
కొన్నిసార్లు తిన్నది అరగదు. కడుపంతా టైట్‌గా ఉంటుంది. ఇదేకాకుండా పొట్టలో మంట... కడుపు నొప్పి, ఎసిడిటీ, అల్సర్స్, రక్తపు విరేచనాలు వంటివి చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్లనూ ఇబ్బంది పెడుతుంటాయి. ఇవన్నీ గ్యాస్ట్రిక్ సమస్యల్లో భాగమే. చిన్నగా మొదలై, కంటిమీద కునుకు లేకుండా చేస్తాయి. అందుకని ఈ ప్రాబ్లమ్స్‌కి కారణాలు తెలుసుకుని వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదంటే సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంది అంటున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్లు.
పిల్లల్లో, పెద్దవాళ్లలో కడుపునొప్పి అనేది సాధారణంగా కనిపిస్తుంది. టైంకి తినకపోవడం లేదా అస్సలు తినకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. బయటిఫుడ్, నూనెలో వేగించిన ఫుడ్, జంక్‌ఫుడ్ అరగక కడుపునొప్పి వస్తుంది. అందుకు కారణం... జంక్‌ఫుడ్‌లో మోనోసోడియం గ్లుటామేట్ వంటివి వేయడమే. బేకరీ ఫుడ్‌లో ఉప్పు, కాల్షియం కూడా ఎక్కువ. అందుకనే ఇవి తింటే పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ పెరిగి, మంటగా ఉంటుంది.
పిల్లల్లో...
నూనె పదార్థాలు, జంక్‌ఫుడ్, చిప్స్‌తో పాటు స్వీట్లు ఎక్కువ తినే పిల్లలు కడుపునొప్పి, ఎసిడిటీతో బాధపడతారు. అంతేకాదు కొందరు పిల్లలు గుర్తుచేస్తే తప్ప నీళ్లు తాగరు. దాంతో డీహైడ్రేట్ అవుతారు. శరీరంలో నీళ్లు తగ్గినా కూడా ఎసిడిటీ వస్తుంది. రెడీటు ఈట్ఫుడ్లోని ప్రిజర్వేటివ్స్ కూడా పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
పెద్దవాళ్లలో...
వయసు పైబడినవాళ్లు అన్నిరకాల ఫుడ్స్‌ని జీర్ణం చేసుకోలేరు. అలాగే టైంకి తినరు. వీళ్లలో అజీర్తి మాత్రమే కాకుండా ఎసిడిటీ కూడా ఎక్కువే. అందుకని వాళ్లకు తొందరగా అరిగే ఫుడ్ పెట్టాలి. అలాగే కొందరు సరిపోను నీళ్లు తాగకపోవడం వల్ల ఎసిడిటీ బారిన పడతారు.
ఎసిడిటీకి కారణాలివి...
ఫుడ్ తిన్న వెంటనే పొట్టలో జీర్ణరసాలు, యాసిడ్స్ విడుదలవుతాయి. టైంకి తినకుంటే ఈ యాసిడ్స్ వల్ల పొట్టలో మంటగా ఉంటుంది. దీన్నే ‘ఎసిడిటీ ’ అంటారు. రోజూ మూడు లీటర్ల నీళ్లు తాగకున్నా, ఎక్కువ సేపు ఉపవాసం ఉన్నా కూడా ఎసిడిటీ వస్తుంది. కొందరిలో రక్తపు విరేచనాలు అవుతాయి. మలంలో రక్తం వస్తుంటే.... అది ఎర్రగా ఉందా? ముదురు రంగులో ఉందా? అనేది గమనించాలి. రక్తం ముదురు రంగులో ఉంటే పొట్టలో అల్సర్లు ఉన్నాయని అర్థం. అలాకాకుండా ఎర్రగా ఉంటే మల ద్వారంలో ఇన్ఫెక్షన్లు ఉన్నట్టు గ్రహించాలి. అన్నవాహిక, పొట్టలో క్యాన్సర్ గడ్డలు ఉన్నా కూడా రక్త విరేచనాలు అవుతాయి. అందుకని ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఎండోస్కోపి, కొలనోస్కోపి చేయించాలి.
నిద్ర తక్కువై
పని ఒత్తిడి, నిద్రలేమి వల్ల చాలామంది స్లీపింగ్ టైమింగ్స్ పాటించరు. రాత్రి పదకొండు నుంచి ఉదయం నాలుగ్గంటల వరకు కార్టిసాల్ జీరో అవుతుంది. ఆ టైంలో కచ్చితంగా నిద్రపోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్ల కారణంగా కూడా ఎసిడిటీ వస్తుంది.
పిత్తాశయంలో రాళ్లు
గాల్ బ్లాడర్ (పిత్తాశయం)లో రాళ్లు ఏర్పడినప్పుడు పొట్ట కుడివైపు పైభాగంలో నొప్పి వస్తుంది. ఒక్కోసారి కుడి భుజం దగ్గర, వెనకాల కూడా నొప్పి ఉంటుంది. టైంకి తినకపోవడం, డీహైడ్రేషన్ వల్ల పిత్తాశయంలో ఈ రాళ్లు ఏర్పడతాయి. అంతేకాదు ఎసిడిటీ ఉందని నీళ్లు తాగరు చాలామంది. దాంతో పిత్తాశయంలో రాళ్లు వస్తాయి. కొన్నిసార్లు రక్తహీనత వల్ల కూడా ఎసిడిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
హియటస్ హెర్నియా
కొన్నిసార్లు ఛాతిలో నొప్పితో బాధపడతారు కొందరు. దీన్ని హార్ట్‌బర్న్ అంటారు. ఈ సమస్య ఎలా వస్తుందంటే... అన్నవాహిక, జీర్ణాశయం కలిసే ప్రాంతాన్ని జి–ఇ జంక్షన్ (గ్యాస్ట్రోఈసోఫేజియల్ జంక్షన్) అంటారు. అందరిలో ఇది మూసుకుని ఉంటుంది. అయితే కొందరిలో పుట్టుకతో లేదా అలవాట్ల కారణంగా ఈ జంక్షన్ తెరచి ఉంటుంది. డయాబెటిస్, ఒబెసిటీ సమస్య ఉన్నా ఇలా జరుగుతుంది. తిన్న వెంటనే నిద్రపోయేవాళ్లలో ఛాతిలో మంటగా ఉండడానికి కారణం... ఈ జంక్షన్ సరిగా మూసుకోకపోవడం వల్ల పొట్టలోని యాసిడ్స్, బైల్స్ వంటివి అన్నవాహికలోకి వస్తాయి. దీన్ని ‘హియటస్ హెర్నియా’ అంటారు. దాంతో ఛాతిలో మంట అనిపిస్తుంది. అందుకని తిన్న వెంటనే కాకుండా రెండు గంటల తర్వాత నిద్రపోవాలి. మరికొందరికి తిన్న గంట రెండు గంటలకే వాంతులు అవుతాయి. ఇలా జరుగుతుంటే కనుక ఆపరేషన్ అవసరం పడుతుంది.
అల్సర్లు వస్తాయిలా..
ఎసిడిటీ సమస్య అలాగే ఉంటే అల్సర్లకు దారితీస్తుంది. పేగుల్లోని మందమైన మ్యూకస్ పొర తగ్గినప్పుడు అల్సర్స్ వస్తాయి. వీటిని ‘గ్యాస్ట్రిక్ అల్సర్స్’ అంటారు. కొన్నిసార్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కూడా వీటికి కారణమవుతాయి. కడుపంతా నొప్పి ఉంటుంది. బరువు తగ్గుతారు. వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
డయాగ్నసిస్
ఎండోస్కోపీ, కొలనోస్కోపీతో పాటు అల్ట్రాస్కోపీ కూడా చేస్తారు. ఆహార జాగ్రత్తలతో పాటు యాంటాసిడ్ మందులు వాడితే ఎసిడిటీ రెండు నుంచి మూడు వారాల్లో తగ్గిపోతుంది.
ఈ జాగ్రత్తలు ముఖ్యం
ఉదయం 8 గంటల లోపు, మధ్యాహ్నం 2 లోపు, రాత్రి 8 గంటల లోపు భోజనం చేయాలి. ఎందుకంటే... కార్టిసాల్ అనే హార్మోన్ మెటబాలిక్ ఈటింగ్ టైమింగ్స్‌ని సూచిస్తుంది. రెండు పూటలా పెరుగు తింటే ప్రొబయాటిక్స్ అందుతాయి. జంక్‌ఫుడ్ బదులు అటుకులు, నట్స్, డ్రైఫ్రూట్స్‌తో తయారుచేసిన శ్నాక్స్ తినిపిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.
మంచి బ్యాక్టీరియా తగ్గితే...
జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది... తిన్న ఆహారం తొందరగా అరిగేలా చేయడమే కాకుండా అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. ఫ్యాట్, చక్కెర ఉండే ఫుడ్ ఈ బ్యాక్టీరియాని తగ్గిస్తాయి. మంచి బ్యాక్టీరియా తగ్గితే తరచూ కడుపు నొప్పి వస్తుంది. పెరుగు తిననివాళ్లలో, నీళ్లు బాగా తాగని వాళ్లలో ఈ సమస్య ఎక్కువ. అందుకని ప్రొబయాటిక్స్ ఉండే పెరుగు తినాలి. కొందరిలో ఈ బ్యాక్టీరియా తక్కువైతే ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ (ఐబిఎస్) వస్తుంది. దీన్ని మందులతో తగ్గించొచ్చు. లక్షణాలు తీవ్రంగా ఉంటే ఆపరేషన్ అవసరమవుతుంది.