రెండేండ్ల కుట్టు కూలి రాలే!.. బడ్జెట్​ లేదంటున్రు.. మళ్లీ కొత్తగా బట్టలు కుట్టమంటున్రు..

రెండేండ్ల కుట్టు కూలి రాలే!.. బడ్జెట్​ లేదంటున్రు.. మళ్లీ కొత్తగా బట్టలు కుట్టమంటున్రు..
  •     ఐటీడీఏ పరిధిలోని 50 విద్యాసంస్థల్లో16 వేల మంది స్టూడెంట్స్​
  •     జతకు రూ.100 చెల్లించాలని టైలర్స్​ తో ఐటీడీఏ ఒప్పందం 
  •     రెండేండ్లుగా రూ.64 లక్షలు పెండింగ్
  •     వచ్చే విద్యా సంవత్సరానికి డ్రెస్సులు కుట్టాలని మళ్లీ ఆర్డర్స్​
  •     ఇబ్బందుల్లో గిరిజన మహిళా టైలర్లు 

భద్రాచలం, వెలుగు : భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ, గిరిజన సంక్షేమ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు గిరిజన సంక్షేమశాఖ యూనిఫాంలు కుట్టించి ఇస్తోంది. ఏడాదికి రెండు జతల యూనిఫాంలు వారికి అందజేస్తోంది. కానీ  ఆ బట్టలు కుట్టిన గిరిజన సొసైటీల్లోని మహిళా సభ్యులకు కూలి ఇవ్వట్లేదు. రెండేండ్లుగా బడ్జెట్​ లేదంటూ ఐటీడీఏ నేటికీ రూ.64 లక్షలు పెండింగ్ లో పెట్టింది. దీంతో గిరిజన మహిళా టైలర్లు ఇబ్బంది పడుతున్నారు. బిల్లుల కోసం ఐటీడీఏ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నామని వాపోతున్నారు. 

ఏడాదికి 32 వేల జతలు.. 

భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని 50 విద్యాసంస్థల్లో 16వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. బాలుడికి చొక్కా, ప్యాంటు, బాలికకు పంజాబీ డ్రెస్​ కుడితే జతకు రూ.100 ఐటీడీఏ కూలి కింద చెల్లిస్తోంది. ఒక్కో విద్యార్థికి రెండు జతలు ఇస్తారు. ఏడాదికి 32వేల జతల కుట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం గిరిజన మహిళలతో సొసైటీలు ఏర్పాటు చేశారు. వీరికి ఉపాధి కల్పించడం ప్రధాన ఉద్దేశ్యం. 2022-–23, 2023–-24 విద్యాసంవత్సరాలలో స్టూడెంట్లకు కుట్టిన బట్టల కూలి డబ్బులు రూ.64లక్షలు ఇవ్సాల్సి ఉంది. కానీ ఇప్పటికీ పైసా కూడా ఇవ్వలేదు. గిరిజన సంక్షేమశాఖ కమిషనర్​ఆఫీసుకు ఐటీడీఏ నుంచి బిల్లులు వెళ్తాయి. అక్కడి నుంచి బడ్జెట్ వస్తేనే ఐటీడీఏ ఈ బిల్లులు చెల్లిస్తుంది.

 గత బీఆర్ఎస్​ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖకు బడ్జెట్​ కేటాయించలేదు. దీంతో ఎక్కడికక్కడ బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గిరిజన మహిళా టైలర్స్ సొసైటీల బిల్లులు కూడా నిలిచిపోయాయి. భద్రాచలం సొసైటీకి రూ.5లక్షలు, మూకమామిడి(ములకలపల్లి) సొసైటీకి రూ.6లక్షలు, పాల్వంచకు రూ.15లక్షలు, ఇల్లెందుకు రూ.14లక్షలు, మణుగూరుకు రూ.5లక్షలు, దుమ్ముగూడెంకు రూ.6లక్షలు,దమ్మపేటకు రూ.6లక్షలు...ఇలా జిల్లాలోని సొసైటీలకు ఐటీడీఏ నుంచి బకాయిలు రావాల్సి ఉంది. 

బిల్లులు రాక అవస్థలు పడుతున్నం...

ఏండ్ల తరబడి బిల్లులు రాక నానా అవస్థలు పడుతున్నం. బట్టలు కుట్టిన సొసైటీలో ఉన్న మహిళా సభ్యులకు కుట్టు కూలి త్వరగా ఇయ్యాలె.  ఇల్లు గడవడం కూడా కష్టంగాఉంది. వారం రోజులుగా ఐటీడీఏ చుట్టూ బిల్లుల కోసం తిరుగుతున్నం. పంపిన బిల్లులు బడ్జెట్​ లేదని వెనక్కి వచ్చాయని చెబుతున్నరు. మళ్లీ కొత్తగా బట్టలు కుట్టాలని చెబుతున్నరు. కనీసం అడ్వాన్సుగా కొంత డబ్బులైనా ఇస్తేనే కుట్టుతాం.  ‌‌‌‌‌‌‌‌ - సొందె సీతమ్మ, కోయనర్సాపురం సొసైటీ ప్రెసిడెంట్