ఆయుధంతో సంచరించిన సర్పంచ్ భర్త

ఆయుధంతో సంచరించిన సర్పంచ్ భర్త

హైదరాబాద్ : ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 లోని వేంరెడ్డి ఎన్ క్లేవ్ లో జీవన్ రెడ్డి నివాసం వద్ద ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో వెంటనే ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు ప్రసాద్ గౌడ్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. నిందితుడు ప్రసాద్ గౌడ్ నుంచి కత్తి, రెండు ఎయిర్ గన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ గన్స్ లో బుల్లెట్స్ లేకుండా ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. 

నిందితుడి కారును తనిఖీ చేస్తున్న పోలీసులు

కిల్లెడ సర్పంచ్ భర్త  ప్రసాద్ గౌడ్ గా గుర్తింపు

నిందితుడిని.. ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ గా పోలీసులు గుర్తించారు. తన భార్య ను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేసినందు వల్లే ప్రసాద్ గౌడ్.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కక్ష పెంచుకున్నాడని అనుమానిస్తున్నారు.  ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ప్రసాద్ గౌడ్ ను అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. మరోవైపు గతంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి, కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ కి మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. 

అన్ని కోణాల్లో దర్యాప్తు

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్న బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ .. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. జీవన్ రెడ్డి నుంచి కూడా మరికొంత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. భారీ బందోబస్తు, ఎప్పుడు ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలతో హడావుడిగా ఉండే ఎమ్మెల్యే ఇంటి వద్దకు ప్రసాద్ గౌడ్ ఒక్కడే వచ్చాడా ? లేక తనతో పాటు ఇంకా ఎవరైనా వచ్చారా..? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. గన్స్ కొనుగోలు విషయంలో ప్రసాద్ గౌడ్ తన ఫోన్ లో జరిపిన చాటింగ్ ను పోలీసులు గుర్తించారు.