
సిడ్నీ: క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూసిన ఆస్ట్రేలియా-ఇండియా సిరీస్ శుక్రవారం మొదలైంది. తొలి వన్డేలో భారత్ పోరాడినప్పటికీ కంగారూ టీమ్ విజయం మూటగట్టుకుంది. భారీ లక్ష్య ఛేదనలో హార్దిక్ పాండ్యా, శిఖర్ ధవన్ తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు. ముఖ్యంగా పాండ్యా (90 రన్స్) తన వీరోచిత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించేలా కనిపించాడు. కానీ ధవన్ ఔటవ్వడంతోపాటు బంతులకు, పరుగులకు మధ్య వ్యత్యాసం పెరగడంతో పాండ్యా హిట్టింగ్‌కు వెళ్లి ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లోె పాండ్యా బౌలింగ్ చేయలేదు . పాండ్యాతో ఇప్పుడప్పుడే బౌలింగ్ చేయించే యోచనలో టీమిండియా మేనేజ్‌మెంట్ లేదని సమాచారం. గాయం నుంచి పాండ్యా కోలుకున్నప్పటికీ.. కొంతకాలం వరకు అతడిపై బౌలింగ్ భారాన్ని మోపొద్దనేది మేనేజ్‌మెంట్ వ్యూహంగా కనిపిస్తోంది. దీనిపై పాండ్యా స్పందించాడు.
‘నన్ను నేను పరిపూర్ణ ఆల్‌రౌండర్‌గా భావించడం లేదు. ఆ దిశగా నా సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టా. అందుకోసం బౌలింగ్ విషయంలో మరింతగా సాధన చేస్తున్నా. ఐదుగురు బౌలర్లతో ఆడటం కష్టమే. వారిలో ఎవరైనా విఫలమైతే ఓవర్ల కోటాను పూర్తి చేయడానికి అదనపు బౌలర్ అవసరం పడుతుంది. వరల్డ్ కప్ వస్తోంది. మున్ముందు కీలకమైన సిరీస్‌లు ఉన్నాయి. అవసరమైనప్పుడు బౌలింగ్ చేయడానికి నేను సిద్ధంగా ఉండాలని తెలుసు. బౌలింగ్ విషయంలో నేను సుదీర్ఘ ప్రణాళికలు వేసుకున్నా. తొందరపడి బౌలింగ్ చేసి గాయాలపాలవ్వాలని అనుకోవడం లేదు. అందుకే నేను ఎప్పుడు బౌలింగ్ చేస్తాననేది చెప్పలేను. బౌలింగ్ సాధన మాత్రం చేస్తున్నా. కానీ అది మ్యాచ్ ప్రాక్టీస్ మాత్రం కాదు. పూర్తి నమ్మకంగా ఉండటంతోపాటు ఇంటర్నేషనల్ లెవల్ స్కిల్స్‌ను నేను అలవర్చుకోవాల్సి ఉంది’ అని పాండ్యా పేర్కొన్నాడు.