటర్ల మేర ఉన్న మూడు కాల్వలను రిపేర్లు చేయించకపోవడంతో అధ్వానంగా మారాయి. చాలా చోట్ల మట్టి పూడుకుపోయింది. కొన్ని చోట్ల సిమెంట్ లైనింగ్ దెబ్బతిన్నది. మూడు కాల్వల్లో పిచ్చి మొక్కలు భారీగా పెరిగిపోయి నీళ్లు వెళ్తలేవు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కాల్వల రిపేర్లకు పలుమార్లు హామీలు ఇస్తున్నారు తప్ప అమలు చేయడం లేదు. దీంతో చివరి ఆయకట్టు గ్రామాలైన గుగ్గిళ్ల, తిమ్మాయిపల్లి, గాగిళ్లపూర్, దాచారం, ముత్తన్నపేట గ్రామాల రైతులకు చెందిన దాదాపు 1500 నుంచి 2 వేల ఎకరాల వరకు సాగునీటికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాల్వలకు రిపేర్లు చేయించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
పెరిగిన ఆయకట్టు
ఇప్పటి వరకు యాసంగి సీజన్ లో మొత్తం ఆయకట్టులో 50 శాతం భూములకు మాత్రమే నీటిని అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం చెరువు నిండు కుండలా మారడంతో మొత్తం ఆయకట్టుకు నీళ్లు అందిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు 5100 ఎకరాలకు నీటి పారకం ఉండగా, ప్రస్తుతం ప్రాజెక్టు పరిధిలో ఉన్న కుష్కి భూములను రైతులు సాగు చేస్తుడటంతో ఆయకట్టు పెరిగింది. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చించి 8400 ఎకరాలకు తైబందీ చేసి నీటిని వదిలారు.
కాల్వలు పూడుకుపోయాయి...
కాల్వల్లో చెట్లు పెరిగాయి. మట్టి పూడుకుపోయింది. రిపేర్లు చేస్తేనే నీళ్లు సరిగా వెళ్తాయి. కానీ అధికారులు పట్టించుకోవట్లే. ఇలా అయితే లాస్ట్‌లో ఉన్న భూములకు నీళ్లు అందడం కష్టమే.
కొలిపాక రాజు, ఎంపీటీసీ, దాచారం
రిపేర్లు చేస్తాం
ప్రాజెక్టు దిగువన ఉన్న కాల్వల లైనింగ్, రిపేర్ల కోసం రూ.28 కోట్లతో ఎస్టిమేషన్ వేశాం. ఉన్నతాధికారులకు ప్రపోజల్ పంపాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే రిపేర్లు చేయిస్తాం.
– శ్రీధర్, ఏఈ, శనిగరం ప్రాజెక్టు