వద్దన్నవాళ్లే... వావ్! అంటున్నారు

వద్దన్నవాళ్లే... వావ్! అంటున్నారు

క్రికెటంటే ప్రాణం వాళ్లకు. ఆడటం తప్ప ఇంకేమీ తెలియదు వాళ్లకి. అద్భుతమైన ఆటతో ఇంటా బయటా గెలిచారు. ఎన్నో ప్రశంసలు... మరెన్నో అవార్డులు.  కానీ ఇదంతా కొన్ని నెలల కిందటి మాట. కొంత కాలంగా వాళ్లంతా ఫామ్ లేమితో సతమతమవుతున్నారు. అందుకే 2022 ఐపీఎల్ కు ముందు వాళ్లను పట్టించుకున్న వాళ్లే లేరు. ఐపీఎల్ 2022 వేలంలో... ఫ్రాంఛైజీలు వాళ్లను అయిష్టంగానే కొనుగోలు చేశాయి. అయితే  వాళ్లను  తుది జట్టులోకి తీసుకోవడం కష్టమన్నారు కొందరు. అసలు సెలెక్ట్ చేయడమే దండగన్నారు మరికొందరు. వాళ్లమీద ఎవరికీ కూడా ఏమాత్రం అంచనాలు లేవు. కానీ కాలం గిర్రున తిరిగింది. ఇప్పుడు వాళ్లంతా భీకర ఫామ్ లో ఉన్న స్టార్ ప్లేయర్లు. ఒంటి చేత్తో విజయాలు అందిస్తూ తమ జట్లను పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంచారు. 

ఇంతకు వాళ్లెవరంటే...

1.డేవిడ్ వార్నర్ 

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇతడు. 2021 ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. కానీ ఆ టోర్నీలో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో కెప్టెన్సీ పోయింది. చివరకు టీమ్ మెంబర్ గా కూడా వద్దని సన్ రైజర్స్ హైదరాబాద్ తేల్చి చెప్పింది. కానీ ఇవేమీ అతడిని ఆపలేదు. 2021 టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా తరపున ఆడి ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచాడు. 2022 ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వార్నర్ ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం అతడు భీకర ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే 53.378 సగటుతో 427 రన్స్ చేశాడు. తనను వద్దనుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ పైనే 92 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. 

2. దినేష్ కార్తీక్

ఒకప్పుడు భారత జట్టులో మెయిన్ ప్లేయర్ గా ఉన్న దినేశ్ కార్తీక్... వ్యక్తి గత జీవితంలో జరిగిన ఓ సంఘటనతో ఆటకు దూరమయ్యాడు. కట్టుకున్న భార్య మోసం చేసి ఇంకో వ్యక్తితో వెళ్లిపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. దీంతో ఆ బాధ నుంచి బయటపడటానికి మద్యానికి బానిస అయ్యాడు. ఒకానొక సందర్భంలో సూసైడ్ దాకా వెళ్లాడు. ఇక దినేశ్ కార్తీక్ పనైపోయిందన్నారు అతడి పరిస్థితి చూసిన ప్రతి ఒక్కరు. కానీ అనుకోకుండా తన జీవితంలోకి వచ్చిన దీపికా పల్లికల్... దినేశ్ కార్తీక్ జీవితాన్నే మార్చేసింది. ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతో బాగా నెట్ ప్రాక్టీస్ చేశాడు. 2021  ఐపీఎల్ లో అడుగుపెట్టి 223 రన్స్ తో ఫర్వాలేదనిపించాడు. కానీ ఈ సారి రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తరపున ఆడుతున్న దినేశ్ కార్తీక్... మంచి ఫామ్ తో అదరగొడుతున్నాడు. ఇన్నింగ్స్ చివరిలో వీర బాదుడు బాదుతూ బెస్ట్ ఫినిషర్ గా మారాడు. ఇప్పటికే 57 సగటుతో 285 పరుగులు చేశాడు. ధోనీ నిష్క్రమణతో భారత్ కు మంచి ఫినిషర్ లేకుండా పోయాడు. కానీ ధోనీ ప్లేస్ ను భర్తీ చేసే సత్తా దినేశ్ కార్తీక్ ఉందని రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్ లాంటి లెజెండ్స్ చెబుతున్నారంటే.. అతడు ఏ రేంజ్ లో ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.

3. కుల్ దీప్ యాదవ్


2020 లో ఈ యువ బౌలర్ ఫామ్ లేమితో సతమతమయ్యాడు. దీనికి తోడు యుజ్వేంద్ర చౌహాల్, రవిచంద్రన్ అశ్విన్ రూపంలో పెద్ద పోటీని ఎదుర్కొన్నాడు. ఇక 2020 ఐపీఎల్ చెత్త పెర్మార్మెన్స్ తో విమర్శల పాలయ్యాడు. నాలుగు మ్యాచుల్లో ఒకే ఒక వికెట్ తీసి ఫెయిల్యూర్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. దీంతో 2021 ఐపీఎల్ లో అతడిని పక్కకు పెట్టేశాయి ఫ్రాంచైజీలు. కానీ ఎంతో కష్టంతో 2022 ఐపీఎల్ లో అడుగుపెట్టిన కుల్ దీప్ యాదవ్... ఢిల్లీ క్యాపిటల్స్ కు మోస్ట్ వాంటెడ్ బౌలర్ గా మారాడు. ఆడిన 13 మ్యాచుల్లో 20 వికెట్లు తీసి అద్భుత ఫామ్ లో ఉన్నాడు. 4/14 బెస్ట్ తో బ్యాట్స్ మెన్ ను బెంబేలిత్తుస్తున్నాడు.

4. ఆండ్రూ రస్సెల్

వెస్ట్ విండీస్ కు చెందిన ఈ ఆల్ రౌండర్ కు కూడా 2021 ఐపీఎల్ చేదు అనుభవాన్నే మిగిల్చింది. గత ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ తరపున19 మ్యాచులాడిన రస్సెల్...  కేవలం 183 పరుగులే చేశాడు. ఇక 26.14 యావరేజ్ తో చెత్త పెర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ ను నిరాశపరిచాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే 11 వికెట్లు తీశాడు. కానీ ఈ సారి మాత్రం భయంకరమైన ఫామ్ లో ఉన్నాడు. 13 మ్యాచులు ఆడి 330 రన్స్ చేయడమే కాకుండా... 17 వికెట్లు తీసి బౌలింగ్ లోనూ రాణిస్తున్నాడు. 

5. టి.నటరాజన్


భారత్ కు చెందిన ఈ యువ పేసర్ 2021 ఐపీఎల్ లో ఘోరంగా విఫలమయ్యాడు. గత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడి రెండంటే రెండే వికెట్లు తీశాడు. అనంతరం గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అయితే ఈ సారి మాత్రం చక్కటి బౌలింగ్ తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆడిన 11 మ్యాచుల్లో 18 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ 934. బెస్ట్ 3/10 గణాంకాలు చూస్తే అతడు ఎంత బాగా బౌలింగ్ చేస్తున్నాడో అర్థమవుతుంది. దీంతో నటరాజన్ నేషనల్ టీమ్ కు సెలెక్ట్ కావడం ఖాయమని అందరూ అంటున్నారు. 

6. డేవిడ్ మిల్లర్


ఇక చివరగా సౌత్ ఆఫ్రికాకు చెందిన స్టార్ బ్యాట్స్ మ్యాన్ డేవిడ్ మిల్లర్ 2012 లో ఐపీఎల్ లోకి అరగేట్రం చేశాడు. గత  సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడి... ఫ్యాన్స్ ను నిరాశపరిచాడు. తొమ్మిది మ్యాచులాడి 124 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఈ సారి కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ తో ఆడుతున్న మిల్లర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. 13 మ్యాచులాడి... 57.83 సగటుతో 347 రన్స్ చేశాడు. 7 మ్యాచుల్లో అజేయంగా నిలిచాడు. ఇక చెన్నయ్ తో ఆడిన మ్యాచ్ లో 94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

ఇలా పైన పేర్కొన్న ఆటగాళ్లందరూ ఆటుపోట్లను ఎదర్కొన్నవాళ్లే. అటు జీవితంలో... ఇటు ఆటలో అధ:పాతాలానికి పడిపోయినవాళ్లే. కానీ దాంతోనే వాళ్లు ఆగిపోలేదు. పడి లేచిన కెరటంలా జీవితంలో మళ్లీ లేచారు. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటూ... ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.