గత ప్రభుత్వం మిగిల్చిన గుదిబండలకు పరిష్కారాలేవి?

గత ప్రభుత్వం మిగిల్చిన గుదిబండలకు పరిష్కారాలేవి?

తెలంగాణ అభివృద్ధి దిశను మార్చకుండా, ప్రస్తుత దశను సమీక్షించక ముందే తెలంగాణాలో కొత్త ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు పాతను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నది. కొత్త పాలకులు పోయిన ప్రభుత్వం అవినీతిని ఎత్తి చూపుతూ అదే దారిన నడిచే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రశేఖర రావు ప్రభుత్వం చేసిన తప్పులలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం మాత్రమే కాదు.. తీసుకున్న నిర్ణయాలు,  చేపట్టిన ప్రాజెక్టులు, రుద్దిన పరిష్కారాలు, చేసిన అప్పులు, మార్చిన పాలనా సంస్కృతి, మిగిల్చిన గుదిబండలు సమస్యాత్మకమైనాయి. తెలంగాణ గుండెల మీద మిగిల్చిన గుదిబండలు కేవలం ప్రాజెక్టులే కాదు..ఇందులో విధానాలు, జీవోలు, రహస్య పాలనా పద్ధతులున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే వచ్చినా, సమయం ఇవ్వాలి అని ధ్యాస ఉన్నా, చేస్తున్న ప్రకటనలు, నిర్వహిస్తున్న సమావేశాలు, కొనసాగిస్తున్న పద్ధతులు నిరాశాజనకంగా ఉన్నాయి.

రాగానే పరిశ్రమల యజమానులతో, సినీ తారలతో, రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖులతో ఇక్కడ, విదేశాలలో సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వ పెద్దలు వేల మంది ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలతో, కాలుష్యం బారిన పడిన అభాగ్యులతో, రైతులతో, చితికిపోతున్న చేతి వృత్తిదారులతో, ధరణి బాధితులతో సమావేశాలు నిర్వహించకపోవటం శోచనీయం. అహంకార ప్రభుత్వం పోవడానికి, అధికార మార్పిడి దోహదపడిన వర్గాలతో కాకుండా దానికి దాసోహం అయిన వ్యక్తులతో పదేపదే సమావేశమవ్వడం ఇచ్చే సంకేతాలు ప్రజలను బాధపెడుతున్నాయి. 

ధనిక రాష్ట్రం పేర జరిగింది దోపిడీ

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో చంద్రబాబు నాయుడు పాలనలో ప్రపంచ బ్యాంకు పెట్టిన షరతుల కంటే పదింతల ఒత్తిడి ఇప్పుడు తెలంగాణ మీద ఉన్నది. ధనిక రాష్ట్రంగా తెలంగాణా ప్రజలను మభ్యపెట్టి ప్రజల ఆస్తులను వివిధ రూపాలలో ‘దోపిడీ’ చేసిన విధానాలను కొత్త ప్రభుత్వం ఎందుకనో సమీక్షించలేదు.  ఇసుక, మట్టి, బొగ్గు, రాళ్ళు, కంకర, సున్నం తదితర ఖనిజాల ఆదాయం ఎక్కువ అయ్యింది. చట్ట వ్యతిరేకంగా, అనుమతులు లేని ఖనిజ దోపిడీ లెక్కకే లేదు. దాదాపు అందరు ఎమ్మెల్యేలు, వారి అనుచరగణం ఆదాయం కూడా ఇక్కడే కేంద్రీకృతం అయ్యింది. ఎంత ఎక్కువ మైనింగ్ చేస్తే అంత ప్రభుత్వానికి, ఈ రాజకీయ గణానికి సంపద. నష్టం ఎవరికి? అనేక గ్రామాలు నష్టపోయినాయి. నీరు అడుగంటిపోతున్నది. వ్యవసాయం కుంటుపడింది. గ్రామీణ ఉపాధి తగ్గుతున్నది.

కరెంటు సబ్సిడీ: సాగు ఖర్చులో మెట్ట రైతులకు పెద్ద భారం కరెంటు అని భావించి ఈ సబ్సిడీ ఇస్తున్నారు. కాని, కరెంటులో నాణ్యత లేకపోవటం, అవినీతి, కరెంటు కంపెనీల నిర్వహణలో లోటుపాట్లు ఉన్నాయి. దాదాపు రూ.10 వేల కోట్లు వ్యవసాయ విద్యుత్​కు సబ్సిడీ ఉన్నా, ఆ మేర రైతు జేబులో మిగులుతలేదు.  కరెంట్ సంస్థలను ‘సోమరులుగా’ మార్చింది. విద్యుత్ రంగం మీద అప్పుల భారం రూ.60 వేల కోట్లు. ఈ అప్పు వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ వల్ల కాలేదు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, నిర్వహణ లోపాలు, మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్ళు వంటి కారణాల వల్ల పేరుకుపోయింది. సరి అయిన సమయంలో సంపూర్ణ పరిష్కార నిర్ణయాలు తీసుకోకుంటే భారం అతి తొందరగా రెట్టింపు కావచ్చు. 

గత ప్రభుత్వం మిగిల్చిన గుదిబండలకు పరిష్కారాలేవి?దీనిని కట్టటానికి కనీసం రూ.12 వేల కోట్లు అయ్యింది. ఇంత వరకు ఆడిట్ జరగలేదు. మొత్తం ఎంత అయ్యింది ఖచ్చితంగా తెలవదు. కాని, హెచ్​ఎండీఏ అప్పుల పాలయ్యింది. అప్పులు తీర్చటానికి అది భూముల వ్యాపార సంస్థగా మారింది. చివరికి,  రింగ్ రోడ్డు కూడా అమ్మేశారు. ఈ రింగ్ రోడ్డు కట్టటానికి అనేక గ్రామాల వనరులు ఉపయోగించారు. వేల కుటుంబాలకు నష్టం జరిగింది. సంపద కొందరికి పెరిగింది. అసలు లక్ష్యం నెరవేరలేదు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్: కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు, ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. రూ.80 వేల కోట్ల నుంచి రూ.1.5 లక్షల కోట్లకు పెరిగింది. ఆడిట్ జరిగితే కాని ఎంత అయ్యింది తెలవదు. దాదాపు రూ.2 లక్షల కోట్లకు చేరవచ్చు. మేడిగడ్డ బ్యారేజి పగుళ్ళ నేపధ్యంలో ఇంకా ఎంత ఖర్చు చేస్తే ఫలితం వస్తుంది తెలవదు. ఇంత పెట్టినా నీళ్ళు వస్తాయా? వచ్చినా ఈ ‘ఖరీదు’ నీళ్ళు ఎట్లా ఉపయోగించాలి?  తెలియదు.
మిషన్ భగీరథ: ఈ ప్రాజెక్టు ఖర్చు రూ.40 నుంచి 60 వేల కోట్లవరకు ఉండవచ్చు. రాష్ట్రమంతట ఇంటింటికి నిరంతరం నీళ్ళు ఇచ్చే లక్ష్యంతో మొదలుపెట్టిన ఈ పథకానికి అనేక తూట్లు ఉన్నాయి. మూల ధన పెట్టుబడి ఒక భారం కాగా నిర్వహణ ఖర్చుల భారం దీనికి అదనం. నిర్వహణ ఖర్చు పెట్టకుంటే మూల ధన పెట్టుబడి మృగ్యం అయితుంది. నిర్వహించాలంటే ‘అప్పు’ చేయాల్సిందే. ఇంతకి నీళ్ళు దక్కుతాయా అంటే నీళ్ళు నమిలే పరిస్థితి. వదిలేస్తే ఒక భారం. పట్టుకుంటే ఇంకా భారం.

రైతుబంధు: సాగు ఖర్చులు పెరుగుతున్నాయి, అందుకే ఎరువుల సబ్సిడీ ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించి దానికి రైతు బంధుగా నామకరణం చేసింది. కాగా, అప్పుడు ఇప్పుడు ఈ సాగు ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయి అనే సమీక్ష చేయలేదు. హరిత విప్లవం పేరిట విత్తనాలు, ఎరువులు, ఇంకా ఇతర వనరులు కంపెనీలకు అప్పజెప్పిన నేపధ్యంలో సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. సాగు ఖర్చులు తగ్గించే ఉపాయం సహజ వ్యవసాయంలో ఉన్నది. దాని మీద పెట్టుబడి పెడుతూ, క్రమంగా రైతు బంధు తగ్గించుకోవాల్సిన గత ప్రభుత్వం ఎన్నికల కొరకు, అధికారం కొరకు ‘అందరికి’ ఇచ్చి అభాసుపాలయ్యింది. 

ధాన్యం కొనుగోళ్ళు: రైతులు కోరిన, కోరుతున్న పంటకు గిట్టుబాటు ధర అందించకుండా, ఒక విధానం ప్రకటించకుండా గత ప్రభుత్వం వంద శాతం వరి ధాన్యం కొనుగోళ్ళు చేసి దాదాపు రూ.56 వేల కోట్ల అప్పు మిగిల్చింది. అవినీతికి ఆజ్యం పోసింది. రాజకీయ నాయకుల సంపద పెంచింది. చివరికి ధాన్యం రైతుకు ‘అన్యాయమే’ మిగిలింది. రైతు పంటకు గిట్టుబాటు ధర అందించేందుకు కొత్త ప్రభుత్వం ఇప్పటికీ నడుము బిగించలేదు. మంత్రివర్గంలో ఈ విషయం చర్చకే రాలేదు. 

మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్ళు: విద్యుత్ సంస్థల పైన అనాలోచిత నిర్ణయాల వల్ల పడిన భారం రూ.81 వేల కోట్లు. ఈ భారం పెరగటానికి అనేక కారణాలు ఉన్నాయి. స్వల్పకాలిక, మార్కెట్ కొనుగోళ్ళు కూడా ఒక కారణం. చేసిన స్వల్పకాలిక మార్కెట్ కొనుగోళ్ళు 2014-–15 నుంచి 2023–-24 (నవంబర్ నాటికి) రూ.79 వేల కోట్లు. ఒక్కోసారి యూనిట్ రూ.20 పెట్టి కూడా కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచుతూ, నిరంతర విద్యుత్ సరఫరాకు కొన్నారు అంటే అర్థం ఉన్నది. ఏ ఉత్పత్తి, ఏ సేవ  కొనసాగడానికి ఈ కొనుగోళ్ళు చేశారు? వ్యవసాయం అని సమాధానం వస్తుంది. కాని అది ప్రధాన కారణం కాదు. హైదరాబాద్ నగరం జిగేలులకు, కొన్ని రకాల పరిశ్రమల కొరకు, పశ్చిమాన రియల్ ఎస్టేట్ అభివృద్ధికి, హైదరాబాద్ ఇమేజ్ కొరకు, వ్యక్తిగత పోకడలకు కొన్నారు. ఇప్పుడు ఈ భారం అందరి మీద పడనున్నది.

హైదరాబాద్ మెట్రో రైలు: 2008లో హైదరాబాద్ నగర ప్రజా రవాణా సమస్యకు పరిష్కారంగా చేపట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టు రూ.14 వేల కోట్లతో భారం మోపింది. కేవలం 5 లక్షల మంది మాత్రమే ప్రయాణించే వీలు ఉన్నది. ఇంకొక రూటు నిర్మాణం మొదలు పెట్టనే లేదు. నగరం నడిబొడ్డున 300 ఎకరాల పైన ప్రైవేటుకు కైంకర్యం అయ్యింది. నిర్మాణ సంస్థ కూడా నష్టాలు వస్తున్నాయి అంటున్నది. 

యాదాద్రి థర్మల్ కేంద్రం: ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రారంభ మూలధన వ్యయం రూ.25,099 కోట్లు (రూ. 6.27 Cr/MW). తాజా DPR ప్రకారం ప్రాజెక్ట్ వ్యయం రూ. 34,543Cr (రూ. 8.64Cr /MW). పూర్తి అయ్యేసరికి ఇంకొక రూ.7 వేల కోట్లు పెరగవచ్చు. అప్పటికి ధర యూనిట్ రూ.9 పెట్టి కొనేవారు ఉండరు. కొన్నా భారమే. కొనకున్నా భారమే. అది పని చేసే చుట్టుపక్కల 25 కి.మీ. వరకు కాలుష్యం. అమ్రాబాద్ పులి సంరక్షణ కేంద్రం, కృష్ణా నది, వగైరా ప్రకృతి వనరులు కలుషితం అవుతాయి. 

భద్రాద్రి థర్మల్ కేంద్రం: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ సబ్‌క్రిటికల్ టెక్నాలజీతో రూ.7290 కోట్ల (రూ.6.75 కోట్లు/మెగావాట్ల) వ్యయంతో రెండేళ్లలో పూర్తి చేయాలని భావించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయ్యేసరికి 7 సంవత్సరాలు, దాదాపు రూ.9 వేల కోట్లు ఖర్చు అయ్యింది. సగటు యూనిట్ ధర రూ.9.74 Cr/MW పెరిగింది. ఇది కూడా కాలుష్యం చేసే ‘ఖరీదు’ అయినా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. ఇక్కడి విద్యుత్ కొంటే భారం. కొనకుంటే పెట్టుబడులు మృగ్యం.

మూసీ ప్రక్షాళన: మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు రూపకల్పనకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్ ప్రకటనలోనే దీనికి దాదాపు రూ.58 వేల కోట్లు ఖర్చు అవుతుంది అని ఉంది. ప్రాజెక్టు అంచనా ముందే రావడం సంగతి ఒకటి అయితే ఈ పెట్టుబడి కూడా అప్పుల నుంచే రావాలి. ఇంత అప్పు చేస్తున్న ప్రాజెక్టు లక్ష్యం ఏమిటి? అప్పు లేకుండా మూసీ ప్రక్షాళన సాధ్యం కాదా?  పెద్ద ప్రాజెక్టులు అనాలోచితంగా కట్టటం, దాని ఉపయోగం కొరకు మళ్లీ కొన్ని కార్యక్రమాలు చేపట్టటం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది.

మెట్రో రైళ్ళు: 2022లో ఎయిర్‌పోర్ట్ ఎక్స్​ప్రెస్ లైన్ కడతామని గతప్రభుత్వం డీపీఆర్​ ప్రకటించింది.  కొత్త ప్రభుత్వం వచ్చింది. అప్పటి లైన్ రద్దు అయ్యింది. 70 కి.మీ కొత్త మార్గాలు ప్రకటించింది. దీనికి ఎంత ఖర్చు అవుతుందో DPR వస్తే తెలుస్తది. కనీసం రూ.30 వేల కోట్లు కావచ్చు. మెట్రో రైల్ ఒక కమర్షియల్ ప్రాజెక్ట్. ప్రజల ప్రయాణం తీరు బట్టి, వ్యాపార అవకాశాల బట్టి మార్గాలను ఎంచుకుంటారు. కానీ, తెలంగాణాలో ముఖ్యమంత్రులు మార్గం నిర్ణయించటం, ఆ విధంగా ప్రణాళికలు తయారు చేయటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఏకపక్ష నిర్ణయాలు వద్దు

పాత భారం తగ్గించుకోవడానికి ఉపాయం కావాలి. కొత్త భారం నివారించే విజ్ఞత కావాలి. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి. లేకుంటే ప్రజల మీద భారం ఇంకా పెరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్, నీళ్ళు, రవాణా, హైదరాబాద్ అభివృద్ధి, వ్యవసాయం వంటి కీలక అంశాల మీద ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇప్పటికే గత ప్రభుత్వం మిగిలించిన భారంతో మౌలిక సదుపాయాల మీద పెట్టుబడులు పెట్టడానికి నిధులు లేవు. ఉన్న వాటిని సరి చేయడమే గగనం కానున్నది. 
వాటి మీద దృష్టి పెట్టకుండా పెట్టుబడిదారులే లక్ష్యంగా ప్రాజెక్టులు ప్రకటించటం సబబు కాదు. ఈ గుదిబండల మీద ప్రభుత్వం విస్తృత సంప్రదింపులు చెయ్యాలి. అవినీతిని తేల్చి, బాధ్యులైనవారికి శిక్షపడేటట్లు చేయాలి. ఆయా ప్రాజెక్టులను ఎట్లా ఉపయోగించాలి అని కూడా ఆలోచించాలి. అదనపు ఖర్చు కాకుండా వేయాల్సిన అడుగుల గురించి సంప్రదింపులు చెయ్యాలి. తగిన వ్యూహాలు రచించాలి.

పాలసీ వాచ్​

- డా. దొంతి నర్సింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​