అంచనాలే ఆలస్యం.. సాయం అందేదెప్పుడో?

అంచనాలే ఆలస్యం..  సాయం అందేదెప్పుడో?
  • ఉమ్మడి జిల్లాలో వరద బాధితుల ఎదురు చూపులు 
  • కూలిన ఇండ్లు, మునిగిన పంటలతో అష్టకష్టాలు
  • దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులతో ఇబ్బందులు
  • రూ.కోట్లలో నష్టం.. నిర్లక్ష్యం వీడని అధికారులు 

సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు : ఇటీవల ఉమ్మడి మెదక్​ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఇండ్లు కూలి, పంటలు మునిగి,  రోడ్లు, కల్వర్టులు దెబ్బతిని జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలోనే ఆలస్యం జరిగింది.  ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేయడంలోనూ అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇక సాయం అందేదెప్పుడోనని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి.. 

  •  సంగారెడ్డి జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న పంటలు, ఇండ్లు, రోడ్ల నష్టం విలువ రూ.38.50 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. రోడ్లు దెబ్బతిని రూ.28 కోట్లు నష్టం వాటిల్లగా,  పంటల నష్టం రూ.7.85 కోట్లు, 486 ఇండ్లు దెబ్బతినడంతో రూ.2.43 కోట్లు నష్టం జరిగినట్టు తెలుస్తోంది. , సంగారెడ్డి, పటాన్ చెరు, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో దెబ్బతిన్న రోడ్లకు శాశ్వత రిపేర్లకు గాను రూ.22.6 కోట్లు అవసరం ఉన్నట్టు ప్రభుత్వానికి నివేదించారు. జిన్నారం సమీపంలోని అన్నారం రోడ్డు, ఐడీఏ బొల్లారం, గడ్డపోతారం నుంచి బొల్లారం, సంగారెడ్డి నియోజకవర్గంలో పెద్దాపూర్ నుంచి అనంతసాగర్, కంది మండలం శంకర్​పల్లి రోడ్డు నుంచి కలివేముల చర్లగూడెం రోడ్డు దెబ్బతిన్నాయి.  అందోల్ నియోజకవర్గంలోని కొత్తపల్లి నుంచి చింతకుంట, కంసాన్ పల్లి నుంచి కాదిరాబాద్ మీదుగా జహీరాబాద్ కవేలి కోహిర్ తూర్మామిడి కోహిర్ నుంచి మర్పల్లి మీదుగా నాగిరెడ్డిపల్లి, మిర్జాపూర్ నుంచి కుప్పానగర్ వెళ్లే రోడ్లు పాడయ్యాయి.  జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగి రూ. 7.85 కోట్లు నష్టం జరిగినట్లు అంచనా వేశారు. 1,245 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతినగా ఎక్కువగా 549 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది.  కంది 203 ఎకరాలు, చెరుకు 70 ఎకరాలు మినుములు 96 ఎకరాలు, మొక్కజొన్న 18 ఎకరాలు, సోయా పంట 309 ఎకరాల్లో దెబ్బతిన్నట్టు అంచనా వేశారు.
  •  సిద్దిపేట జిల్లాలో 270 ఇండ్లు కూలిపోయాయి.  446 విద్యుత్ స్తంభాలు, 9 ట్రాన్ష్ ఫార్మర్లు కూలిపోవడంతో విద్యుత్ శాఖకు 25 లక్షల నష్టం వాటిల్లింది. 12 కిలోమీటర్ల రోడ్డు దెబ్బ తినడంతో నాలుగు కోట్లు, 26 కల్వర్టులు దెబ్బతినగా రూ.29 కోట్లతో రిపేర్లు చేపట్టాలని అధికారులు అంచనాలు రూపొందించారు. బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ నుంచి ఎల్లంపల్లి రోడ్డు , చేర్యాల మండలం వీరన్నపేట వద్ద రోడ్డు , చేర్యాల మండలం తాడూరు వద్ద కల్వర్టు, గజ్వేల్ మండలం అహ్మదీపూర్ నుంచి సర్వాయిపేట రోడ్డు, చేర్యాల మండలం కమలాయపల్లి నుంచి మైసంపల్లి రోడ్డు, చిన్నకోడూరు మండలం సికింద్లాపూర్ నుంచి దర్గపల్లి మధ్య మట్టి రోడ్డులు తెగిపోయాయి. కోహెడ మండలం నాగ సముద్రాల వద్ద కట్టు కాల్వ, చేర్యాల మండలం కమలాయపల్లి వద్ద దేవాదుల కాల్వలకు గండి పడింది. జిల్లాలో 500 ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది.
  • మెదక్ జిల్లా వ్యాప్తంగా 650 ఇండ్లు కూలిపోయాయి. లో లెవల్ కాజ్ వేల దగ్గర వాగులు ఉప్పొంగి రాకపోకలు స్తంభించాయి. ఈ క్రమంలో మెదక్ నియోజకవర్గంలో నాలుగు, నర్సాపూర్ నియోజక వర్గంలో నాలుగు, గజ్వేల్ నియోజక వర్గ పరిధిలో ఒక చోట లో లెవల్ కాజ్ వేలను ఎత్తు పెంచి, రోడ్డు విస్తరించేందుకు రూ.4.50 కోట్ల తో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు పీఆర్ అధికారులు తెలిపారు.

ఇబ్బందుల్లో బాధితులు 

వర్షాల వల్ల నష్టం జరిగి దాదాపు నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఇప్పటికీ నయాపైసా సాయం అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు. సర్వం కోల్పోయి నిరాశ్రయులమయ్యామని, ప్రభుత్వం  త్వరగా సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు రోడ్లు డ్యామేజ్ అయ్యి రాకపోకలు సాగించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖల అధికారుల పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.