రామప్ప ఉత్సవాల్లో ప్రోటోకాల్ రగడ

రామప్ప ఉత్సవాల్లో ప్రోటోకాల్ రగడ

ములుగు జిల్లాలో జరుగుతున్న రామప్ప ఉత్సవాల్లో ప్రోటోకాల్ రగడ చోటుచేసుకుంది. రామప్ప ఆలయంలో జరుగుతున్న ప్రపంచ వారసత్వ వేడుకల్లో ప్రోటోకాల్ రగడ బయటపడింది. ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా వేదికపై తనను ఆహ్వానించకపోవడంపై పాలంపేట సర్పంచ్(లోకల్), స్థానిక ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంతృప్తి వ్యక్తం చేసిన నాయకులను ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, ఇతర అధికారులు బుజ్జగించే ప్రయత్నం చేశారు. ‘ఉత్సవ ఏర్పాట్లలో మా సేవలు తప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం చేయరా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

మరోవైపు.. స్టేజి మీదకు తనను ఆహ్వానించలేదని కార్యక్రమం మధ్యలోనే భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య వెళ్లిపోయారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రైవేట్ బౌన్సర్ల తీరుతో జనం చాలా ఇబ్బందులు పడ్డారు. ములుగు జిల్లా రామప్పలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస గౌడ్ తో పాటు కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే సీతక్క తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.