తెలంగాణ చరిత్ర సంస్కృతి కట్టడాలపై పోటీ పరీక్షల్లో ప్రశ్నలు

తెలంగాణ చరిత్ర సంస్కృతి కట్టడాలపై పోటీ పరీక్షల్లో ప్రశ్నలు

తెలంగాణ చరిత్ర సంస్కృతిలో కట్టడాలు ముఖ్యమైన భాగం. పోటీ పరీక్షలో తప్పకుండా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. వీటిపైన పట్టుసాధిస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. హైదరాబాద్​ నగర పరిధిలోని చారిత్రక కట్టడాలు, వాస్తు శైలి, నిర్మాతల గురించి తెలుసుకుందాం.

సాలార్​జంగ్​ మ్యూజియం: హైదరాబాద్​లోని చందూలాల్​ బారాదరి వద్ద ఉన్న సాలార్​జంగ్​ మ్యూజియంలో మూడో సాలార్​జంగ్​(మీర్​ యూసుఫ్​ అలీఖాన్​) వ్యక్తిగతంగా, ఆసక్తితో సేకరించిన అనేక వింత, విలువైన వస్తువులు ఉన్నాయి. ఈ మ్యూజియం గడియారాల సేకరణలో ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఇందులో ముసుగు ధరించిన రెబెక్కా శిల్పం ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ అత్యంత ఖరీదైన ప్రాచీన కళాఖండాలు, చిత్రాలు, పింగాణి పాత్రలు, ఆభరణాలు, తివాచీలు, ఆయుధాలు, బొమ్మలు తదితర ఎన్నో ప్రదర్శనలు ఉన్నాయి. 

కులీకుతుబ్​షాహీ టూంబ్స్​: ఇవి కుతుబ్​షాహీ రాజుల సమాధులు. గోల్కొండ టూంబ్స్​(సెవెన్​ టూంబ్స్​) విలక్షణ ఇస్లాం వాస్తును ప్రతిబింబిస్తాయి. ఈ సమాధులు ఇండో పర్షియన్​  వాస్తు రీతిలో నిర్మించి, వాటికి పాలరాయి గచ్చుతో మెరుగులు దిద్దారు. ఇక్కడ ఒకే వంశానికి(కుతుబ్​షాహీ) చెందిన రాజుల సమాధులు ఒకేచోట ఉంటాయి. గోల్కొండ టూంబ్స్​ చరిత్రను తెలిపే మ్యూజియం ఇక్కడ ఉంది. 

పైగా సమాధులు: నిజాం పరిపాలనా కాలంలో అత్యున్నత స్థాయి కులీనులైన పైగా లేదా మక్​బరాషమ్స్​ ఉల్​ ఉమ్రాహీ కుటుంబానికి చెందిన సమాధులు. పైగా సమాధుల నిర్మాణం 1786 నుంచి సాగింది. మొగల్​ రాజస్థానీ వాస్తుకళా రీతుల సమ్మేళనం ఈ సమాధుల నిర్మాణంలో కనిపిస్తుంది. వీటి నిర్మాణంలో సున్నం, నాపరాయి, ఇటుక, కలపలను వినియోగించారు. సమాధుల పిట్ట గోడలపై కొమ్ముల వంటి చెక్కడాలు ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. 

చౌహమల్లా ప్యాలెస్​: చౌహమల్లా అంటే నాలుగు భవంతులు. నిజాం నవాబు అఫ్జలుద్దౌలా కాలంలో ఈ భవన నిర్మాణం పూర్తయింది. నిజాం ప్రభుత్వ స్థాయిలో విందులను ఈ ప్యాలెస్​లోనే ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం కూడా రాజ వైభవాన్ని తలపింపజేసే రీతిలో ఈ ప్యాలెస్​లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

ఫలక్​నుమా ప్యాలెస్​: పైగా రాజ వంశీకుడైన నవాబ్​ కారుల్​ ఉమ్రా బహదూర్​ ఈ రాజ భవనాన్ని నిర్మించి, ఆరో నిజాంకు విక్రయించాడు. ఫలక్​నుమా ప్యాలెస్​ను ఒక గుట్టపై ఇటలీ పాలరాయితో నిర్మించారు. దీన్ని ప్రస్తుతం హెరిటేజ్​ హోటల్​గా మార్చారు. 

పురానా హవేలీ ప్యాలెస్​: 1777లో రెండో నిజాం, నిజాం అలీఖాన్​ తన కొడుకు సికిందర్​ జా కోసం నిర్మించాడు. సికిందర్​ జా కొంతకాలం ఇక్కడ నివాసం ఉండి, తర్వాత  కిల్వత్​ మహల్​కి మారాడు. అందువల్ల దీనికి పురానా హవేలీ అనే పేరు వచ్చింది. ఈ భవనం కేంద్ర భాగాన్ని U ఆకారంలో ఒకే అంతస్తులో యూరోపియన్​ వాస్తుశైలిలో నిర్మించారు. ఈ భవనంలో పశ్చిమదిక్కుగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన కొయ్య వార్డ్​రోబ్​ ఉంది. ప్యాలెస్​ ఎడమపక్క భవంతిలోనే నిజాం రజతోత్సవ మ్యూజియం ఉంది. 

మాసాబ్​ ట్యాంక్​: ఈ ట్యాంక్​ అసలు పేరు మాసాహెబ్​ ట్యాంక్​. దీన్ని హయత్​ భక్షీ బేగం నిర్మించింది. హయత్​భక్షీ బేగం దాన ధర్మాలు, ప్రజాసేవకు పెట్టింది పేరు. అందువల్ల ఈమెను అందరూ మసాహెబ్​ అని పిలుచుకునేవారు. ఆమె పేరు మీదనే నిర్మించడం వల్లనే మసాబ్​ ట్యాంక్​ అయింది. 

హైకోర్టు భవనం : దీనిని 1919లో నిజాం నవాబు మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ నిర్మించాడు. ఈ భవనం తెలుపు, ఎరుపు రాతితో సారసెనిక్​ వాస్తు కళారీతిలో నిర్మించబడింది. 

బ్రిటిష్​ రెసిడెన్సీ : బ్రిటిష్​ రెసిడెన్సీ భవనాన్ని జేమ్స్​ ప్యాట్రిక్​ ఖైరున్నీసా కోసం నిర్మించాడు. దీని ప్రధాన ఆర్కిటెక్​ శామ్యూల్​. దీన్ని యూరోపియన్​ వాస్తుశైలిలో నిర్మించారు. ఈ భవనం ముఖ ద్వారాన్ని జార్జియన్​ వాస్తుశైలిలో నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ మహిళల కళాశాలను నిర్వహిస్తున్నారు. 
మక్కా మసీదు: ఇది హైదరాబాద్​లోని అతి ప్రాచీనమైన మసీదు. దేశంలోని పెద్ద మసీదుల్లో ఒకటి. ఐదో కులీకుతుబ్​షా అబ్దుల్లా కుతుబ్ షా మక్కా నుంచి మట్టి, కొన్ని రాళ్లను తెప్పించి వాటితో చేసిన ఇటుకలను ఈ మసీదు నిర్మాణంలో ఉపయోగించడం వల్ల దీనికి మక్కా మసీదు అనే పేరు వచ్చింది. దీని నిర్మాణం ఐదో కులీకుతుబ్​ షా కాలంలో ప్రారంభింబడి, ఔరంగజేబ్​ కాలంలో పూర్తిచేశారు.

ఖైరతాబాద్​ మసీద్​: దీన్ని ఖైరున్నీసాబేగం తన గురువు అఖుండ్​ ముల్లా అబ్దుల్​ మాలిక్​ కోసం నిర్మించింది. దీన్ని హుస్సేన్​ షావలి నిర్మించాడు. 

 బిర్లామందిర్​ : హైదరాబాద్​లోని కాలాపహాడ్​పై తెల్లని పాలరాయితో వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని  బిర్లా సంస్థ నిర్మించడంతో దీన్ని బిర్లామందిర్​ అంటారు. సిటీ కాలేజీ, హైకోర్టు, పత్తర్​గట్టి: 1912లో నగరాభివృద్ధి బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డు మూసీ నదికి గట్టను నిర్మించడంతోపాటు రోడ్లు వేసి, నదికి అభిముఖంగా హైకోర్టు, ఉస్మానియా దవాఖాన భవనాలను నిర్మించింది. పత్తర్​గట్టి మార్కెట్​ వ్యవస్థను ఏర్పరిచింది. 1921లో మూసీ నదికి దక్షిణంగా సిటీ కాలేజ్​ను నిర్మించింది. ఈ కట్టడం హిందూ ఇస్లామిక్​ యూరోపియన్​ వాస్తు కళారీతులకు  ప్రతీక. 

గోల్కొండ కోట: చాళుక్యుల కాలంలో ఇక్కడ ఒక చిన్న కోట ఉండేది. కాకతీయుల కాలంలో మరో కోట నిర్మించబడింది. ఆ తర్వాత అది శిథిలమైంది. ఆ కొండపై గొల్లవారు మేకలు, పశువులు, మేపుకొనేవారు. అందువల్లనే ఆ కొండను గొల్లకొండ అని పిలిచేవారు. సుల్తాన్​ కులీకుతుబ్​షా ఇక్కడ కోట నిర్మించి దాన్ని గొల్కొండగా ఉచ్ఛరించాడు. ఈ కోటలో 87 బురుజులు, 69 అడుగులకు పై బడిన ద్వారాలు ఉండేవి. ప్రధానంగా నీటి సరఫరా వ్యవస్థకు, శబ్దశాస్త్ర ప్రావీణ్యానికి గోల్కొండ కోటకు సాటిలేదని చెప్పవచ్చు. ఇక్కడి రెండు మీనార్ల మసీదు ప్రసిద్ధమైంది. దీని ఆధారంగానే చార్మినార్​ నిర్మించారు. గోల్కొండ కోట, కుతుబ్​షాహీ సమాధుల మధ్య ఉన్న సొరంగాన్ని ఇటీవల కనుగొన్నారు. 

చార్మినార్: ఒక సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేసే కట్టడంగా ప్రసిద్ధి చెందింది. ఇది అందమైన నాలుగు మినారేట్లతో నిర్మించిన చారిత్రక కట్టడం. దీని ఎత్తు 180 అడుగులు. గోల్కొండను పాలించిన కుతుబ్​షాహీల కాలం నాటి వాస్తుశైలి, కళా నైపుణ్యాన్ని చార్మినార్​ ప్రతిబింబిస్తుంది. ఇది మూసీ నది తూర్పు తీరంలో ఉంది. హైదరాబాద్​ పాతబస్తీలో ఉన్న చార్మినార్​ను నాలుగు శతాబ్దాల క్రితం క్రీ.శ. 1591–1594 మధ్యకాలంలో ప్లేగు వ్యాధిని పూర్తిగా నిర్మూలించిన సందర్భంగా(అదృష్ట సంకేతంగా) గోల్కొండ నవాబు మహ్మద్​ కులీ కుతుబ్​ షా నిర్మించాడు. కుతుబ్​షాహీల కాలంలో చార్మినార్​ దగ్గర ముత్యాలు, వజ్రాల వ్యాపారం జరిగేది. క్రీ.శ.1645లో ఫ్రెంచ్​ నగల వర్తకుడు ట్రావెర్నియర్​ చార్మినార్​ దగ్గర 60వేల మంది కార్మికులు ముత్యాల తయారీలో నిమగ్నమై ఉండగా తాను కళ్లారా చూసినట్లు రాశాడు. 

హుస్సేన్​ సాగర్​: ఈ చెరువును 1562లో ఇబ్రహీం కులీకుతుబ్​ షాహీ అల్లుడైన హుస్సేన్​ షా తవ్వించాడు. దీనిపైన నిర్మించిన వంతెననే ట్యాంక్​బండ్​ అంటారు. ఇది జంటనగరాలైన హైదరాబాద్​, సికింద్రాబాద్​ల మధ్య వారధిలాగా ఉంటుంది. హుస్సేన్​సాగర్​ మధ్యలో ఏకశిలా బుద్ధవిగ్రహాన్ని ఎన్​టీఆర్​ ఏర్పాటు చేశారు. హుస్సేన్​సాగర్​ చుట్టూ పలువురు తెలుగు ప్రముఖుల విగ్రహాలు ఈ సాగర్​కు మరింత అందాన్ని చేకూర్చాయి.