మేడ్చల్ జిల్లా బాచుపల్లి నారాయణ కాలేజీ దగ్గర ఉద్రిక్తత 

మేడ్చల్ జిల్లా బాచుపల్లి నారాయణ కాలేజీ దగ్గర ఉద్రిక్తత 

మేడ్చల్ జిల్లా బాచుపల్లి నారాయణ కాలేజీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం (జూన్ 13న) ఉదయం రాగుల వంశిక అనే విద్యార్థిని బాచుపల్లి నారాయణ బాలికల క్యాంపస్ హాస్టల్ భవనంపై నుంచి పడి మృతిచెందింది. దీంతో కాలేజీ ముందు వంశిక బంధువులు ఆందోళనకు దిగారు. కాలేజీ లోపల ఉన్న సీసీ ఫుటేజీ చూపించాలంటూ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యంతో మాట్లాడాలంటూ కాలేజీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే.. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య చాలాసేపు వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. 

కామరెడ్డికి చెందిన రాగుల వంశికను వారం క్రితం నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో జాయిన్ చేశారు తల్లిదండ్రులు. దీంతో మంగళవారం (జూన్ 13న) ఉదయం విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో బాచుపల్లి నారాయణ బాలికల క్యాంపస్ హాస్టల్ భవనంపై నుంచి కింద పడి చనిపోయింది. ఇదే విషయాన్ని కళాశాల యాజమాన్యం బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతిపై ఆరా తీస్తున్నారు. వంశిక బిల్డింగ్ పై నుండి కిందకు దూకిందా..? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వంశిక మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వంశిక మృతదేహం గాంధీ ఆస్పత్రిలో ఉంది. వంశిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిన్ననే తమతో మాట్లాడందని, ఇంతలోనే వంశిక ఆత్మహత్య ఎలా చేసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. వంశిక బిల్డింగ్ పైకి వెళ్తుంటే వార్డెన్ ఎందుకు లేరని ప్రశ్నిస్తున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ యజమాన్యాలు విద్యార్థులపై ఎందుకు శ్రద్ధ తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.