వ్యాపార రంగంలో మహిళలకు సవాళ్లెన్నో...

వ్యాపార రంగంలో మహిళలకు సవాళ్లెన్నో...
  •     ఇన్వెస్టర్ల నమ్మకం పొందడం అతిపెద్ద సమస్య
  •     నిధులు రాక ఇబ్బందులు

న్యూఢిల్లీ: మనదేశంలో మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం కోసం,  సాధికారత కోసం ప్రయత్నిస్తూ  ఎంట్రప్రెనార్​షిప్​(వ్యవస్థాపకత) రంగంలోకి పెద్ద ఎత్తున వస్తున్నారు.   వివిధ పరిశ్రమలలో తమదైన ముద్ర వేస్తున్న మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య పెరిగినప్పటికీ, వాళ్లకు సవాళ్లేమీ తక్కువగా లేవు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసే  వినూత్న ఆలోచనలు ఉన్నప్పటికీ, చాలా మంది మహిళలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని,  నిధుల మద్దతును పొందడంలో అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. 

ఈ అసమానతను, అంతరాన్ని తగ్గించడానికి  పోటీ వ్యాపార రంగంలో అభివృద్ధి చెందడానికి మహిళా వ్యాపారవేత్తలను శక్తివంతం చేయడానికి తగిన మద్దతు, కార్యక్రమాలు అవసరం. 2021 సంవత్సరంలో పనిప్రదేశాల్లో మహిళల సంఖ్య 21 శాతం  నుంచి 2023లో 26 శాతానికి చేరుకుందని, ఇది మంచి విషయమని  గ్రేట్ ప్లేస్ టు వర్క్​ సీఈఓ యశస్విని రామస్వామి అన్నారు.   పని ప్రదేశాల్లో తగిన వసతులను పెంపొందించడంలో భారతదేశం గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, సామాజిక-, ఆర్థిక అవరోధాలు ఇప్పటికీ తొలగిపోలేదని అభిప్రాయపడ్డారు. 

వాళ్లు మరింత శక్తివంతంగా మారే  వాతావరణాన్ని సృష్టించాలని రామస్వామి అన్నారు. మహిళలకు అనుకూలమైన పని వాతావరణాన్ని నిర్మించిన సంస్థలు చాలా లాభపడతాయని, ఉత్పాదకత ఎక్కువగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. యెస్‌‌‌‌ మేడమ్ సహ–వ్యవస్థాపకురాలు ఆకాంక్ష విష్ణోయ్ మాట్లాడుతూ, మహిళలు అభివృద్ధి చెందడానికి సహాయక వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ఈ అడ్డంకులను పరిష్కరించవచ్చని అన్నారు. 

సమానత్వం లేక సమస్యలు...

నిధుల సేకరణ విషయంలో మహిళా పారిశ్రామికవేత్తలు చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నిధుల ప్రక్రియలో లింగ పక్షపాతం బాగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. దాదాపు 62 శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలు ఏదో ఒక రకమైన పక్షపాతాన్ని అనుభవిస్తున్నారు.  పెట్టుబడిదారుల విశ్వాసాన్ని,  నిధుల మద్దతును పొందడానికి మహిళలు తంటాలు పడుతున్నారు. 2022–2023 మధ్య మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌‌‌‌లు సేకరించిన నిధులలో  2.4 బిలియన్ డాలర్ల నుంచి  480 మిలియన్​ డాలర్లకు తగ్గిపోయాయని పిక్​మై వర్క్​ సహ–వ్యవస్థాపకురాలు కాజల్​ మాలిక్​ చెప్పారు. 

ఎంట్రప్రెన్యూర్‌‌‌‌షిప్‌‌‌‌లో లింగవైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి కార్యక్రమాలు ఉన్నప్పటికీ, మహిళలకు తగినంత తోడ్పాటు దక్కడం లేదు.  లింగ భేదం లేకుండా పారిశ్రామికవేత్తలందరికీ సమాన అవకాశాలను నిర్ధారించడానికి మరింత సమిష్టి కృషి అవసరమని ఆమె అన్నారు. చాలా పరిశ్రమల్లో పురుషాధిక్యత ఉండటం వాస్తవమని మాలిక్ అన్నారు. కోటో సహ–వ్యవస్థాపకురాలు అపర్ణా ఆచారేకర్ మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలు పక్షపాతం, ప్రాతినిధ్యం లేకపోవడం,  వెంచర్ ఫండింగ్‌‌‌‌ దొరక్కపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారని అన్నారు.