టీఎస్​పీఎస్సీలో..చేయాల్సిన మార్పులు ఇవే

టీఎస్​పీఎస్సీలో..చేయాల్సిన మార్పులు ఇవే

గ్రూప్​1 పరీక్షలు రద్దు కావడం, గ్రూప్​ 2 పరీక్షలు వాయిదా పడటంతో ఉద్యోగం కాంక్షించే అభ్యర్థుల్లో అశాంతి నెలకొనడం సహజం. తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ చైర్మన్​, మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడం ప్రాధాన్యతని సంతరించుకుంది. అయితే, ఆ రాజీనామాలని రాష్ట్ర గవర్నర్​ ఇంకా ఆమోదించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్​ కమిషన్​ను సరిదిద్దే క్రమంలో జాప్యం ఏర్పడింది. 

గత నవంబర్​లో కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ అశోక్​ నగర్​లోని యువతతో ముచ్చటించారు. ఆ యువత ఉద్యోగ ఆన్వేషణలో అలసిపోతున్న వ్యక్తులు. ఆ తర్వాత ఆయన ఎక్స్​లో ఇలా రాశారు. ‘ఈ రోజు హైదరాబాద్​లోని అశోక్​నగర్​లో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతను కలిశాను. తెలంగాణ వస్తే తాము విజయం సాధిస్తామని వాళ్లు ఆశించారన్న వాస్తవం నన్ను కదిలించింది. కానీ, తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు గడుస్తున్నా వారి ఆకాంక్షలు నెరవేరలేదు. ఈ పదేండ్ల పాలనలో తెలంగాణ యువతకు న్యాయం జరగలేదని, నోటిఫికేషన్లు లేకపోవడం, కోర్టు కేసులు, పేపర్​ లీకేజీల వల్ల  30 లక్షల మంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయినారని, పోరాడి సాధించుకున్న తెలంగాణలో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు’  అన్నారు.  ఆయన అక్కడితో ఊరుకోలేదు. ఆ యువత కలలను నిజం చేయడం మన కర్తవ్యం. తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్​ విడుదల చేశామని కూడా రాహుల్​ అన్నారు.

గ్రూప్​1 పరీక్ష రద్దు

గ్రూప్​1  ప్రిలిమినరీ పరీక్షను పేపర్​ లీకేజీ కారణంగా సర్వీస్​ కమిషన్​ రద్దు చేసింది. ఆ తర్వాత జూన్​11న మళ్లీ ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో మార్గదర్శకాల ఉల్లంఘన జరిగిందని చాలా మంది విద్యార్థులు అనేక పిటిషన్లను దాఖలు చేశారు. వాటి కారణంగా ఆ పరీక్షలను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. మళ్లీ పరీక్షలు నిర్వహించకుండా కమిషన్​ సుప్రీంకోర్టుకు వెళ్లిందని ఒక వార్త.

 పున:పరిశీలన అధికారం రాష్ట్ర ప్రభుత్వానిది కాదు

కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్​ ప్రొఫెసర్​ వినాయకరెడ్డి తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ సభ్యుల నియామకం గురించి హైకోర్టులో రిట్​ పిటిషన్​ దాఖలు చేశారు. గత జూన్​ నెలలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని డివిజన్​ బెంచ్​ వారి ఔన్నత్యం గురించి, యోగ్యత గురించి పున:పరిశీలన చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరుగురు సభ్యుల నియామకం సర్వీస్​ కమిషన్​ రెగ్యులేషన్స్ లోని 3(2) (ఎ)(బి)లకు వ్యతిరేకమని వారి నియామకాలు చట్టవ్యతిరేకమని వినాయక రెడ్డి తన ప్రజాహిత కేసులో పేర్కొన్నారు. వారి నియామకాలను పున:పరిశీలించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఆ అధికారం రాజ్యాంగ కోర్టులకు మాత్రమే ఉంది. హైకోర్టు అలాంటి నిష్ఫల ఆదేశాలను ఎందుకు జారీ చేసిందో మనకు తెలియదు. ఆ ఉత్తర్వుల మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో అసలే తెలియదు.

కమిషన్లు రాజ్యంగబద్ధ సంస్థలు

యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​, రాష్ట్ర పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​లు రాజ్యాంగబద్ధ సంస్థలు. రాజ్యాంగంలో 315 నుంచి 323 వరకు ఉన్న ఆర్టికల్స్​ వీటిని
నియంత్రిస్తాయి. ఈ కమిషన్లలో  నియమించే  సభ్యుల గురించి, వారి నియామకం, తొలగింపు ఆధికారాలు, విధులు, వాటి స్వతంత్రత లాంటి విషయాలు అన్నీ ఈ ఆర్టికల్స్​లో ఉన్నాయి. టీఎస్​పీఎస్సీ​లో ఎంతమంది సభ్యులు ఉండాలన్న విషయాన్ని రెగ్యులేషన్లలో చెప్పారు. ఈ కమిషన్​ చైర్మన్​ను, సభ్యులను రాష్ట్ర గవర్నర్​ నియమిస్తారు. ఇది రాజ్యాంగబద్ధసంస్థ. కానీ, ​చైర్మన్​కు, సభ్యులకు ఎలాంటి అర్హతలు ఉండాలో రాజ్యాంగంలో చెప్పలేదు. ఎవరినైనా నియమించే అధికారం రాష్ట్ర గవర్నర్​కు ఉంటుంది. వారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు. అయితే వారికి 10 సంవత్సరాల ఉద్యోగ అనుభవం ఉండాలి. వీరి జీతభత్యాలను గవర్నర్​ నిర్దేశిస్తారు. వీరి పదవీ కాలం 6 సంవత్సరాలు. వయసు 62 సంవత్సరాలకు పరిమితం. 
 
తొలగించాలంటే..

చైర్మన్​  కానీ, సభ్యులు కానీ తమ రాజీనామాను గవర్నర్​కు సమర్పించి వైదొలగవచ్చు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్​ సర్వీస్​  కమిషన్​  చైర్మన్​ మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను గవర్నర్​ ఇంతవరకు ఆమోదించలేదు. అందుకు కారణాలు తెలియరాలేదు. రాష్ట్ర పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ సభ్యులను, చైర్మన్​లను రాష్ట్ర గవర్నర్​ నియమిస్తారు. కానీ వారిని తొలగించే అధికారం రాష్ట్ర గవర్నర్​కు లేదు. రాష్ట్రపతి మాత్రమే తొలగించగలరు. ఈ కారణాలు ఉన్నప్పుడు మాత్రమే తొలగించొచ్చు అవేంటంటే.. దివాలా తీసినట్టు కోర్టు నిర్ణయించినప్పుడు, వేరే విధులు అతను నిర్వర్తిస్తున్నప్పుడు, అనారోగ్యం వల్ల, బలహీనతల కారణంగా అతను పదవిలో కొనసాగే పరిస్థితిలో లేనప్పుడు అతన్ని తొలగించే అవకాశం ఉంది. చెడు నడవడిక మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపిన తర్వాత, అది రుజువైతే తొలగించవచ్చు. అదేవిధంగా వారిని సస్పెండ్​ చేయవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కాంట్రాక్టు, అగ్రిమెంట్లలో పాల్గొన్నప్పుడు వారిని తొలగించవచ్చు. అంతేకానీ మామూలుగా తొలగించే అవకాశం లేదు. 

రెగ్యులేషన్స్​ సరిగా లేకపోవడం..

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​లో సరిగ్గా పనిచేయకపోవడానికి కారణం.. చైర్మన్​, సభ్యులు అధికారాలు, విధుల పరిధిని సరిగ్గా రెగ్యులేషన్స్​లో ఏర్పాటు చేయకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అదేవిధంగా సెక్రటరీ పరిధిని కూడా రెగ్యులేషన్స్​లో ​సరిగ్గా పొందుపర్చలేదు. ఫలితంగా కాన్ఫిడెన్షియల్​ విషయాలు సెక్రటరీ అధీనంలో ఉండాలి. వాటిని చైర్మన్​ అతిక్రమించినట్లు అనిపిస్తుంది. యూపీలాంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ అధికారాలను, విధులను ఏర్పాటు చేస్తూ చట్టాలను తయారు చేశారు. అలా చేయడం వల్ల శాసన వ్యవస్థలో చర్చ జరిగి ఆ రెగ్యులేషన్స్​ చట్టరూపం దాలుస్తాయి. ఇపుడున్న రెగ్యులేషన్స్​లో  సభ్యుల పాత్రను సరిగ్గా ఏర్పాటు చేయలేదు. ఆ రెగ్యులేషన్స్​ను సంపూర్ణంగా పరిశీలించకుండా తయారు చేసినట్టుగా ఉంది. కమిషన్​ మీటిం గుల్లో చర్చలు క్షుణ్ణంగా జరగాలి. అవి మినిట్స్​లో ప్రతిబింబించాలి. 

మాన్యువల్​ పరిశీలించలేదు

అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్​ సర్వీస్​ కమీషన్​ మాన్యువల్​ను క్షుణ్ణంగా  పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న మాన్యువల్​ను ప్రభుత్వం పరిశీలించలేదు. ఆమోదించనూ లేదు. అది సోమేశ్​ కుమార్ వ్యక్తిగత హోదాలో, అప్పటి చైర్మన్​ పదవీ విరమణ చేస్తున్న రోజు ఆవిష్కరించారు. ప్రభుత్వ అనుమతిని సెక్ర టరీలు తీసుకున్నట్టుగా అన్పించలేదు. దాని వల్ల ఈ గందరగోళ పరిస్థితులు ఏర్పడినాయని అనిపిస్తున్నది.

మంచి స్టాఫ్​ను నియమించుకోవాలి

పనిచేయలేనివారిని కాకుండా మంచి స్టాఫ్​ను ఎంపిక చేసి కమిషన్​లో పోస్టు చేయాలి. మంచి అధికారులను వేరే డిపార్ట్​ మెంట్​ల నుంచి  తీసుకొని వచ్చి కమిషన్ లో పోస్టు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చైర్మన్​ సభ్యుల పదవీ విరణ వయస్సు 62 సంవత్సరాలు. కేంద్ర సర్వీసు అధికారుల పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలు. అలాంటి పరిస్థితుల్లో ఈ బాధ్యతలు తీసుకోవడానికి ఏ అధికారులు వస్తారు? మంచి అధికారులు ఈ బాధ్యతలు స్వీకరించడానికి ఇష్టపడరు.  రాష్ట్ర పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ లో నెలకొని ఉన్న పరిస్థితులు పునరావృత్తం కావన్న గ్యారంటీ ఏముంది?  మంచి అధికారులు వచ్చినా  రెండు సంవత్సరాల కాలం కమిషన్​ను అర్థం చేసుకోవడానికే సరిపోతుంది.  అర్థమయ్యేలోపు వాళ్లు పదవీ విరమణ చేస్తారు. యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ మాదిరిగా వీరి పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలకు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్టేట్​ సబార్డినేట్​ నియమాలను, డిపార్ట్​ మెంట్ సర్వీస్​​ నియమాలను తక్షణం మార్చాల్సిన అవసరం ఉంది.లిటిగేషన్​కు దూరంగా  సెలక్షన్​ ప్రక్రియ జరిగే విధంగా చర్యలు చేపట్టాలి. సర్వీస్​ కమిషన్​ విషయాలని సమన్వయ పరచడానికి జనరల్​ అడ్మినిస్టేషన్​ డిపార్ట్​మెంట్​లో  ఓ వింగ్​ను కూడా ఏర్పాటు చేయాలి.

కొత్త ప్రభుత్వమే సంస్కరించాలి

పబ్లిక్​ సర్వీస్​  కమిషన్​ విషయంలో  చాలా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రెగ్యులేషన్స్​ను, మాన్యువల్​ను సంస్కరించాల్సిన అవసరం ఉంది. కొత్త ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుందన్న అశ మాకు ఉంది.

- డా. మంగారి రాజేందర్, - డి. కృష్ణారెడ్డి,
(ఇద్దరూ గతంలో టీఎస్​పీఎస్సీ సభ్యులుగా పనిచేశారు)