తగ్గేదేలే! ప్రత్యర్థుల కన్నా అసమ్మతి తోనే సిట్టింగులకు టెన్షన్

తగ్గేదేలే! ప్రత్యర్థుల కన్నా అసమ్మతి తోనే సిట్టింగులకు టెన్షన్
  • మంత్రి చెప్పినా వినని అసమ్మతి నేతలు
  • క్యాండిడేట్లను మార్చేదేలేదంటున్న మినిస్టర్​
  • సంగారెడ్డి జిల్లాలో హీటెక్కుతున్న బీఆర్ఎస్ రాజకీయం 

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్​లో రోజురోజుకూ రాజకీయం హీటెక్కుతోంది. సిట్టింగ్​ఎమ్మెల్యేలకు ప్రత్యర్థుల కన్నా పార్టీలోని అసమ్మతి నేతలతోనే టెన్షన్​గా ఉంది. పటాన్​చెరు, జహీరాబాద్ తోపాటు సంగారెడ్డి నియోజకవర్గంలో అసమ్మతి లీడర్లు మంత్రి చెప్పినా ‘తగ్గేదేలే’ అంటూ సిట్టింగులపై బల ప్రదర్శనలకు దిగుతున్నారు. 

ఇదీ.. పరిస్థితి

సంగారెడ్డి జిల్లాలో గత 15 రోజులుగా మంత్రి హరీశ్​రావు సమక్షంలో దశలవారీగా అసంతృప్తి నేతలతో చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా సమస్య ఉన్న పటాన్ చెరు, జహీరాబాద్, సంగారెడ్డి లీడర్లతో వరుసగా భేటీ అయ్యారు.  పటాన్ చెరు సెగ్మెంట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వగా, అక్కడి నుంచి టికెట్ ఆశించిన ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు నీలం మధుతో హైదరాబాద్ లో చర్చలు జరిపినట్టు తెలిసింది. ఆ చర్చల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేకపోవడంతో మధు అసంతృప్తితో వెనుతిరిగినట్టు ఆయన వర్గీయులు తెలిపారు. నియోజకవర్గంలో మధు తన బలాన్ని పెంచుకుంటూ ఉండగా వివిధ సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. మూడు రోజుల కింద జహీరాబాద్ నియోజకవర్గ అసంతృప్తి నేతలతో మంత్రి హరీశ్​ రావు పటాన్ చెరు దగ్గరలోని ఓ ఫామ్ హౌస్ లో చర్చలు జరిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావును మార్చేది లేదని మంత్రి స్పష్టం చేశారు. ఆ మీటింగ్ కు అసంతృప్త నేత ఢిల్లీ వసంత్ హాజరు కాలేదు. పైగా అదే రోజు జహీరాబాద్ లో రైతులు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులను ఏకం చేసి ‘మట్టి మనుషుల మనోగతం. .భూమిపుత్రుల ఆకలి కేకలు’ అనే పేరుతో 72 గంటలపాటు ఢిల్లీ వసంత్ దీక్షలో కూర్చున్నారు. 

ఈ క్రమంలో ఆయన ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేయడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. సంగారెడ్డి నియోజకవర్గ టికెట్​ మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు ఇవ్వడంతో పలువురు ఉద్యమకారులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ ఉద్యమ నేతకు మంత్రి నుంచి గురువారం పిలుపు అందింది. ఆ నేత తన బలాన్ని నిరూపించుకునేందుకు మంత్రి వద్దకు దాదాపు 50 కార్లలో మద్దతుదారులను తీసుకెళ్లారు. ఈ  విషయంలో మంత్రి హరీశ్​ రావు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభాకర్ కే మద్దతు ఇవ్వాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. అందుకు ఆ ఉద్యమ నాయకుడు ఎదురు చెప్పకుండా మౌనంగా ఉండిపోగా మిగతా లీడర్లు చింతా ప్రభాకర్​ ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతూ ఆయన పట్ల ఉన్న వ్యతిరేకతను వివరించారు. అయినా మంత్రి చింతాకే మద్దుతు ఇవ్వాలని మీటింగ్ ముగించినట్లు తెలిసింది.

చెప్పినా వినట్లే.. 

ఈ మూడు నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ అసంతృప్తులు మెట్టు దిగడంలేదు.  పార్టీ హై కమాండ్ టికెట్లు ఇచ్చిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఎంత నచ్చజెప్పినా వింటలేరు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసమ్మతి నేతలు బల ప్రదర్శనలు చేస్తూ టెన్షన్ పెట్టిస్తున్నారు. పరిస్థితి ఎలా ఉన్న అధినేత ప్రకటించిన అభ్యర్థులను మార్చేది లేదని మంత్రి హరీశ్​రావు ఖరాకండిగా చెబుతూనే అసంతృప్తులను పార్టీ ఆదుకుంటుందన్న భరోసా కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ కొందరు అప్పటి వరకు  సరే అంటూనే ఆ తర్వాత మళ్లీ నియోజకవర్గాల్లో అసమ్మతి రాగం వినిపిస్తూనే ఉన్నారు. ఏదేమైనా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అసంతృప్తుల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ మాత్రం రోజురోజుకూ పెద్దదవుతూనే ఉంది.